ఎన్నికలు ఎదుర్కునే ధైర్యం లేని టీడీపీ
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో అదే సుస్పష్టం
అందుకే ప్రజలకు ఓటు వేసుకునే స్వేచ్ఛ ఇవ్వలేదు
– నల్లపురెడ్డిపల్లెలో వైయస్ జగన్
పులివెందుల: మూడు రోజుల పర్యటన కోసం వైయస్సార్ జిల్లాకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి, మంగళవారం పులివెందుల నుంచి అంబకపల్లి వెళ్తూ, నల్లపురెడ్డిపల్లె వద్ద తన కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులను కలిశారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార టీడీపీ గుండాల దౌర్జన్యంతో ఓటు వేయలేకపోయిన నల్లపురెడ్డిపల్లె గ్రామస్తులు, ఆ ఎన్నిక రోజున అక్కడి పరిస్థితిని వైయస్ జగన్కు తెలిపారు. జడ్పీటీసీ ఉప ఎన్నికరోజు అధికారపక్షం చేసిన అరాచకాలను వివరించారు.
ఈ సందర్భంగా నల్లపురెడ్డిపల్లె వాసులను ఉద్దేశించి కాసేపు మాట్లాడిన శ్రీ వైయస్ జగన్ ఏమన్నారంటే..: ఆరోజు నల్లపురెడ్డిపల్లెలో ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం టీడీపీకి లేక ఈ గ్రామంలో ప్రజలకు ఓట్లు వేసుకునే స్వేఛ్చ లేకుండా పోలీసులను వాడుకుని జులుం చేసి ఏ రకంగా అన్యాయం చేశారనేది ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.
ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న ఈ పరిస్ధితుల్లో చెరగని చిరునవ్వుతో నా కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ మీ జగన్ రుణపడి ఉంటాడు. మీ ఆప్యాయతలకు, ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. గతంలో నంద్యాల ఉప ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత టీడీపీ కొట్టుకుపోయింది. అదే నంద్యాలలో వైయస్సార్సీపీ అఖండ విజయంతో గెలిచింది. ఎప్పుడైనా అన్యాయం చేసినా, దౌర్జన్యం చేసినప్పుడు దేవుడు అన్నీ చూస్తాడు. తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతాడు.
ఈరోజు రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టించుకున్న దిక్కు లేదు. సూపర్సిక్స్ హామీలంటూ మోసం చేస్తున్నారు. ఏ ఒక్క వర్గం సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్ధితి త్వరలోనే రాబోతుంది. మీ ఆప్యాయతకు మీ జగన్ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు.