అభివృద్ధి, సంక్షేమంలో వైఎస్ఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి తెలంగాణ కాంగ్రెస్ నివాళులర్పించింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ… వైఎస్ చేపట్టిన నీటి ప్రాజెక్టులు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిని చేయటం తన లక్ష్యమని వైఎస్ఆర్ చెప్పేవారని గుర్తుచేశారు. వైఎస్ఆర్ ఆలోచనల మేరకు రాహుల్‌ను ప్రధానిని చేసే వరకు విశ్రమించమని స్పష్టం చేశారు. పీవీ, ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డిల మాదిరి.. హైదరాబాద్‌లో వైఎస్ స్ముతీవనాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ చేయకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్‌లో వైఎస్ స్ముతీవనం నిర్మిస్తామని తెలిపారు. వైఎస్ఆర్ ఆలోచనలను తెలంగాణ కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్తోందన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి వైఎస్ అత్యంత విశ్వాస పాత్రడని అన్నారు. మాట ఇస్తే ఎన్ని కష్టాలొచ్చినా మడప తిప్పని నేత రాజశేఖరరెడ్డి అని అన్నారు. వైఎస్ఆర్ మన మధ్య లేకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి ఆవేదన చెందారు.
వారి కుట్రలు తిప్పికొట్టేందుకు వైఎస్‌ఆర్ లేకపోవడం దురదృష్టకరం
‘‘ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న కుట్రలు తిప్పికొట్టేందుకు వైఎస్‌ఆర్ మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఆయన హయాంలో రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. జలయజ్ఞం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించారు. ఉమ్మడి ఏపీని దేశమే ఆదర్శంగా తీసుకునేలా సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించారు. వారు అమరులైనా.. ఆయన పేరు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయింది. వైఎస్‌ఆర్ ఆలోచనలు కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది’’ అని రేవంత్ పిలుపునిచ్చారు.
నిరంతరం ప్రజల కోసమే పని చేశారు: భట్టి
‘‘ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరని అడిగితే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెబుతారు. ఆయన నిరంతరం ప్రజల కోసమే పని చేశారు. సంక్షేమంతో పాటు దేశానికి అభివృద్ధిని చూపించిన మహనీయుడు వైఎస్‌ఆర్. ఆయన లేని లోటు మనందరికీ బాధాకరం. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు సమసమాజ స్థాపన కోసమే. ఆయన చూపించిన మార్గంలో ఎప్పటికీ నడుస్తూనే ఉంటాం.