– వేతనాలు పెంచాలని అడగడమే ఆశాలు చేసిన నేరమా?
– ఆశాల గౌరవాన్ని పెంచింది కేసిఆర్, అరెస్టులు చేసి అగౌరవ పరుస్తున్నది రేవంత్ ప్రభుత్వం
– రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్ల అరెస్టులను బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం
– అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
-మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని అడగడమే ఆశాలు చేసిన నేరమా? వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్లకు తరలించడం దుర్మార్గం. హక్కుల సాధన కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశా సోదరీమణుల పట్ల ఎందుకింత నిర్బందం, ఎందుకింత నిరంకుశత్వం?
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవం ఇదేనా? ఆశా సేవలను గుర్తించిన కేసీఆర్ గారు మూడు సార్లు వారి పారితోషికాలను పెంచారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రూ.1500 మాత్రమే ఉన్న వేతనాన్ని, రూ.9750 చేశారు. వారి గౌరవాన్ని మరింత పెంచారు. విధులు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు గానూ మొబైల్ ఫోన్లు ఉచితంగా అందించి, ఆ బిల్లులను సైతం ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటు చేసారు.
ఆశాల గౌరవాన్ని పెంచింది కేసిఆర్ అయితే, నేడు అరెస్టులు చేసి అగౌరవ పరుస్తున్నది రేవంత్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆశాల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నది. హామీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసాన్ని 15నెలల్లోనే అన్ని వర్గాల ప్రజలు గుర్తించారు. కాంగ్రెస్ చేసిన నయ వంచన పై ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు.
నిలదీత నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్బందాన్ని ప్రయోగిస్తూ, తప్పించుకుంటున్నది. గొంతెత్తిన వారిని అక్రమంగా అరెస్టులు చేస్తూ, అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నది. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచింది, రెండు పూర్తి స్థాయి బడ్జెట్లను ప్రవేశపెట్టింది.
ఇంకా ఎన్నాళ్లూ హామీలు అమలు చేయకుండా సాకులు చెబుతారు రేవంత్ రెడ్డి గారూ.. అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం, ఆశా వర్కర్ల వేతనాలను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చిన హామీ నెరవేర్చేదాకా ఆశా వర్కర్ల పోరాటానికి బిఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాం.