Suryaa.co.in

Editorial

ఢిల్లీ’కి తెలియకుండానే కేంద్రమంత్రులపై వైసీపీ ఎంపీల ‘టీటీడీ’ వల?

– నద్దాకు చేరిన కేంద్రమంత్రుల సిఫార్సు వ్యవహారం
– బీజేపీ హైకమాండ్‌కు తెలియకుండానే వైసీపీ ఎంపీల ‘టీటీడీ’ ఆఫర్
– కేంద్రమంత్రుల లేఖలపై ఆరా తీస్తున్న బీజేపీ చీఫ్ నద్దా
– తాను లేఖ ఇవ్వలేదన్న ఓ కేంద్రమంత్రి
– ‘కమలం’లో ‘టీటీడీ’ కల్లోలం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆర్ధికంగా అష్టకష్టాలు పడుతున్న ఆంధ్రాను ఆదుకోవాలంటూ.. ఇటీవలి కాలంలో కేంద్రమంత్రులను కలుస్తున్న వైసీపీ ఎంపీల ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలు కనిపించడం లేదు. అవన్నీ వర్కవుట్ కాకపోవడంతో, బీజేపీ హైకమాండ్‌కు తెలియకుండానే వైసీపీ ఎంపీలు.. ‘అట్నుంచి నరుక్కు’వచ్చిన టీటీడీ మెంబర్ల షార్ట్‌కట్ వ్యవహారం చివరాఖరకు, బీజేపీ నాయకత్వానికి తెలిసిపోవడంతో.. డామిట్ కథ అడ్డం తిరిగినట్టయింది. జాతీయ పార్టీ నాయకత్వానికి తెలియకుండానే కేంద్రమంత్రులు, టీటీడీ మెంబర్ల కోసం సిఫార్సు లేఖలు ఇచ్చిన వైనం ఇప్పుడు ‘కమలం’లో కల్లోలం సృష్టిస్తోందట.
టీటీడీ  బోర్డు చైర్మన్‌ను నియమించిన జగన్ సర్కారు, ఇప్పటిదాకా సభ్యులను నియమించలేదు. అయితే అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏపీ సహా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 75 మందిని, ఆయా రాష్ట్రాల ప్రముఖులు సిఫార్సు చేసినట్లు వైసీపీ వర్గాల కథనం. వారిలో ఎవరి పేర్లనూ తొలగించలేని పరిస్థితి ఉండటంతో, 45- 55 మందితో టీటీడీ బోర్డు, మిగిలిన వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించాలని సూత్రప్రాయంగా నిర్థయించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, ఆ జాబితాపై ఇంకా స్పష్టత లేకపోవడంతో బోర్డు సభ్యుల ప్రకటన ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో పాటు.. వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీ అధినేతల నుంచి కూడా, భారీ సంఖ్యలో సిఫార్సు లేఖలు వచ్చినట్లు సమాచారం. ప్రధానంగా తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇద్దరూ విడివిడిగా కొందరి పేర్లు సిఫార్సు చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.ఇది కూడా చదవండి: టీటీడీకి మహా జంబో కమిటీ?
ఈ నేపథ్యంలో.. కేంద్రమంత్రులను రాష్ట్ర అవసరాల కోసం, తరచూ కలుస్తున్న కొందరు వైసీపీ ఎంపీలు.. బీజేపీ జాతీయ నాయకత్వాన్ని సంప్రదించకుండానే, తమకున్న పరిచయాల మేరకు నేరుగా కేంద్రమంత్రులను కలసి, టీటీడీ బోర్డు సభ్యుల కోసం పేర్లు సిఫార్సు చేయమని సూచించారట. దానితో 20 మంది కేంద్రమంత్రులు, తమకు ఇష్టులయిన వారి పేర్లను టీటీడీ బోర్డు సభ్యుల కోసం సిఫార్సు చేశారట. అందులో ఒక మహిళా మంత్రి కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అవసరాల కోసం ఇటీవలి కాలంలో ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ఓ రాష్ట్రమంత్రి, ఆమె నుంచి సిఫార్సు లేఖ తీసుకున్నట్లు బీజేపీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. నిజమెంతో ‘సీతారాముల’కెరుక?
నిజానికి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఆ పార్టీ నాయకత్వం నుంచే నేరుగా టీటీడీకి కొందరి పేర్లు సిఫార్సు చేస్తుంటుంది. దానితోపాటు, ఏపీ ముఖ్యమంత్రులతో వ్యక్తిగత సంబంధాలున్న కేంద్రమంత్రులు కూడా టీటీడీకి పేర్లు సిఫార్సు చేస్తుంటారు. ఈ సంప్రదాయం చాలా ఏళ్ల నుంచి కొనసాగుతోంది. గతంలో టీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, బీజేపీ నాయకత్వం కొందరి పేర్లు సిఫార్సు చేసింది. అందులో ఆఖరున తిరుపతికి చెందిన బీజేపీ నేత భానుప్రకాష్ పేరును అమిత్‌షా, వెంకయ్యనాయుడు స్వయంగా సిఫార్సు చేయడంతో, నాటి సీఎం చంద్రబాబు ఆ సిఫార్సును అంగీకరించారు. యుపీఏ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సంప్రదాయమే ఉండేది.
అయితే ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో, కేంద్రంలోని బీజేపీతో ఎలాంటి సంబంధం లేదు. బీజేపీ-వైసీపీ మిత్రపక్షం కూడా కాదు. అయినప్పటికీ, బీజేపీ పార్లమెంటులో సమస్యల్లో పడినప్పుడల్లా, వైసీపీ అభయహస్తం అందిస్తూనే ఉంది. ఆ ప్రకారంగా.. బీజేపీ కేంద్ర నాయకత్వం కొందరి పేర్లు సిఫార్సు చేయడం సహజం. కానీ.. అసలు బీజేపీ హైకమాండ్‌కు తెలియకుండానే, వైసీపీ ఎంపీలు కొందరు తమకున్న వ్యక్తిగత సంబంధాలను ఉపయోగించుకుని, నేరుగా కేంద్రమంత్రుల వద్దకే వెళ్లి సిఫార్సు లేఖలు తీసుకోవడమే విశేషం.
ఈ వ్యవహారమంతా ఎవరికీ తెలియకుండా.. గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతే, ఎలాంటి గొడవ ఉండేది కాదు. కానీ, కేంద్రమంత్రులు హైకమాండ్‌కు తెలియకుండా ఇచ్చిన సిఫార్సు లేఖల వ్యవహారం, రాష్ట్రానికి చెందిన బీజేపీ అగ్రనేతలకు ఉప్పండటంతో కథ అడ్డం తిరిగింది. వారు ఈ ‘అడ్డదారి’ వ్యవహారాన్ని, బీజేపీ దళపతి నద్దాకు ఫిర్యాదు చేయడంతో గత్తర వచ్చిపడింది. దానితో ఆయన ఈ వ్యవహారంపై కూపీ లాగగా, మొత్తం 20 మంది కేంద్రమంత్రులు, పార్టీ హైకమాండ్‌కు తెలియకుండానే టీటీడీ సభ్యుల పేర్లు సిఫార్సు చేసినట్లు నద్దా దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీనిపై ఆయన స్వయంగా ఒక కేంద్రమంత్రిని ఆరా తీయగా, తాను ఎవరికీ లేఖ ఇవ్వలేదని చెప్పారట. అయితే సదరు కేంద్రమంత్రి పేరుతో, సిఫార్సు అందటం నద్దాను విస్మయపరిచిందట. ఈమొత్తం వ్యవహారంపై ఆరా తీయాల్సిందిగా ఒక ప్రముఖుడిని ఆదేశించినట్లు బీజేపీ వర్గాల సమాచారం. ఫలితంగా టీటీడీ సభ్యుల ప్రకటన మరింత ఆలస్యమయేందుకు కారణమయింది.

LEAVE A RESPONSE