భారత జలాల్లో పాకిస్తాన్ బోట్ పట్టివేత

0
19

– 200 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

భారత తీర రక్షక దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్‌లో మాదకద్రవ్యాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ బోట్ పట్టుబడింది. పడవ నుంచి 200 కోట్ల రూపాయల విలువచేసే 40 కిలోల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌ తీరం జకావ్‌ నుంచి 33 నాటికల్ మైల్ వద్ద బోర్డును కోస్ట్‌గార్డ్ అధికారులు పట్టుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు ఫాస్ట్ అటాక్ బోట్లు పాకిస్తాన్‌ బోటును పట్టుకున్నాయి.

గతంలో ఏప్రిల్‌లో కూడా 280 కోట్ల విలువైన హెరాయిన్‌ను భారత్‌లోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించగా.. తొమ్మిది మంది పాకిస్తానీ పౌరులను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో పడవ నుంచి 56కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి, గుజరాత్ ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే కాకుండా డ్రగ్స్ స్మగ్లింగ్‌కు ట్రాన్సిట్ హబ్‌గా ఉద్భవించింది. భూ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతతో స్మగ్లర్లు గుజరాత్ సముద్ర మార్గాన్ని ఉపయోగిస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో, డ్రగ్స్ ఆఫ్రికన్ దేశాలకు అక్రమంగా రవాణా చేయడానికి ఉద్దేశించబడినట్లు సమాచారం. ఏప్రిల్ 21న, ఏటీఎస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో కండ్లాలోని దీనదయాళ్ పోర్ట్ అథారిటీ వద్ద కంటైనర్ల నుంచి దాదాపు రూ.1,400 కోట్ల విలువైన దాదాపు 205 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.