– మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు
ప్రజావిశ్వాసం కోల్పోయిన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగుతున్నాడని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గడపగడపకుమన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలనుండి ఛీత్కారాలను ఎదుర్కొంటున్న ‘కాపు’ ఆ కోపాన్ని టీడీపీ వారిపై చూపుతున్నాడన్నారు. ఆదివారం గుమ్మగట్ట మండలం బిటిపిలో టీడీపీ కార్యకర్త బెస్త మూర్తి ఇంటి దగ్గరకెళ్లిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనతో ఫోటో తీయించుకోలేదన్న అక్కసుతో నానా దుర్బాషలాడడంతో పాటు మూర్తిపై చేయి చేసుకున్నాడన్నారు.
గతంలో నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు రాలేదని అడిగితే నీ అంతు చూస్తానని బెదిరించడమేమిటని కాలవ ప్రశ్నించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఎమ్మెల్యే ప్రజలపై దౌర్జన్యాలకు దిగడం దుర్మార్గమన్నారు. తమ కార్యకర్త మూర్తిపై దౌర్జన్యానికి పాల్పడ్డ ఎమ్మెల్యేపై తక్షణం కేసు నమోదు చేసి కాపు రామచంద్రారెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
గడపగడపకు కార్యక్రమంలో వెళ్లిన ప్రతిచోటా సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యే ‘కాపు’ను నిలదీస్తున్నారన్నారు. రెండు రోజుల క్రితం గుమ్మగట్ట మండలం కె.పి.కుంట గ్రామంలో రాముడు అనే టిడిపి కార్యకర్త ఇంటివద్ద ఎమ్మెల్యే నానా రభస సృష్టించాడన్నారు. ప్రజలు సమస్యలను చెప్పినప్పుడు వాటిని తీరుస్తానన్న భరోసా ఇవ్వాల్సిన కాపు రామచంద్రారెడ్డి అసహనాన్ని ప్రదర్శిస్తుండడం అతని అసమర్థతకు అద్దం పడుతోందన్నారు.
ప్రజలకు సమాధానం చెప్పలేనప్పుడు తగుదునమ్మా అంటూ వారి ఇళ్ల వద్దకు వెళ్లడమెందుకని కాలవ ప్రశ్నించారు. అధికార మదాంధకారంతో ప్రజలపైనే దాడులు చేస్తున్న కాపు రామచంద్రారెడ్డిపై త్వరలోనే సామూహిక తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు.