-వైఎస్ వివేక హత్య సమాచారం జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసన్న సిబిఐ
-కృష్ణారెడ్డి చెప్పిన తర్వాతే వైఎస్ వివేక హత్య సమాచారం ప్రపంచానికి తెలుసు నన్నదంతా ట్రాష్
-హత్యా ప్రదేశంలో ఆధారాలను హత్య చేసిన వారే ధ్వంసం చేసి ఉంటారు
-హత్యకు కీలక సూత్రధారిగా పేర్కొన్న అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తారనుకోవడం లేదు
-సాంకేతికంగా సీబీఐ ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతుంది
-ప్రతిష్టాత్మక సీబీఐ ని చిల్లర సంస్థగా సజ్జల అభివర్ణించడం దురదృష్టకరం
-జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు బెయిల్ రద్దుకు అభ్యర్థించిన సీబీఐ, ఆ తరువాత అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు
-లేని పెద్దరికాన్ని ఎత్తుకున్న జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి, హోం శాఖామంత్రి అపాయింట్మెంట్ ఇస్తారనుకోవడం లేదు
-చంద్రబాబు చేతిలో చిలకలా సిబిఐ మారిందనడం సిగ్గుచేటు
-సీబీఐ చంద్రబాబు చేతిలో చిలకలా మారితే, జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఎందుకు రద్దు చేయలేదు?
-కోర్టుకు హాజరుకా లేనని జగన్ అనగానే అంగీకరించిన సీబీఐ నచ్చింది కానీ… అఫి డవిట్లో పేరును చేర్చగానే నచ్చకుండా పోయిందా?
-అభం, శుభం తెలియని, పెద్దగా చదువుకోని జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించడం సజ్జలకు సబబేనా?
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కౌంటర్ అఫిడవిట్లో సిబిఐ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును చేర్చింది.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పేరు ను ఈ కేసులో చేర్చడం వల్ల, వెంటనే ఈ కేసును సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు కోరారు. జగన్మోహన్ రెడ్డిని ప్రస్తుతం సాక్షిగా చేర్చారు. రేపు నిందితుడిగా మారవచ్చునేమో. ఈ కేసును సుప్రీంకోర్టు నేతృత్వంలో మాజీ న్యాయమూర్తి, లేదంటే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వైఎస్ వివేక హత్య కేసును విచారించకపోతే, జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యే అవకాశాలు లేవు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించకపోతే సిబిఐ తుది చార్జి షీట్ దాఖలు చేసే అవకాశాలు లేవు. జూన్ 30వ తేదీ నాటికి ఈ కేసు విచారణను పూర్తి చేసి, చార్జిషీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించిన విషయం తెలిసిందేనని అన్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సమాచారం జగన్మోహన్ రెడ్డి కి ముందే తెలుసునని కౌంటర్ అఫిడవిట్లో సిబిఐ బాంబు పేల్చింది. నిజం తెలిసినా చెప్పకపోవడం తప్పే కాదు నేరం కూడా అని సి.బి.ఐ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది పేర్కొన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి చెప్పిన తర్వాతే ఆయన హత్యకు గురయ్యారన్న విషయం ప్రపంచానికి తెలుసు నన్నదంతా ట్రాష్. అంతకుముందే హత్యలో కీలక సూత్రధారిగా వ్యవహరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఫోను ద్వారా సమాచారం అందించినట్లుగా సిబిఐ తన కౌంటర్ అఫ్ అఫిడవిట్లో పేర్కొంది.
సీఎం అయ్యాక ఏనాడు కోర్టుకు హాజరు కాని జగన్
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాలేదు. కోడి కత్తితో తనపై హత్యా ప్రయత్నం జరిగినట్లు పేర్కొని ఆ కేసు తుది విచారణకు తన ఇంటికి కూత వేటు దూరంలో ఉన్న ఎన్ఐఏ కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి హాజరుకావడానికి ఇష్టపడలేదు. వైఎస్ వివేక హత్య కేసు విచారణకు ఆయన సహకరిస్తారన్న నమ్మకం ఎవరికి లేదు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో కేసును విచారించాలని రఘురామకృష్ణం రాజు కోరారు.
