– విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ పోరుబాట విజయవంతం
– 2014లో చంద్రబాబు సీఎం అయ్యే నాటికి పవర్ డిస్కమ్‌ల నష్టాలు రూ.6625 కోట్లు
– చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఏకంగా రూ.28,715 కోట్లకు పెరిగిన డిస్కంల నష్టాలు
– 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి డిస్కమ్‌ల అప్పులు రూ.29,552 కోట్లు
– చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి డిస్కమ్ ల అప్పులు రూ.86,215 కోట్లు
– చంద్రబాబు హయాంలో డిస్కమ్ ల అప్పులు రూ.56,664 కోట్లు
– 2015–19 మధ్య చంద్రబాబు హయాంలో విద్యుత్ ఒప్పందాల్లో భారీ అవినీతి
– విండ్ పవర్‌కు గరిష్టంగా యూనిట్ రూ.4.84 చొప్పున చెల్లింపులు
– ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల డిస్కంలపై రూ.52 వేల కోట్లు భారం
– సోలార్ పవర్‌కు గరిష్టంగా యూనిట్ కు రూ.6.99 వరకు చెల్లింపులు
– దీనివల్ల డిస్కంలపై ఏకంగా రూ.37,500 కోట్లు భారం
– గణాంకాలతో వివరించిన కాకినాడ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు
కాకినాడ: కూటమి ప్రభుత్వం ప్రజలపై దుర్మార్గంగా మోపిన రూ.15,485 కోట్లు విద్యుత్ ఛార్జీల మోతకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలు విజయవంతం అయ్యాయని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రకటించారు.
కాకినాడ క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే భారీగా పెంచిన విద్యుత్ ఛార్జీలపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు వైయస్ఆర్సీపీ పోరుబాటలో స్వచ్ఛందంగా పాల్గొని, ప్రభుత్వ నిర్ణయంపై తమ అసంతృప్తి బహిర్గతం చేశారని చెప్పారు.
మొన్న ధాన్యానికి మద్దతు ధర విషయంలోనూ, రైతు భరోసా అమలు చేసే విషయంలోనూ, ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సహాయం కింద అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ.. వైయస్ఆర్సీపీ జిల్లా కేంద్రాల్లో చేసిన ర్యాలీల కార్యక్రమం విజయం సాధిస్తే, ఇవాళ కరెంటు ఛార్జీల విషయంలో వైయస్సార్సీపీ పిలుపునకు పెద్ద ఎత్తున ప్రజలు స్పందించడంతో అవి కూడా గొప్పగా జరిగాయి.
పేదల ఆరోగ్యం కోసం అమలు చేసిన ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. అంబులెన్స్‌లు కూడా నడవని స్థితికి వైద్యరంగాన్ని తీసుకువచ్చాడు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తూ వారికి కూడా చంద్రబాబు షాక్ ఇచ్చారు. సూపర్ సిక్స్ కాదు… సూపర్ షాక్ ఇస్తున్నాడు చంద్రబాబు. ఆయనకు సొంత మీడియా ఉండటమే ఆయన అదృష్టం. ఆయన చేసే ప్రతిదాన్నీ ఆహా… ఓహో అంటూ కీర్తిస్తున్నాయి. ఉచిత ఇసుక అన్నారు. పేరులోనే ఉచితం ఉంది. మద్యం ప్రియులకు కూడా చంద్రబాబు సూపర్ షాక్ ఇచ్చాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, అన్ని బ్రాండ్ లు తక్కువ రేటుకే ఇస్తారని భావించారు. ఎవరు చంద్రబాబును నమ్మితే వారికి షాక్ తప్పడం లేదు.
