Suryaa.co.in

Telangana

యువత జీవితంలో ఉన్నతంగా ఎదగాలి

– రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర

హైదరాబాద్: విద్యార్థులు,యువత ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణ, పట్టుదల, దీక్షాదక్షలతో ముందుకు సాగుతూ జీవితంలో ఉన్నతంగా ఎదగాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉద్బోధించారు. ది తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (రూరల్-టీటీడీసీఏ)వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మాజీ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ఎంపీ రవిచంద్ర ప్రారంభించారు.

తెలంగాణ జిల్లాలకు చెందిన గ్రామీణ-అమెరికన్ యూత్ క్రికెట్ అకాడమీ(ఏయూసీఏ)జట్లకు మధ్య జరిగే ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఎంపీ వద్దిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.శంషాబాద్ విమానాశ్రయానికి చేరువలో తొండుపల్లి వద్ద ఎంపీస్ క్రికెట్ మైదానంలో సోమవారం నుంచి ఈనెల 31వతేదీ వరకు జరిగే ఈ టోర్నమెంటులో అండర్ -17 జట్లు పాల్గొంటున్నాయి.ఎంపీ రవిచంద్ర టాస్ వేసి, బ్యాటింగ్ చేసి ఈ పోటీలను ప్రారంభించి క్రికెటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ ఆటకు మన దేశంలో రోజురోజుకు మరింత ఆదరణ పెరుగుతున్నదన్నారు.

ఇటీవల దుబాయ్ లో జరిగిన వరల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలను సుమారు 100 కోట్ల మందికిపైగా టీవీలకు అతుక్కుపోయి చూశారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని,ఇందులో కూడా మంచి భవిష్యత్తు ఉందన్నారు. తాను చదువుకునే రోజుల్లో క్రికెట్, వాలీబాల్ ఆడేవాడినని,ఆటల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం పొందవచ్చని, ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని చెప్పారు.క్రికెట్ దిగ్గజాలైన కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలను ఆదర్శంగా తీసుకుని అకుంఠిత దీక్షతో గొప్ప క్రీడాకారులుగా ఎదిగాల్సిందిగా ఎంపీ వద్దిరాజు క్రికెటర్లను ఆశీర్వదించారు.

LEAVE A RESPONSE