వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత
ఒంగోలు: తెలుగుదేశం పార్టీకి, వారికి వంతపాడుతున్న పచ్చమీడియాకు బీసీలంటే ఎందుకంత చులకన అని ఎమ్మెల్సీ, వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత ప్రశ్నించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఇదే పంథా కొనసాగిస్తే సరైన గుణపాఠం చెప్పేందుకు జనం సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
బీసీలపట్ల చులకనగా వ్యవహరిస్తూ.. బీసీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై మార్ఫింగ్ వీడియో రూపొందించి ఏబీఎన్, ఈటీవీ, టీవీ5 వంటి పచ్చ మీడియా చానళ్లలో అడ్డగోలుగా మాట్లాడడం చూస్తుంటే రాష్ట్రంలో టీడీపీ తప్ప మరో పార్టీ అధికారంలో ఉండడాన్ని వారు జీర్ణించుకోలేనట్లుగా ఉందన్నారు. ఇప్పటివరకు బాధితురాలిని నేనే అని ఒక్క మహిళ కూడా ముందుకు రాలేదని, దీని ని బట్టే అది మార్ఫింగ్ వీడియో అని స్పష్టమవుతోందని అన్నారు.
కిరాయి కోసం మీడియా ముందు మాట్లాడే పట్టాభి, పెయిడ్ ఆర్టిస్ట్ మా దిరిగా అనిత పచ్చమీడియా ముందు మాట్లాడుతున్న మాటల్ని ఏ మహిళా హర్షించదన్నారు. మూడేళ్లుగా రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా అది సీఎం జగన్‌కు ఆపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబుకు, తెలుగుదేశానికి సరైన గుణపాఠం తప్పదన్నారు.
ఇక చంద్రబాబు బీజేపీ కాళ్లు పట్టుకుని రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారే తప్ప జగన్మోహన్రెడ్డిలా ఏనాడైనా ధైర్యంగా ఎన్నికలకు ఒంటరిగా వెళ్లారా అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నాయకుడు పోతుల సురేష్ మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ తీరు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు, తాగుబోతులు మద్య నిషేధం గురించి డిమాండ్ చేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు.