మహిళా సంక్షేమంపై చంద్రబాబుకు ఏడుపెందుకు..?
’వైఎస్సార్ ఆసరా’ రెండో రోజు సంబరాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
వైఎస్సార్ ఆసరా రెండో విడత కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో దసరా పండుగ వారం ముందే వచ్చినట్లుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రెండో రోజు వైఎస్సార్ ఆసరా సంబరాలు శనివారం అరండల్ పేటలోని APJ అబ్దుల్ కలాం ఉర్దూ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బంకా శకుంతలాదేవి, కుక్కల అనిత రమేష్, ఎండీ షాహినా సుల్తానాలతో కలిసి గౌరవ శాసనసభ్యులు పాల్గొన్నారు. తొలుత దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన మోసానికి పొదుపు సంఘాలన్నీ కకావికలం అయ్యాయని.. దాదాపు 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు తీవ్రంగా నష్టపోయారన్నారు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చే నాటికి డ్వాక్రా మహిళల రుణాలు రూ.14,200 కోట్లు ఉన్నాయన్నారు. చంద్రబాబు మాట నిలబెట్టుకోలేకపోవడంతో.. 2019 ఏప్రిల్ 11 నాటికి ఆ రుణాలు కాస్తా అసలు, వడ్డీ కలుపుకొని రూ.25,517 కోట్లకు చేరాయన్నారు. డ్వాక్రా మహిళలను అప్పుల ఊబి నుంచి బయట పడేసేందుకు గాను వైఎస్సార్ ఆసరా పథకానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. నాలుగు విడతల్లో ఈ రుణాల మొత్తాన్ని డ్వాక్రా మహిళలకు అందజేస్తున్నారన్నారు.
చంద్రబాబు అటకెక్కించిన సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి ప్రారంభించారన్నారు. గత ప్రభుత్వంలో సీ, డీ గ్రేడ్ లోకి దిగజారిన పొదుపు సంఘాలు ఇప్పుడు ఏ గ్రేడ్‌లోకి వచ్చాయన్నారు. వైఎస్సార్ ఆసరాకి సంబంధించి నియోజకవర్గ పరిధిలో 3,415 గ్రూపులకు రూ. 29 కోట్ల 52 లక్షల 7వేల 991 రూపాయలు అందించినట్లు వివరించారు. తొలి విడతలో 3,251 గ్రూపులకు గానూ రూ. 28 కోట్ల 96 లక్షల 20వేల 320 రూపాయలు డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు. రెండు విడతలు కలుపుకుని దాదాపు రూ. 60 కోట్లను డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అందించడం జరిగిందన్నారు. మరోవైపు 23, 24, 25 డివిజన్ లకు సంబంధించి రెండో విడతలో 293 డ్వాక్రా గ్రూపులకు గాను రూ. 2 కోట్ల 46 లక్షల 25 వేల 888 రూపాయలు పొదుపు సంఘాల మహిళలకు లబ్ధి చేకూర్చినట్లు వెల్లడించారు. నిధులు జమ కాని గ్రూపు సభ్యులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని.. ప్రభుత్వంతో మాట్లాడి త్వరలో నగదు జమ అయ్యేలా చూస్తామన్నారు.
సంక్షేమ రాజ్యంగా సెంట్రల్:
జగనన్న ప్రభుత్వంలో సెంట్రల్ నియోజకవర్గం సంక్షేమానికి కేరాఫ్ గా మారిందని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు హయాంలో సెంట్రల్ నియోజకవర్గంలో 18వేల మందికి అందుతున్న పింఛన్ ను.. శాచ్యురేషన్ పద్ధతిలో 24,518 మందికి పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని చెప్పుకొచ్చారు. గత టీడీపీ హయాంలో నాలుగున్నరేళ్లు రూ. వెయ్యి మాత్రమే పింఛన్ ఇచ్చి.. ఎన్నికలు సమీస్తున్న తరుణంలో రూ. 2వేలు చేశారని గుర్తుచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి కూడా రూ. 2,250 లను అందించడం జరుగుతోందని వెల్లడించారు. 23, 24, 25 డివిజన్ లకు సంబంధించి 2,098 మందికి పింఛన్లు, 1,903 మందికి అమ్మఒడి, 891 మందికి ఇళ్ల పట్టాలు, 225 మందికి టిడ్కో ఇళ్లు, 725 మందికి చేయూత, 131 మందికి కాపు నేస్తం, 99 మందికి చేదోడు అందిస్తూ.. నియోజకవర్గంలో సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పామన్నారు.
మహిళలకు అగ్రతాంబూలం:
అన్ని రంగాలలోనూ సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలకు అగ్రతాంబులం ఇచ్చారని మల్లాది విష్ణు అన్నారు. ప్రతి పథకంలోనూ అక్కచెల్లెమ్మలను భాగస్వామ్యం చేస్తూ మహిళా పక్షపాత ప్రభుత్వంగా ముందుకెళ్తున్నామన్నారు. అమ్మఒడి, వైఎస్‌ఆర్ ఆసరా, వైఎస్‌ఆర్ చేయూత ఇలా 21 పథకాల ద్వారా దాదాపు రూ. లక్ష కోట్ల సంక్షేమాన్ని మహిళలకు అందించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నగదును సద్వినియోగం చేసుకుంటూ జీవనోపాధులను పెంపొందించుకునే మార్గాలను అధికారులు డ్వాక్రా మహిళలకు సూచించాలన్నారు. దుస్తులు, కిరాణా వంటి చిన్న చిన్న వ్యాపారాల ద్వారా పెద్ద లాభాలు గడించే విధంగా ఆదాయ మార్గాలను ఎంచుకోవాలన్నారు.
సంక్షేమ పథకాల అమలులో విప్లవం.. వైఎస్సార్ నవశకం
సంక్షేమ పథకాల పరిమితులను విస్తరిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి కుటుంబంలో సంతోషాలను నింపడమే వైఎస్సార్ నవశకం ప్రధాన లక్ష్యమని మల్లాది విష్ణు అన్నారు. అర్హులై ఉండి పథకాల జాబితాలో తమ పేరు లేనివారు లబ్ధిపొందేందుకు వార్డు సచివాలయాలలో అవసరమైన ధృవపత్రాలు సమర్పించి పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా 100 శాతం సంతృప్తస్థాయిలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వివరించారు.
టీడీపీకి ఏడుపెందుకు..?
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు విజయవంతంగా కొనసాగితే టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని గ్రహించి అడుగడుగునా టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. మరీముఖ్యంగా జగనన్న ప్రభుత్వంలో డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు మంచి జరుగుతుందంటే చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. వైఎస్ జగన్ కి ప్రజల్లో మంచిపేరు వస్తుందనే భయంతో నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చివరకు మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా చేపట్టిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని చూసి కూడా టీడీపీ నాయకులు ఏడుస్తున్నారన్నారు. పేద మహిళలు సంతోషంగా ఉండడం చంద్రబాబుకి ఇష్టం లేదా? అని ప్రశ్నించారు.
ఆదిలక్ష్మి, డ్వాక్రా మహిళ మాట్లాడుతూ.. రుణమాఫీ అని 2014 లో చంద్రబాబు నిలువునా మోసం చేశారని.. గత టీడీపీ పాలనలో పూర్తిగా అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాలతో అన్ని వర్గాలను ఆదుకుంటున్నారన్నారు. అమ్మఒడి పథకంతో పిల్లల్ని బాగా చదివించుకుంటున్నామన్నారు. జగనన్న పాలనలో మహిళలంతా ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. అనంతరం రెండో విడత వైఎస్‌ఆర్ ఆసరాకి సంబంధించిన మెగాచెక్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బాలిగోవింద్, కొంగితల లక్ష్మీపతి, నాయకులు బంకా భాస్కర్, నాయపురెడ్డి, నాగేశ్వరరెడ్డి, చినబాబు, పుల్లయ్య, నరేంద్ర, విజయ, మారుతి, శంకర్, అబ్ధుల్ నజీర్, కె.రవి, అధికారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.