Suryaa.co.in

Features

ఆర్ ఎస్ ఎస్ ఫాసిస్ట్ సంస్థ అయితే నేను కూడా ఫాసిస్ట్ నే

– జయప్రకాశ్ నారాయణ్
ఆయన అమెరికాలో చదువుకై వెళ్లి కమ్యూనిస్ట్ గా మారారు. భారత్ కు తిరిగివచ్చి, స్వతంత్ర పోరాటంలో కమ్యూనిస్టుల `దేశ విద్రోహకర’ పాత్ర చూసిన తర్వాత వారికి బద్ద శత్రువయ్యారు. గాంధీజీ శిస్యుడిగా మారి, సోషలిస్ట్ అయి జవహర్ లాల్ నెహ్రుకు సన్నిహితం అయ్యారు. అయితే ఈ తర్వాత నెహ్రూకు కూడా దూరం అయ్యారు. ఈ మొత్తం ప్రయాణంలో ఆయన ఆర్‌ఎస్‌ఎస్ కు బద్ద వ్యతిరేకిగా మారారు.
“ఆర్‌ఎస్‌ఎస్ వారు ఫాసిస్ట్ కాకపోయినా పూర్తిగా ప్రగతి నిరోధకులు, మహాత్మా గాంధీని హత్యచేశారనే అపవాదు నుండి తప్పించుకోవడం కోసం జనసంఘ్ పార్టీ ప్రారంభించారు. ఆ పార్టీ ముస్లింలపై దాడి చేస్తుంటుంది” అంటూ నిందిస్తుండేవారు. ఆర్‌ఎస్‌ఎస్ కు దూరంగా ఉన్నప్పుడు ఇటువంటి అభిప్రాయలు వ్యక్తం చేశారు. కానీ 1967లో బీహార్ లో కరువు బాధితుల కోసం ఆర్‌ఎస్‌ఎస్ తో కలసి పనిచేసిన తర్వాత తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నారు.
1975లో ఒక ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో పాల్గొంటూ “మీరు ఫాసిస్ట్ అయితే, నేను కూడా ఫాసిస్ట్ నే” అంటూ స్పష్టం చేశారు. దేశంలో మార్పుకోసం ఆయన 1974లో బీహార్ నుండి `ప్రారంభించిన `సంపూర్ణ విప్లవం’ ఉద్యమం గురించి చెబుతూ “బీహార్ ఉద్యమం, ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలు ప్రాథమికంగా ఒకేలా ఉన్నాయి” అని ప్రశంసించారు. జెపి తలపెట్టిన ఉద్యమాన్ని “సమాజ శ్రేయస్సు కోసం ఒక శక్తి” అంటూ అప్పటి ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ చాలక్ బాలసాహెబ్ దేవరాస్ డిసెంబర్ 1974 లో ప్రకటించారు.
తన వలే ఆర్‌ఎస్‌ఎస్ కూడా పరిపాలన వికేంద్రీకరణను కోరుకోవడం, కమ్యూనిజంను పూర్తిగా వ్యతిరేకించడం ముఖ్యంగా ఆయనను ఆకట్టుకున్నాయి. దేశంలో కాంగ్రెస్ తో సహా అన్ని రాజకీయ పార్టీలు పశ్చిమ దేశాల నుండి దిగుమతి చేసుకున్న సిద్ధాంతాలు వల్లెవేస్తున్నారని అంటూ ఘాటుగా విమర్శించారు.
ఆయనే `లోక్ నాయక్’గా పేరొందిన జయప్రకాశ్ నారాయణ్. మరో స్వతంత్ర సంగ్రామంగా చెప్పుకొనే ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటానికి స్ఫూర్తిగా నిలిచి, దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక వహించిన `లోక్ నాయక్’ జయప్రకాశ్ నారాయణ్ తన జీవితంలో ఎటువంటి అధికార పదవులను చేపట్టలేదు. ఎప్పుడు పదవులకోసం వెంపర్లాడని ఏకైక జాతీయ నాయకుడు అని చెప్పవచ్చు.
స్వతంత్ర భారత దేశంలో దేశ ప్రజలను, ముఖ్యంగా యువతను ప్రభావితం చేసిన నాయకులలో ఆయన అగ్రగణ్యులు. కరడుగట్టిన చంబల్ లోయ బందిపోటు దొంగలు ఆయన పిలుపు అందుకొని ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. కేవలం ప్రభుత్వాలు మారితే సమస్యలు పరిష్కారం కావని, మొత్తం వ్యవస్థ మారాలని `సంపూర్ణ విప్లవం’ కోసం రాజకీయాలకు అతీతంగా విద్యార్థి, యువత ఉద్యమం చేపట్టాలని పిలుపిచ్చారు.
