Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి కమీషన్ల వల్లే రాష్ట్రానికి కరెంట్ కష్టాలు

టీడీపీ హయాంలో అవార్డులు సాధించిన విద్యుత్ రంగం వైసీపీ పాలనలో అప్పుల్లో మునిగిపోయింది
విద్యుత్ ఉత్పత్తి చేతకాక ఏసీలు ఆపమంటున్నారు, మరో నెల ఆగితే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది రోజుకు ఒక పూటే అన్నం తినండి అంటారేమో
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతకానితనంతో, అవినీతి దన దాహంతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి, రాష్ట్రాన్ని అందకారంలోకి నెట్టారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఓ వైపు విద్యుత్ బిల్లుల మోతలు, మరో వైపు విద్యుత్ కోతలతో ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తిని పెంచలేక చేతులెత్తేసిన ప్రభుత్వం ప్రజలను సాయంత్రం ఏసీలు ఆపు చేయండి, పగలు ప్యాన్లు బంద్ చేయండి అని చెప్పటం సిగ్గుచేటు. ఇప్పుడు కరెంట్ ఉత్పత్తి చేయటం చేతకాక సాయంత్రం 6 నుంచి 10 వరకు ఏసీలు ఆపు చేయమంటున్నారు, మరో నెల ఆగితే వ్యవసాయరంగం సంక్షోభంలో ఉంది రోజుకు ఒక పూటే భోజనం చేయండి అని అంటారేమో. వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అన్ని వ్యవస్ధలను నిర్వీర్యం చేశారు.
అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన జగన్ ..అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే 6 సార్లు కరెంట్ చార్జీలు పెంచి చెప్పిన మాటకు తాను కట్టబడను అన్న విషయాన్ని మరోసారి ప్రజలకు చెప్పారు. విధ్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ. 12,311 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా తీసుకున్న రూ. 24,491 కోట్లు మొత్తం కలిపి ప్రజలపై రెండున్నరేళ్లలో రూ. 36,802 కోట్లు భారం మోపారు. మీ పాలన వైఫల్యాలను, మీ చేతకానితనంతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి ప్రజలపై భారం మోపటం ఎంతవరకు సమంజసం?
జగన్ రెడ్డి తన కమీషన్ల కోసం విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన విద్యుత్‌ సబ్సిడీ విద్యుత్‌ సంస్థలకు తగినంతగా ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా విద్యుత్‌ రేట్లు తగ్గుతున్నవి. విద్యుత్‌ కొనుగోలు ధర రూ.3.12కే లభిస్తున్నది. అయినా జగన్‌రెడ్డి మాత్రం కమిషన్ల కోసం మార్కెట్‌లో రూ.6 నుండి రూ.11 పెట్టి విద్యుత్‌ కొనుగోలు చేశారు. ఈ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నారు. ప్రభుత్వ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల సామర్థ్యం మేరకు విద్యుత్‌ ఉత్పత్తి చేయించి వుంటే మార్కెట్‌లో విద్యుత్‌ కొనాల్సిన అవసరం వుండేది కాదు. మన రాష్ట్రమే ఇతర రాష్ట్రాలకు అమ్మగలిగే స్థితిలో ఉండేది.
గత 5 ఏళ్ల టీడీపీ పాలనలో కరెంట్ కోతలు అనే పదమే ప్రజలకు వినపడలేదు. కానీ జగన్ పాలనలో 5 నిమిషాలకొక సారి కరెంట్ కోతలు విధిస్తున్నారు. టీడీపీ హయాంలో ప్రభుత్వ హయాంలో సౌర, పవన విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని చేసిన ఆరోపణల్ని రెండున్నరేళ్లు దాటినా నిరూపించలేకపోయారు. గత 5 ఏళ్లలో పైసా కూడా ప్రజలపై భారం మోపకుండా మిగులు విద్యుత్ సాధించి కోతల్లేని నాణ్యమైన విద్యుత్ అందించిన ఘతన టీడీపీదే. 5 ఏళ్ల పాలనలో విద్యుత్ రంగం 140అవార్డులు సాధిస్తే వైసీపీ పాలనలో అప్పుల్లో మునిగిపోయింది. ముఖ్యమంత్రి ఇకనైనా విద్యుత్ రంగంపై దృష్టి పెట్టి గాడిలో పెట్టాలి.

LEAVE A RESPONSE