ఐ పి డి ఆర్ ఆధారంగా అసలు విషయం వెలుగులోకి…
ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిజిటల్ రికార్డర్ ( ఐపిడిఆర్ ) ఆధారంగా ఫోన్ కాల్ ద్వారా ఏమి మాట్లాడారో తెలియక పోయినప్పటికీ, ఒకే సమయంలో అవినాష్ రెడ్డి ఫోన్, జగన్మోహన్ రెడ్డి, లేదంటే భారతీ రెడ్డి ఫోన్లు ఆన్ లో ఉన్నట్టు, ఒకే సమయంలో కట్ అయినట్లు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సిబిఐ గుర్తించింది. వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు ముందు , హత్య అనంతరం ఐపిడిఆర్ ద్వారా ఒకే సమయంలో ఎవరెవరి ఫోన్లు ఆన్ లో ఉన్నాయో తెలిస్తే ఈ హత్య కేసు కు ఒక ఆధారం దొరికినట్లే.. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం పట్ల అవినాష్ రెడ్డి తరఫున న్యాయవాది కంగారుపడి, అభ్యంతరం చెప్పడం విడ్డూరంగా ఉంది.
సిబిఐ తుది చార్జి షీట్ దాఖలు చేసిన అనంతరం, కోర్టులో ట్రయల్స్ జరిగేటప్పుడు అభ్యంతరం చెబితే అర్థం ఉంది కానీ… ఇప్పుడు అభ్యంతరం చెప్పడం సరికాదు. సిబిఐ సాంకేతికంగా ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతూనే ఉంది. ఛార్జ్ షీట్ దాఖలు చేయకముందే విచారణలో హైకోర్టు జోక్యం చేసుకునే అవకాశం లేదు. విచారణ అధికారి ఎలా విచారణ చేయాలన్నది ఆయన ఇష్టం. విచారణలో జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానానికి లేదు. విచారణ ఎలా చేశారని ప్రశ్నించడం కూడా సబబు కాదన్నది నా భావన అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.
ముందస్తు బెయిల్ ఇస్తారనుకోవడం లేదంటున్న న్యాయ నిపుణులు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సూత్రధారిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరును కౌంటర్ అఫిడవిట్లో సిబిఐ దాఖలు చేసిన తర్వాత ఆయనకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తారని తాము భావించడం లేదని పలువురు న్యాయ నిపుణులు పేర్కొన్నారని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. వచ్చే నెల 30వ తేదీలోగా వైఎస్ వివేక హత్య కేసు విచారణకు సుప్రీం కోర్టు తుది గడువును విధించింది. ఈలోగా, ఈ కేసుతో ప్రమేయం ఉన్న వారందరినీ విచారించి సాక్షాదారాలతో తుది చార్జిషీట్ దాఖలు చేయాలంటే, అవినాష్ రెడ్డి ని కోర్టు తీర్పు వెలువడిన వెంటనే అరెస్టు చేసే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా, పోలవరం నిధుల కోసమని ముఖ్యమంత్రి ఢిల్లీ పెద్దలను కలిసి ఎంత విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదు. ఈ కేసులో ఢిల్లీ పెద్దల సహకారం లభిస్తుందని నేను అనుకోవడం లేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
సిబిఐ పై ప్రజల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేస్తున్న సాక్షి దినపత్రిక
ప్రతిష్టాత్మకమైన సిబిఐ పై ప్రజల్లో విషం నింపే ప్రయత్నాన్ని సాక్షి దినపత్రిక చేస్తోంది. అవినాష్ రెడ్డి లక్ష్యంగా దర్యాప్తు అనే వార్త కథనం లో ఐపిడిఆర్ పేరిట కోర్టును సిబిఐ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందనడం హాస్యాస్పదంగా ఉంది. సిబిఐ కి నైపుణ్యం లేదంటున్న సాక్షి దినపత్రిక, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేసే సిఐడి కి మాత్రమే నైపుణ్యం ఉందా? అని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేతిలో సిబిఐ చిలకలా మారిందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది.
సిబిఐ, చంద్రబాబు చేతిలో చిలకలా మారితే, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుకు ఆయన ఎందుకు ప్రయత్నించలేదు. గత నాలుగేళ్లు గా ఆర్థిక నేరాభియోగ కేసులను కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపును పొందుతున్నప్పటికీ ఆయన చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు.అంటే సిబిఐ, చంద్రబాబు చేతిలో చిలకలా మారిందనడం శుద్ధ అబద్ధమని తేటతెల్లమవుతుందన్నారు.