నెహ్రు ఉపప్రధాని ఆహ్వానం తిరస్కారం
స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లో జరిగిన మొదటి ఎన్నికలలో ఘన విజయం సాధించిన నెహ్రు ప్రతిపక్షంలో ఉన్న జేపీని ఉపప్రధానిగా చేరమని కోరారు. తన రాజకీయ వారసుడిగా తర్వాత ప్రధాని కావచ్చే సంకేతం ఇచ్చారు. రెండేళ్లపాటు నెహ్రు తన ప్రయత్నం కొనసాగించినా సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయమై సోషలిస్ట్ సహచరుల వైఖరిపట్ల కలత చెంది, రాజకీయాలకు దూరంగా సర్వోదయ ఉద్యమంలో రెండు దశాబ్దాల పాటు గడిపారు.
ఆర్‌ఎస్‌ఎస్ నాయకులతో నారాయణ్ వ్యక్తిగత సంబంధాలు సహాయపడ్డాయి: 1967 లో వారు భుజం భుజం కలిపి శ్రమించారు, బీహార్ కరువు బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టారు, రాష్ట్రం మరో వైపు చూసింది. అటువంటి ప్రయత్నాలలో పని చేస్తున్న సమయంలోనే నారాయణ్ 1950 ల మధ్యలో భూదాన్‌లో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్‌తో స్నేహం చేశాడు. వారి కామ్రేడ్‌షిప్ వారి వెనుక ఉన్న పెద్ద సంస్థలను కలిపే ఇస్తమస్‌గా ఉపయోగపడుతుంది.
1971లో బాంగ్లాదేశ్ యుద్ధంలో భారత్ అపూర్వమైన విజయం సాధించడంతో ప్రధాని ఇందిరాగాంధీ అత్యంత ప్రజాదరణ గల నేతగా గుర్తిపు పొందారు. ప్రతిపక్షాలు చిన్నాభిన్నమై, ఒకవిధమైన నిరుత్సాహంతో ఆమెను ఎదుర్కోలేమనే నిరాశతో మిగిలి పోయాయి. అటువంటప్పుడు అహ్మదాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో మెస్ చార్జీలతో అవినీతిపై విద్యార్థులు ఉద్యమం చేబడతారు.
వైద్యం కోసం పాట్నా వచ్చిన జేపీని అక్కడ ఆర్ ఎస్ ఎస్ విభాగ ప్రచారక్ గా ఉన్న గోవిందాచార్య, ఎబివిపి నేతలు రామబహదూర్ రాయ్, మహేష్ శర్మ, సుశీల్ మోదీ కలసి, అహ్మదాబాద్ వచ్చి ఉద్యమిస్తున్న విద్యార్థులకు మద్దతు తెలుపమని కోరతారు. మొదట్ల విముఖంగా ఉన్నప్పటికి, వారు శాంతియుతంగానే తమ ఉద్యమం చేస్తానని హామీ ఇస్తే వస్తానని మాట ఇచ్చి, వస్తారు. ఈ సందర్భంగా అవినీతికి వ్యతిరేకంగా యువత ఉద్యమాలు చేపట్టాలని ఆయన పిలుపిచ్చారు.
అవినీతికి వ్యతిరేకంగా అహ్మదాబాద్ లో విద్యార్థులు చేపట్టిన ఉద్యమంకు వెళ్లి నైతక మద్దతు అందించిన ఆయన అవినీతికి వ్యతిరేకంగా యువత ఉద్యమాలు చేపట్టాలని ఆయన పిలుపిచ్చారు. జెపి తనను ఉద్దేశించే ఆ పిలుపు ఇచ్చారని, ప్రధాని ఇందిరాగాంధీ ఆయన పట్ల అసహనంగా విమర్శలు కురిపిస్తారు.
“నేను, నా భార్య ప్రభావతి మా కుమార్తెగా భావిస్తున్న ఇందిరా ఈ విధంగా నాపై నిందలు వేస్తుందా?” అంటూ ఆయన ఆవేదన చెందుతారు. గుజరాత్ విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా 1974 మార్చ్ 18న పాట్నాలో జరిగిన ప్రదర్శనపై పోలీసులు నిదాక్షిణ్యంగా కాల్పులు జరపడంతో ఆయన మనసు వికలమైనది. ఎనిమిదిమంది ఈ సందర్భంగా చనిపోయారు.
పోలీస్ కాల్పులకు నిరసనగా ఏప్రిల్ 8న పాట్నాలో జరిగిన మౌన ప్రదర్శనకు 72 ఏళ్ళ వయస్సులో జెపి నేతృత్వం వహించారు. లక్షమంది ప్రజలు ఈ ప్రదర్శనలో పార్టీల జెండాలు లేకుండా, నినాదాలు లేకుండా పాల్గొని నూతన చరిత్రకు శ్రీకారం చుట్టారు. పోలీసుల బెరికేడ్ లను దాటుకొంటూ ప్రదర్శన వెడుతూ ఉండగా పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి జరిపారు.
