మహానాడు అంతా ఆత్మస్తుతి, పరనింద

-సైకిల్‌ గుర్తు ఎన్టీఆర్‌ సృష్టి
-ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు హస్తం గుర్తు కింద ఉన్నాడు
-వైయస్‌ జగన్‌ ధనిక సీఎం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-దేశంలో అత్యధిక ధనవంతుడైన రాజకీయ నాయకుడు చంద్రబాబు
-సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం సంపద సృష్టించారు?
-అప్పులు తప్ప రాష్ట్రానికి చంద్రబాబు చేసిందేంటి?
-మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్‌

తాడేపల్లి: చంద్రబాబు పాలనలో ఐదేళ్లు అప్పులు తప్ప రాష్ట్రానికి చేసిందేమి లేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. మహానాడు పేరుతో అమాయకులను కూర్చోబెట్టి చంద్రబాబు సుత్తి కబుర్లు చెబుతున్నాడని మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకుడు చంద్రబాబు అని చెప్పారు. అధికారం కోసం ఎలాంటి తప్పుడు మాటలైనా మాట్లాడే చంద్రబాబుకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని పేర్ని నాని అన్నారు. శనివారం వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

మహానాడులో ఆత్మస్తుతి, పరనింద తప్ప మరేమి లేదు. రాష్ట్రంలోని రోడ్లన్ని రాజమండ్రికి వస్తున్నాయని చెబుతున్నాడు. రాష్ట్రంలోని రోడ్లు రాజమండ్రికి ఎందుకు వస్తాయి. మద్రాస్‌– కలకత్తా హైవే రాజమండ్రి మీదుగా వెళ్తుంది. లేదా రాజానగరం–కాకినాడ రోడ్డు ఏడీబీలో కలుస్తుంది. రావులపాలెం రోడ్డు రాజమండ్రిలో కలుస్తుంది. ఇలాంటి సుత్తి కబుర్లు మహానాడులో చెప్పుకుంటున్నాడు.

సైకిల్‌కు కరెంటు పెట్టాడట..ఇక దూసుకుపోతుందట. సైకిల్‌కు కరెంటు పెడితే ముందు చక్రాలు ఉడిపోతాయన్న సంగతి ఎవరికి తెలియదు. మోటర్‌ సైకిల్‌ దూసుకుపోతుందంటే అర్థం ఉంటుంది. సైకిల్‌ తీసేసి మోటర్‌ సైకిల్‌ తీసుకురండి. అమాయకులను మహానాడులో కూర్చోబెట్టి సుత్తి కబుర్లు చెబుతున్నాడు. సైకిల్‌ అయినా చంద్రబాబు సొంతమా..అంటే అది కాదు. అది దొంగ సైకిల్‌..రామారావు దగ్గర కొట్టేసి సైకిల్‌ అది. ఆ దొంగ సైకిల్‌కు కరెంటు పెడతాడట. చువ్వలు విరిగిపోతాయి..జాగ్రత్త బాబూ..!

సైకిల్‌ గుర్తు ఎన్టీఆర్‌ సృష్టి..దాంట్లో పేదవాడికి పూరిళ్లు, నాగలి రైతుకు గుర్తు, యంత్రం కార్మికుడికి గుర్తు అంటాడు. చంద్రబాబు జన్మలో చెప్పిన ఏకైక నిజం. సైకిల్‌ గుర్తు, పూరిళ్లు, నాగలి ఇవి ఎన్టీఆర్‌ సృష్టి..ఇది నిజం. ఎన్టీఆర్‌ సృష్టించినప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారు. హస్తం కింద ఉన్నాడు. కాంగ్రెస్‌లో ఉంటూ రామారావును ఓడిస్తానని ఆ రోజు చెప్పి..ఎన్టీఆర్‌ను రామోజీతో కలిసి కుట్రలతో పదవి నుంచి దించారు. కుట్రలతో కూల్చిన వ్యక్తికి ఇవాళ దండేసి దండం పెట్టడం ఇవాళ నిజంగా నీకే చెల్లుతుందని చంద్రబాబు.

