• రుణాల పేరుతో మోసం.. నకిలీ పత్రాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్
• అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు పీలా గోవింద సత్యనారాయణ, కొల్లు పెద్దిరాజు
మంగళగిరి: పల్నాడు జిల్లా, నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన మల్లా రామారావు, మల్లా పోతురాజు, మల్లా నాగేసు, నలబోతు కేశవులు మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చారు. తమ గ్రామంలో జీవాలను పెంచుకుంటూ చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. చిలకలూరిపేట టౌన్ కు చెందిన గుంజి శ్రీను అను వ్యక్తి తమ వద్దకు వచ్చి వైసీపీ ప్రభుత్వంలో కీలక నాయకుడినని నమ్మబలికి తమకు ఎస్టీ కార్పొరేషన్ కింద లోన్లు, భూమిని, ఇండ్లు ఇప్పిస్తానని తమ వద్ద సుమారు రూ. కోటి రూపాయలు వరకు తీసుకున్నాడని తెలిపారు.
ఆ తర్వాత మాకు లోన్లు గాని, ఏ విధమైన భూమి గాని ఇప్పించకుండా తమ డబ్బులు ఇవ్వకుండా మోసగించారని ఫిర్యాదు చేశారు. ఆ డబ్బుల కోసం అతని వద్దకు వెళ్లి అడుతున్న తరుణంలో బాపట్ల జిల్లా చినగంజాం మండలానికి చెందిన దేవరకొండ సుబ్బారావు, బాలిగ గాయత్రి లు “ఆస్తులు మా పేరుపై ఉన్నాయి, డబ్బులు మేమే ఇస్తాం” అని చెప్పి రూ.21 లక్షలు వసూలు చేసి మోసం చేశారని తెలిపారు.
డబ్బులు ఇవ్వకపోగా కేసులు పెడితే చంపేస్తామని తీవ్రంగా బెదిరించారు. వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు ఏపీ అర్బన్ ఫైనాన్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, ఏపీ ఫిషర్ మెన్ కోఆపరేటివ్ సొసైటీ పెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ కొల్లు పెద్దిరాజులకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎంపేడు గ్రామానికి చెందిన డబ్బా బదూర్ సింగ్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 202/2 ఏసీ: 1.51 సెంట్స్ డీపట్టా భూమి ఉందని తెలిపారు. ఈ భూమి తమ తల్లి లేట్ డబ్బా తిరుమలమ్మ భర్త లేటు బదూర్ సింగ్ అనువారికీ ప్రభుత్వం మంజూరు చేసింది. తమ తల్లి మరణాంతరం భూమిలో తను సాగు నిర్వహిస్తున్నాను.
ప్రస్తుతం ఈ భూమి ఆన్ లైన్ లో భూక్యా అమ్ములు అను వారిపై నమోదు అయ్యాయి. ఈ విషయంపై విచారించగా గతంలో తమ పంటలకు రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికి తమ గ్రామస్తుడైనా భూక్యా లింగయ్య అనువారు తమ భూముల ఒరిజినల్ పట్టాలు తీసుకోని ఎటువంటి సబ్సిడీ రుణాలు ఇప్పించకపోగా తప్పుడు పత్రాలు సృష్టించి తమ భూమిని తమ గ్రామ కాపురాస్తురాలైన భూక్యా అమ్ములు అనువారిపేరుపై విక్రయాలు జరిపి ఆన్ లైన్ లో వారిపై నమోదు చేయించాడు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కావునా తమయందు దయవుంచి వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని అభ్యర్ధించాడు.
గుంటూరు జిల్లా, కాకుమాను మండలం బోడిపాలెం గ్రామానికి చెందిన చెన్నపాటి పద్మశ్రీ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. బాపట్ల మండలం కుక్కలవారి పాలెం పంచాయతీ పరిధిలోని సర్వే నం. 1397లోని ప్లాట్ నం.6లో 0.05 1/4 సెంట్ల స్థలాన్ని 29-06-2006న రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అప్పులు తీర్చేందుకు ఆ స్థలాన్ని విక్రయించదలచగా, అది అసైన్డ్ భూమి అని అమ్మకానికి వీలులేదని అధికారులు తెలిపారు. ఇదే స్థలాన్ని ఇంతకుముందు నాలుగు పార్టీలకు రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ ఇప్పుడు ఎటువంటి పరిష్కారం చూపడంలేదు. దీని వలన కొనుగోలు దారులు ముందుకు రాకపోగా తను అప్పుల ఊబిలో కూరుకుపోయాను. తన స్థల సమస్యను పరిష్కరించి తగిన న్యాయం చేయాలని కోరారు.
ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం మండలం ధర్మరావుపేట గ్రామానికి చెందిన పెన్మెత్మ శ్రీరామరాజు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. బుట్టాయగూడెం మండలం కొయరాజులగూడెంలో సర్వే నెం. 14లో a/c 2.00 సెంట్లు భూమి కలదు. సదరు భూమికి తమ పేరు మీద పట్టాదారుపాస్ పుస్తకం ఉంది. కానీ సదరు భూమిని రవిగూడెం గ్రామ గిరిజనులు కటం బుచ్చయ్య, కన్నయ్య, మడకం వెంకన్న, కటం లక్ష్మయ్య అనువారు దౌర్జన్యం తమ భూమిని అపుతున్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు లేవు. వారిపై చర్యలు తీసుకోని తమ భూమిని ఇచ్చిపించాలని కోరాడు.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరుకి చెందిని లోతుగెడ్డ తులసిబాబు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. వంశధార ప్రాజెక్ట్ కారణంగా తమ భూములు కోల్పోయి నిర్వాసితులు, ప్రస్తుతం జీవనోపాధి కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారు. పారాపురం బేలన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించినప్పటికీ, రిజర్వాయర్ పక్కనే నివసిస్తున్న తమ గ్రామాలకు సాగునీరు, మంచినీరు సదుపాయం కల్పించలేదు.
పారాపురం బేలన్సింగ్ రిజర్వాయర్ నుండి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వంశధార ఫేజ్ -2 ద్వారా లేదా నాబార్డ్ ద్వారా ప్రభుత్వం మంజూరు చేయించి లబ్బ, కారిగూడ, ఓండ్రుజోల, ఇరపాడు, మెట్టూరు, పారాపురం, పులిపుట్టి, గునభద్ర గ్రామాల ప్రజలకు మంచినీరు, సాగునీరు కల్పించాలని కోరాడు