`సంపూర్ణ విప్లవం’ కోసం పిలుపు
 అయితే సమయానికి నాటి జనసంఘ్ నేత నానాజీ దేశముఖ్ అడ్డు రావడంతో ఆయన తీవ్ర గాయాలకు గురయ్యారు. ఆ తర్వాత జూన్ 5న పాట్నాలోని గాంధీ మైదాన్ లో జరిగిన భారీ విద్యార్థి, యువజనుల బహిరంగ సభలో “సంపూర్ణ మార్పు” కోసం పిలుపిచ్చారు. మరో విప్లవం కోసం పోరాడాలని యువతను కోరారు.
“27 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఇంకా మన ప్రజలు ఆకలితో, నిరుద్యోగంతో, అవినీతితో, అణచివేతతో, అన్యాయంలతో ఇబ్బందులకు గురవుతున్నారు. కేవలం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కూలిపోయి, అసెంబ్లీ రద్దయితే మన సమస్యలు పరిష్కారం కావు. ప్రతి రంగంలో మార్పు తీసుకువచ్చే సంపూర్ణ విప్లవమే మన లక్ష్యం కావలి” అని స్పష్టం చేశారు.
బీహార్ ఉద్యమంగా పేరొందిన ఈ ఆందోళన క్రమంగా దేశ వ్యాప్తంగా విస్తరించడం ప్రారంభమైనది. అందులో ఎబివిపి కీలక పాత్ర వహిస్తూ వచ్చింది. ఒకొక్క రాష్ట్రంలో విద్యార్థి, యువ సంఘర్షణ సమితిలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. జెపి స్వయంగా హైదరాబాద్ లో ఎన్ ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన తెలంగాణకు, విజయవాడలో ఎం వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఆంధ్ర ప్రాంతానికి అటువంటి సమితిలు ప్రకటించారు.
అదే సమయంలో 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నికను రద్దు చేయడం, గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో జనతా ఫ్రంట్ గెలుపొందడంతో దేశం ఒక పెద్ద రాజకీయ మార్పుకు సంకేతం లభించినట్లు అయింది. అయితే, “కేవలం గుజరాత్ లో ప్రభుత్వం మారితే సరిపోదు. సంపూర్ణ మార్పు (విప్లవం) రావాలి” అంటూ జెపి స్పష్టం చేశారు.
అలహాబాద్ హైకోర్టు తీర్పు అనంతరం కూడా ఇందిరాగాంధీ రాజీనామా చేయక పోవడంతో జూన్ 25 సాయంత్రం ఢిల్లీలో జరిగిన భారీ బహిరంగ సభలో “లోక్ సంఘర్ష్ సమితి” ని మొరార్జీ దేశాయ్ అధ్యక్షునిగా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ అయిన జనసంఘ్ నేత నానాజీ దేశముఖ్ ప్రధాన కార్యదర్శిగా జెపి ప్రకటించారు. జెపి ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకిగా ఉన్నా, 1950 ల మధ్యలో భూదాన్‌లో పాల్గొన్న నానాజీ దేశ్‌ముఖ్‌తో స్నేహం కొనసాగిస్తూ వచ్చారు.
ఆ రాత్రే ఇందిరాగాధీ అంతర్గత ఎమర్జెన్సీని ప్రకటించి జేపితో సహా ప్రతిపక్ష నేతలు అందరిని జైళ్లకు పంపింది. పత్రిక సెన్సార్ షిప్ విధించడంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ వంటి సంస్థలపై నిషేధం విధించింది. వందలాదిమంది ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ నేతలను కూడా అరెస్ట్ చేసింది. ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా లోక్ సంఘర్ష్ సమితి నేతృత్వంలో ప్రపంచ చరిత్రలోనే జరుగని భారీ శాంతియుత ఉద్యమం జరిగింది.
నానాజీ దేశముఖ్ అరెస్ట్ తర్వాత దత్తోపంత్ థేంగ్డి దానికి నేతృత్వం వహించారు. అందులో ఆర్ ఎస్ ఎస్ కీలక పాత్ర వహించింది. భారీ సత్యాగ్రహ ఉద్యమం జరిగింది. మొత్తం లక్షమందికి పైగా అరెస్ట్ అయ్యారు. దేశ, విదేశాల నుండి వస్తున్న వత్తిడుల కారణంగా ఇందిరాగాంధీ 1977 జనవరిలో ఎమర్జెన్సీని ఎత్తివేసి,, ఎన్నికలు ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షాలను కలిపి, జనతా పార్టీ ఏర్పాటులో జెపి కీలక భూమిక వహించారు. తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం దేశంలో ఏర్పాటుకు కారణమయ్యారు. అయితే ఆ ప్రభుత్వం అంతర్గత కుమ్ములాటలు కారణంగా, కాంగ్రెస్, వామపక్షాల విద్రోహ చర్యల కారణంగా పూర్తికాలం కొనసాగ లేకపోవడం మరో అంశం. 1979 అక్టోబర్ 8న, తన 77వ పుట్టిన రోజుకు మూడు రోజుల ముందు సుదీర్ఘ అనారోగ్యం అనంతరం మృతి చెందారు.

LEAVE A RESPONSE