రాష్ట్రంలో ధనిక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని చంద్రబాబు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. వైయస్‌ జగన్‌ కుటుంబం ఆస్తి రూ.510 కోట్లు ..ఇందులో దొంగ మాటలు మాట్లాడే చంద్రబాబు ఆస్తి ఎంత డిక్లేర్‌ చేశారో తెలుసా..చంద్రబాబు, ఆయన భార్య, కొడుకు, కోడలు, మనవడి ఆస్తి రూ.1000 కోట్లు . దేశంలో అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు చంద్రబాబే. వైయస్‌ జగన్‌ కుటుంబం కంటే రెట్టింపు ఆస్తులు ఉన్నది చంద్రబాబుకే కదా?. ఇలాంటి వ్యక్తి తప్పుడు భాష మాట్లాడుతున్నాడు.

నిజానికి కర్జురనాయుడు, అమ్మన్నమ్మ చంద్రబాబుకు ఇచ్చిన ఆస్తి ఎంత? రెండెకరాలతో బయలుదేరి ఇవాళ చంద్రబాబు ఆస్తి రూ.1000 కోట్లకు పెరిగింది. నీవు పక్కా నిక్కర్సైన నీతిమంతుడిలాగా మాట్లాడుతున్నావు. ఏం వ్యాపారం చేసి ఇంత ఆస్తులు సంపాదించావు. 1992లో హెరిటేజ్‌ కంపెనీ రిజిస్ట్రేషన్‌ చేసి 1996లో ఫ్యాక్టరీ నిర్మాణం చేసే వరకు ఏం వ్యాపారం చేశావు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే హెరిటేజ్‌లో పార్ట్‌నర్స్‌గా ఉన్న మోహన్‌బాబు లాంటి వ్యక్తులను సాగనంపావు. ఫ్యాక్టరీని కబలించావు. ముఖ్యమంత్రి కాకముందు హెరిటేజ్‌ కంపెనీ సైకిల్‌ లాగా ఎందుకు నత్త నడకన సాగింది. ముఖ్యమంత్రి కాగానే ఎందుకు ఫ్యాన్‌లా గిరిగిర తిరిగింది. దాంట్లో రహస్యం ఏంటి?

ఎన్టీఆర్‌ కుటుంబాన్ని ముక్కలు చేసేందుకు శకుని వేషం వేసింది ఎవరని ప్రశ్నించారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎంతమంది పేదలను కోటీశ్వరులను చేశారని ప్రశ్నించారు. అధికారం కోసం ఎంతటి తప్పుడు మాటలనైనా మాట్లాడే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబును ప్రజలు ఎందుకు నమ్మాలని నిలదీశారు. ఇన్నాళ్లూ ప్రజలకు మేలు చేయని వ్యక్తి నువ్వు..అంటూ ధ్వజమెత్తారు.

ఈ రాష్ట్రాన్ని అప్పులు చేశారు తప్ప..ఎలాంటి అభివృద్ధి చేయలేదు. టీడీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిమితులకు మించి 26 వేల కోట్లు తప్పుడు లెక్కలతో అప్పులు తెచ్చారు. 2019లో అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ..మా స్థాయికి మించి అప్పులు తెచ్చాం..వీళ్లుకు అప్పులు ఇచ్చేది ఎవరూ? వీరికి అప్పులే పుట్టవు అని యనమల ఆయన నోటితోనే చెప్పాడు. ఈనాడు రామోజీరావు ఆయన చేతితో రాశారు. వైయస్‌ జగన్‌ సీఎం కాగానే..ఈనాడులో రాశారు..ఖజానాలో కేవలం వంద కోట్లే ఉన్నాయి. జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని ఈనాడులో రాశారు. ఇవి టీడీపీ పాలనలో 2014–2019 వరకు సృష్టించిన సంపద.

2019లో చంద్రబాబు దిగిపోయే సమయానికి ఏపీలో అన్ని డిపార్టుమెంట్ల కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన అప్పు రూ.40 వేల కోట్లు బిల్లులు బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద రూ.650 కోట్లు చెల్లించాలి. రైతుల నుంచి విత్తనాలు సేకరించిన దానికి, ధాన్యం సేకరణకు, ఇన్‌ఫుట్‌ సబ్సిడీకి, రైతులకు ఇచ్చిన ఉచిత విద్యుత్‌ సబ్సిడీ సుమారు రూ.8 వేల కోట్లు బకాయి పెట్టి చంద్రబాబు దిగిపోయాడు. ఇన్ని తప్పుడు పనులు చేసి సంపద సృష్టించానని ఇవాళ చంద్రబాబు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని పేర్ని నాని మండిపడ్డారు.

 

Leave a Reply