Suryaa.co.in

Editorial

బీజేపీలో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి?

  • వచ్చే వారం వైసీపీ ఎంపీ పదవి,పార్టీకి రాజీనామా?

  • మళ్లీ ఆ సీటు అయోధ్యకేనా?

  • బీజేపీలో కృష్ణయ్య ఫార్ములా అమలు?

  • వైసీపీకి రాజ్యసభలో తగ్గుతున్న బలం

  • ఇప్పటికే మోపిదేవి, కృష్ణయ్య, బీద రాజీనామాలు

  • తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామా

  • తర్వాత వరసలో గొల్ల బాబూరావు, పరిమళ్ నత్వానీ?

( మార్తి సుబ్రహ్మణ్యం)

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త అయోధ్యరామిరెడ్డి పార్టీకి, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అయోధ్య రామిరెడ్డి వచ్చే వారం స్వదేశానికి వచ్చిన తర్వాత, రాజ్యసభ చైర్మన్‌ను కలసి తన రాజీనామా సమర్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

కాగా అయోధ్య రామిరెడ్డి విషయంలో బీజేపీ.. ఆర్.కృష్ణయ్య ఫార్ములానే తిరిగి కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడయిన ఆర్.కృష్ణయ్య, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే తిరిగి తన సీటు తనకే ఇవ్వాలన్న షరతుపైనే ఆయన రాజీనామా చేశారు. చెప్పినట్లుగానే బీజేపీ నాయకత్వం, ఆయన పార్టీలో చేరిన రోజునే.. ఒక చేత్తో పార్టీ సభ్యత్వం, మరో చేతితో బిఫారం ఇచ్చిన విషయం తెలిసిందే.

అటు వైసీపీ మరో ఎంపీ బీద మస్తాన్‌రావు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన సీటు తనకే ఇవ్వాలన్న షరతుతోనే ఆయన రాజీనామా చేసి, తిరిగి టీడీపీ టికెట్‌పై రాజ్యసభలో అడుగుపెట్టారు. మరోవైపు వైసీపీ ఎంపి మోపిదేవి వెంకటరమణతో సానా సతీష్ మాట్లాడుకుని, ఆయనతో రాజీనామా చేయించుకుని.. ఖాళీ అయిన మోపిదేవి సీటును సతీష్ తీసుకున్న విషయం తెలిసిందే.

త్వరలో వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించిన తర్వాత కూడా.. ఇదే పద్ధతి అమలయ్యే అవకాశం ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి, బీటెక్ రవి ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలయిన జయమంగళ వెంకటరమణ, పోతుల సునీతతో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అయితే శాసనమండలి చైర్మన్ మోషిన్‌రాజు వారి రాజీనామాలు ఆమోదిస్తారో చూడాలి.

ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి విషయంలో కూడా బీజేపీ అదే ఫార్ములాను కొనసాగించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. దీనిపై ఆయన నాయకత్వం నుంచి ముందస్తు హామీ తీసుకున్న తర్వాతనే, రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చెరొక ఫార్ములా కొనసాగింపు..
కాగా వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులతో వ్యూహం ప్రకారం రాజీనామాలు చేయిస్తున్న నేపథ్యంలో, ఇద్దరేసి సభ్యులు రాజీనామా చేసే సందర్భంలో.. ఒకటి టీడీపీ-మరొకటి బీజేపీ తీసుకోవాలన్న, ముందస్తు ఒప్పందాన్ని అమలుచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆ సూత్రాన్నే కొనసాగిస్తున్నారు. ఫలితంగా రాజ్యసభలో బీజేపీ బలం పెరిగేలా చూడటమే ఈ చేరికల లక్ష్యమంటున్నారు. తర్వాత వరసలో గొల్ల బాబూరావు, పరిమళ్ నత్వానీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాజ్యసభలో పడిపోతున్న వైసీపీ బలం
ఈ పరిణామాల ఫలితంగా రాజ్యసభలో వైసీపీ బలం పడిపోతోంది. 11 మంది రాజ్యసభ్యులున్న వైసీపీకి, ఇప్పటికే ముగ్గురు ఎంపీలు రాజీనామా చేశారు. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, నిరంజన్‌రెడ్డి, మేడా రఘునాధ్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. తాజాగా ఎన్నికల ముందు వరకూ పార్లమెంటరీపార్టీ నేతగా వ్యవహరించి, వైసీపీలో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి కూడా, ఎంపి-పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో రాజీనామా చేసిన వారి సంఖ్య నాలుగుకు చేరుతుంది. ఇక ఆ జాబితాలో అయోధ్య రామిరెడ్డి కూడా చేరితే అది ఐదుకు చేరుతుంది.

LEAVE A RESPONSE