అందరూ అన్నారు… అవినాష్ అన్నారన్న ఆయన న్యాయవాది
వైఎస్ వివేక గుండెపోటుతో మరణించారని అందరూ అంటుంటే, అవినాష్ రెడ్డి కూడా గుండెపోటుతో మరణించారని చెప్పారని ఆయన తరపు న్యాయవాది పేర్కొనడం విడ్డూరంగా ఉంది. అవినాష్ రెడ్డి వైద్యుడా?, పోలీసు అధికారా?, వైఎస్ వివేకా ఎలా మరణించారో ఆయనకు తెలియడానికని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది. వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించారని తెలిసిన తర్వాత అవినాష్ రెడ్డి లాన్ లోనే ఉండిపోయి, వచ్చి పోయే వారిని పలకరిస్తున్నారని చెప్పడం కొత్త ట్విస్ట్.
వైఎస్ భాస్కర్ రెడ్డి, ఈ సి గంగిరెడ్డి ఆసుపత్రిలో అటెండర్ గా పనిచేస్తున్న జయప్రకాశ్ రెడ్డి ని పిలిపించి ఊరిలో ఉన్న కాటన్ అంతా తెప్పించి శరీరాన్ని ఉండ ను చుట్టినట్లు చుట్టారు. అయినా, వివేకానంద రెడ్డి ది అందరూ గుండెపోటు అని అంటుంటే అవినాష్ రెడ్డి కూడా అన్నారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. సీన్ ఆఫ్ అఫెన్స్ లో హత్య జరిగినప్పుడు పూచిక పుల్ల కూడా కదపడానికి వీల్లేదు.
హత్య అని తెలిసిన తర్వాత రక్తం మరకలను తుడిస్తే తప్పేమిటి అని అవినాష్ రెడ్డి ని తరుపు న్యాయవాది ప్రశ్నించినట్లుగా నా దృష్టికి కొంతమంది విలేకరులు తీసుకువచ్చారు. జులాయి సినిమాలో దొంగతనం కూడా ఒక కళనే అని కళాకారులను కూడా అరెస్టు చేస్తారా? అని హాస్యనటుడు బ్రహ్మానందం ప్రశ్నించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఎటువంటి ఎవిడెన్స్ ను టచ్ చేయడానికి వీల్లేదు. టచ్ చేశారంటే హత్య చేసినవారే టచ్ చేసి ఉండాలి. చిన్నాన్న గుండెపోటుతో మరణిస్తే ఎవరైనా ఆయన శవాన్ని చూడకుండా, వచ్చి పోయే వారిని పరామర్శిస్తూ ఉంటారా?, ఈ మాటలు ఏమైనా నమ్మశక్యంగా ఉన్నాయా?? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.
సిబిఐని చిల్లర సంస్థ అంటున్న సజ్జల
సిబిఐ చిల్లర సంస్థ మాదిరిగా వ్యవహరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం దురదృష్టకరం . వెంటనే ఆయన ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని నేను గతం లో పిటీషన్ దాఖలు చేసినప్పుడు, సిబిఐ ఏమాత్రం తనకు సహకరించలేదు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేయకముందు ఆయన బెయిల్ రద్దు ను కోరిన సిబిఐ, ఆ తర్వాత అభ్యంతరాన్ని వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది . సిబిఐ, నేను దాఖలు చేసిన పిటిషన్ కు మద్దతుగా పిటిషన్ దాఖలు చేసి ఉంటే నా పిటీషన్ రద్దు చేయడానికి న్యాయమూర్తికి కష్టమయ్యేది.
జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా వారు సహకరించినట్లే. ఆరు నెలల వ్యవధిలో తీర్పును వెల్లడించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నప్పటికీ, నేను దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును 10 నెలల తరువాత వెల్లడించారు. న్యాయస్థానాలపై ఉన్న గౌరవంతో నేను ఆ విషయాన్ని పైకోర్టు దృష్టికి తీసుకు వెళ్ళలేదు .
