– కేంద్ర వైఖరికి నిరసనగానే వెళ్లలేదు
-బీజేపీ నేతలు జూలో జంతువుల్లా పనిచేస్తున్నారు
-మోదీ తీరుపై మంత్రి తలసాని ఫైర్
ముచ్చింతల్‌లో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వచ్చిన ప్రధాని నరేద్రమోదీ చేసిన రాజకీయ ప్రసంగంపై తెలంగాణ సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఫైరయ్యారు. యుపిలో ఎన్నికల కోసమే సమతామూర్తి విగ్రహం వద్ద బహుజనులంటూ ఇంకా ఏదేదో మాట్లాడారని మండిపడ్డారు. విభజించి
పాలించడం బీజేపీ నైజమన్నారు. కేంద్రప్రభుత్వ పక్షపాత విధానాలకు నిరసనగా సీఎం కేసీఆర్ ప్రధానిని ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జ్ఞాని సాయన్నతో కలసి తలసాని మీడియాతో మాట్లాడారు.
ఆయనేమన్నారంటే.. కేసీఆర్ ఉద్దేశ్య పూర్వకంగా సీఎంకు ఆహ్వానం చెప్పలేదు అంటున్న బీజేపీ నేతలకు చెప్తున్నా.ఉద్దేశ్య పూర్వకంగానే సీఎం వెళ్ళలేదు. అయితే ఏంటి? బీజేపీ వాళ్లకు మేము భయపడాల్సిన పని లేదు. తెలంగాణ కు చేసిన అన్యాయం దృష్టిలో ఉంచుకుని మేము నిరసన తెలిపాం.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం ఒరగబెట్టిందో బీజేపీ నేతలకు చెప్పే దమ్ము ఉందా? నెహ్రు జులాజికల్ పార్క్ లో ఉన్న జంతువుల లాగా బీజేపీ వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఆరు మండలాలను బలవంతంగా లాక్కున్నారు. ప్రధాని కొత్త డ్రామాకు తెర లేపారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసమే మోదీ కొత్త రాగం అందుకున్నారు. మొన్నటి ముచ్చింతల్ కార్యక్రమాన్ని కూడా రాజకీయంగా వాడుకున్నారు.విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ తుంగలో తొక్కారు. ప్రధాని వ్యాఖ్యలకు రాష్ట్ర బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకుని తిరుగుతారు?
సింగరేణి జోలోకి వస్తే మరో ఉద్యమం తప్పదు. డ్రెస్ మార్చుకొనే దానిమీద ఉన్న శ్రద్ధ, ప్రధానికి దేశంలో ఉన్న సమస్యల పై లేదు. ప్రధాని పర్యటన లో నెలకొన్న అంశాలను సాకుగా పెట్టుకొని కుక్కల్లాగా అరుస్తున్నారు. కేంద్రమే తెలంగాణ పనితీరుపై ప్రశంసలు కురిపిస్తూ అవార్డులు , రివార్డులు ఇచ్చారు.