ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. నేడు, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో, రెండు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఏపీలో అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని చెప్పింది. అదే సమయంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం జిల్లాలలో పాటు యానాంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఇక, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుల సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు అధికంగా ఉందని అంచనా వేసింది.