తమకు అనుకూలంగా వ్యవహరించినప్పుడు సిబిఐ ని తప్పు పట్టని వారు, ఇప్పుడు వైఎస్ వివేక హత్య కేసు కౌంటర్ అపిడవిట్ లో జగన్మోహన్ రెడ్డి పేరు చేర్చగానే తప్పు పడుతున్నారు . ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నానని కోర్టుకు హాజరుకాలేనని చెప్పినా సిబిఐ అభ్యంతరం చెప్పలేదు. అత్యవసరమైతేనే పిలవండని న్యాయస్థానం సూచించింది. ఇదే విషయమై సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించి ఉంటే, అరక్షణంలో ఆ తీర్పును సుప్రీంకోర్టు కొట్టి వేసి ఉండేది. అయినా సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా అనుకూలంగా వ్యవహరించింది.
దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఇంతటి వెసులుబాటును కల్పించిన దాఖలాలు లేవు. ఇప్పుడు వెకిలి వేషాలు వేస్తూ అడ్డమైన ప్రతి వెధవ సిబిఐ గురించి అడ్డగోలుగా మాట్లాడితే, ఇన్నాళ్లు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించిన సిబిఐ ఏమంటుందో చూడాలి. 32 ఆర్థిక నేరాభియోగ కేసుల్లో పురోగతి లేదని, తక్షణమే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని నాలాంటి వారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే పరిస్థితి ఏమిటి?. కోర్టుకు హాజరుకాలేనని సంవత్సరం క్రితం 1172 సార్లు జగన్మోహన్ రెడ్డి కోరారు. ఇంకా ఎన్నిసార్లు అడిగారో తెలియదు. విచారణ నిమిత్తం కోర్టుకు జగన్మోహన్ రెడ్డి హాజరు కావాల్సిందేనని సీబీ ఐ ఆదేశిస్తే, జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కక తప్పదు. వైఎస్ వివేక హత్య కేసు విచారణలో భాగంగా రామ్ సింగ్ ను సుప్రీంకోర్టు మార్చినట్లుగా సాక్షి దినపత్రికలో రాశారు. రామ్ సింగ్ ను మార్చమని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులలో ఎక్కడ పేర్కొనలేదు.
న్యాయ వ్యవస్థ పై శాసన వ్యవస్థకు, శాసన వ్యవస్థపై న్యాయ వ్యవస్థకు కంట్రోల్ ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి విషాద యోగంతో సిబిఐ పై అవాకులు చవాకులు పేలితే, మా పార్టీ అధ్యక్షుడి బ్రతుకు సంక్లిష్టమయ్యే ప్రమాదం ఉంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. కొన్ని వ్యవస్థల గురించి మాట్లాడేటప్పుడు నోరును అదుపులో పెట్టుకోవాలని చెప్పాల్సిన ప్రభుత్వ సలహాదారే నోరు పారేసుకోవడం దురదృష్టకరం. అభం, శుభం తెలియని, పెద్దగా చదువుకోని ముఖ్యమంత్రికి సజ్జల రామకృష్ణారెడ్డి శల్య సారథ్యం వహిస్తున్నట్లుగా కనిపిస్తుందని రఘురామకృష్ణం రాజు అనుమానం వ్యక్తం చేశారు.
సీబీఐపై ముఖ్యమంత్రే వారితో మాట్లాడిస్తాడు
వైఎస్ వివేకా హత్య కేసు కౌంటర్ అఫీడవిట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుని సిబిఐ చేర్చడంతో, సీబీఐకి వ్యతిరేకంగా ఆయనే తన వంది మాగాదులతో మాట్లాడిస్తున్నారు. ఎంపీని చితక బాధించి చూసి ఆనందించే విష ప్రవృత్తి కలిగిన జగన్మోహన్ రెడ్డిని , ఈ కేసులో సీబీ ఐ ప్రస్తుతానికి సాక్షిగా చేర్చినప్పటికీ రేపు నిందితుడిగా మారవచ్చునేమో నని అన్నారు.
ఢిల్లీలో లేని పెద్దరి కాన్ని ఎత్తుకొని అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా లు అపాయింట్మెంట్ ఇస్తారని నేను భావించడం లేదు. అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశాలు లేవు. అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో, ఈరోజే ఆయన్ని సీబీఐ అరెస్టు చేస్తుందా? లేదా?? అన్నది సాయంత్రానికి తేలిపోతుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.