సూపర్‌సిక్స్‌తో సహా, ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిన టీడీపీ కూటమి, విద్యుత్ ఛార్జీలపై ఇచ్చిన మాట కూడా మర్చి, ఆరు నెలల్లోనే రూ.15,485.36 కోట్ల బాదుడుకు తెర తీశారు. వాటిలో ఇప్పటికే నవంబర్ బిల్లులో రూ.6 వేల కోట్లు వేయగా, వచ్చే నెల నుంచి మరో రూ.9412.50 కోట్ల బాదుడుకు సిద్ధమయ్యారు. దీంతో విద్యుత్ గృహ వినియోగదారులపై 25 నుంచి 55 శాతం వరకు అదనపు వడ్డన చేస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్‌ను దూరం చేసి బిల్లులతో బాదేస్తున్న కూటమి ప్రభుత్వం ఇతర వర్గాలపైనా అలా పెనుభారం మోపింది. దళిత గిరిజన వాడల్లో కరెంట్ సిబ్బందిని చూసి భయబ్రాంతులకు గురి అయ్యేలా చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో గిరిజనులు అర్థరాత్రి సమయంలో ధర్నాలు చేశారు. అధికారులు వారిని బతిమిలాడుతున్న సందర్భాలు ఉన్నాయి.
కానీ నేడు ఏడు గంటల పాటు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు. అప్రకటిత విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్ లను నిలిపివేశారు. రైతులు దరఖాస్తులు ఇస్తున్నా వాటిని కనీసం తీసుకోవడం లేదు. వెంటనే ఈ దరఖాస్తులను పరిశీలించి, ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
గత వైయస్సార్సీపీ ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని, తన హయాంలో పెంచిన ఛార్జీలపైనే ఇప్పుడు జగన్ ఆందోళనకు పిలుపునిచ్చారని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. మరోవైపు వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో రూ.1.29 లక్షల కోట్లు నష్టాల్లో కూరుకుపోయిందంటూ కాకి లెక్కలు చెబుతూ, టీడీపీ నేతలు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు, రూ.16 వేల కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారం ఇప్పుడు పడుతోందంటూ టీడీపీ మంత్రులు అబద్ధాలు వల్లె వేస్తున్నారు.
2014–19 మధ్య జరిగిన ఒప్పందాలు చూస్తే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఎవరు విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేశారో అర్థమవుతుంది. రాష్ట్రంలో 2015–19 మధ్య 3,494 మెగావాట్ల విండ్ పవర్‌కు 133 విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) జరిగాయి. 2015కు ముందు గరిష్టంగా యూనిట్‌కు రూ.3.74 చెల్లిస్తే, చంద్రబాబు 2015 నుంచి యూనిట్‌కు రూ.4.84 చొప్పున చెల్లించారు. 25 ఏళ్లపాటు అమల్లో ఉండేలా జరిగిన ఆ పీపీఏల వల్ల డిస్కమ్‌లు రూ.52 వేల కోట్ల భారం మోయాల్సి వస్తోంది.
సోలార్ పవర్ విషయంలోనూ చంద్రబాబు ఇలానే చేశారు. 2015–19 మధ్య 2,400 మెగావాట్ల కోసం చంద్రబాబు 35 పీపీఏలు చేసుకున్నారు. యూనిట్ గరిష్ట ధర రూ.6.99 మొదలు రూ.6.80 వరకు చెల్లించేలా ఆ ఒప్పందాలు చేసుకున్నారు. మరి ఇది అవినీతి కాదంటారా? దీని వల్ల మరో రూ.37,500 కోట్ల భారం.
చంద్రబాబు అంటేనే డైవర్షన్. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం చేసుకున్న ఒప్పందాల్లో లంచాల ప్రస్తావన ఉంటుందా? చంద్రబాబు యూనిట్ విద్యుత్‌కు రూ.6 చొప్పున ఒప్పందం చేసుకుంటే, జగన్ కేవలం రూ.2.49కే ఒప్పందం చేసుకుంటే ఎందులో అవినీతి జరిగినట్లు? జగన్‌గారు తనపై ఎల్లో మీడియా రాసిన అబద్దపు కథనాలపై సుప్రీంకోర్టులో పరువు నష్టం దావా వేశారు. అయినా కూడా వారిలో మార్పు రావడం లేదు.