Suryaa.co.in

National

కరోనా మూడో వేవ్‌కు అవ‌కాశాలు చాలా త‌క్కువ‌

క‌రోనా మొద‌టి, రెండో వేవ్‌తో అతలాకుత‌ల‌మైన‌ దేశం.. మూడో వేవ్‌తో ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా మారే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు హెచ్చ‌రిస్తున్న విష‌యం విదిత‌మే. కానీ క‌రోనా మూడో వేవ్‌కు అవ‌కాశాలు చాలా త‌క్కువ ఉన్నాయ‌ని ఐసీఎంఆర్ మాజీ శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ ర‌మ‌ణ్ గంగాఖేధ్క‌ర్ తెలిపారు. అయిన‌ప్ప‌టికీ పిల్ల‌ల‌ను ఇప్పుడే స్కూళ్ల‌కు పంపొద్ద‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఒక వేళ మూడో వేవ్ వ‌చ్చినా, ఫ‌స్ట్, సెకండ్ వేవ్ మాదిరి ప్ర‌భావం ఉండ‌క‌పోవ‌చ్చు అని డాక్ట‌ర్ ర‌మ‌ణ్ స్ప‌ష్టం చేశారు.
అయితే కొవిడ్ -19 వ‌ల్ల పిల్ల‌ల్లో దీర్ఘ‌కాలిక సైడ్ ఎఫెక్ట్స్ కు అవ‌కాశం ఉన్నట్లు తాజా అధ్య‌య‌నాల్లో తేలింది. కాబ‌ట్టి ఇప్పుడే స్కూళ్లు తెర‌వ‌క‌పోవ‌డం మంచిద‌న్నారు. ఒక వేళ పాఠ‌శాల‌లు ప్రారంభించాల‌నుకుంటే వికేంద్రీకృత విధానం పాటించాల‌న్నారు. ఆ ఏరియాల్లో న‌మోదు అవుతున్న కేసుల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని సూచించారు. ఇన్ ఫ్లూయెంజా వైర‌స్ మాదిరిగానే కొవిడ్ 19 అంత‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని డాక్ట‌ర్ ర‌మ‌ణ్ పేర్కొన్నారు. టీకా వేయించుకోవ‌డంతో కొవిడ్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు అన్నారు.
నాలుగో సేరో స‌ర్వే ప్ర‌కారం.. మూడింట రెండు వంతుల మందిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందిన‌ట్లు తేలింది. పిల్ల‌ల్లో రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్లే కొవిడ్ ను త‌ట్టుకోగ‌లుగుతున్నారు అని డాక్ట‌ర్ ర‌మ‌ణ్ చెప్పారు. చిన్నారుల‌కు కరోనా సోకిన‌ప్ప‌టికీ వారిలో ఎలాంటి దుష్ఫ్ర‌భావాలు లేవు. అయిన‌ప్ప‌టికీ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అన్నారు. అదే కొవిడ్ సోకిన‌ పెద్ద‌వారిలో అయితే.. వారి శ‌రీరంలోని ప్ర‌తి అవ‌య‌వంపై ప్ర‌భావం ప‌డింది. డయాబెటిస్, ఒబెసిటీ, జ్ఞాప‌క‌శ‌క్తి కోల్పోవ‌డం, నిద్ర‌లేమి వంటి స‌మ‌స్య‌లకు దారి తీశాయి. పిల్ల‌ల ఆరోగ్యం అనేది చాలా సున్నిత‌మైన అంశం. ఎడ్యుకేష‌న్ కూడా ముఖ్య‌మైన విష‌యం. ఇటు పిల్ల‌ల ఆరోగ్యం, అటు విద్య‌ను స‌మ‌తుల్యం చేసే విధంగా పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ ఉండాల‌ని డాక్ట‌ర్ ర‌మ‌ణ్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE