– ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు Y.V.B. రాజేంద్ర ప్రసాద్
ఇక నుంచి రాబోయే 15 వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచ్ ల పేరిట బ్యాంకులలో వేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం ప్రకటిస్తున్నాం. సర్పంచ్ లు చేసిన ఉద్యమం ఫలితంగానే ఈ ఉత్తర్వులు వచ్చాయి. ఇది సర్పంచ్ ల విజయం.పంచాయతీ సెక్రటరీలకు సర్పంచ్ లతో పాటుగా జాయింట్ సిగ్నేచర్ అధికారం ఇవ్వకూడదు.పాత పద్దతిలోనే సర్పంచ్ ల కొక్కరికే ఆ చెక్ పవర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.వచ్చే కేంద్ర నిధుల్ని ఒక్క యూనియన్ బ్యాంక్ లోనే ఖాతా తెరిచి, డిపాజిట్ చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల పట్ల మాకు అనుమానాలు ఉన్నాయి.
మా సర్పంచ్ ల వేల కోట్ల రూపాయల నిధుల్ని సెక్యూరిటీగా చూపించి, తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంటుందనే అనుమానాలు మాకు కలుగుతున్నాయి.గ్రామాల అభివృద్ధి కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం 14వ ,15 వ ఆర్థిక సంఘం ద్వారా మా 13000 వేల గ్రామ పంచాయతీ లకు పంపించిన సుమారు రూ,3000 వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి, తన స్వంత అవసరాలకు వాడుకొని, విద్యుత్ బకాయిలకు జమ చేసుకున్నామని చెబుతోంది.ఇది రాజ్యాంగ విరుద్ధం, ఆర్థిక సంఘం నిబంధనలకు వ్యతిరేకం. అందుకే మేము కేంద్ర ప్రభుత్వానికి పిర్యాదు చేసాము. దాని మీదట కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు GOVT. U.O. No. FIN01- COORoMISC /36/2020-CASPS – FC( 1177752), Dt. 18 – 11- 2021 OF FINANCE (PMU- CASPS, FC&IF) DEPT ద్వారా ఇక నుంచీ కేంద్ర ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతా సి.యఫ్.ఏం.ఎస్ లో వేయకూడదని, ఖచ్చితంగా (మ్యా0డేటరీ) కేంద్ర ప్రభుత్వ బ్యాంకులలోనే పి.ఎఫ్.ఏం.ఎస్ (పబ్లిక్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) ఖాతాల పేరుతో ఆయా పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ లు ఆ నిధులు జమ చెయ్యాలని ఆదేశాలు ఇచ్చినది.
ఆ మేరకు ఆం. ప్ర. రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ MEMO NO: 1420095 సి.పి.ఆర్ & ఆర్. డి/ హెచ్ 1/2021, తేదీ 01- 12- 2021న అంగీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చినది.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మా హర్షం ప్రకటిస్తున్నాము. ఇక నుంచీ మాకొచ్చే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లవని భావిస్తున్నాము.
అయినా మాకు కొన్ని అనుమానాలు వస్తున్నాయి :- రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్యులలో కేవలం ఒక్క యూనియన్ బ్యాంకులలోనే మాకొచ్చే వేల కోట్ల నిధులు జమ చెయ్యాలని ఎందుకు ఆదేశాలు ఇచ్చింది? సర్పంచ్ లకు ఇష్టమొచ్చిన, మాకు అందుబాటులో ఉన్న కేంద్ర బ్యాంకులలో వేసుకుంటే తప్పేముంది. రేపు యూనియన్ బ్యాంకులో ఒకే చోట ఉన్న ఆ వేల కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి /షూరిటీగా చూపించి రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద అప్పులు తెచ్చేసుకుంటే మా సర్పంచ్ ల గతి ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, మనం చూస్తున్న, జరుగుతున్న పరిణామాలు బట్టి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వింతైన – విచిత్రమైన ఆర్థిక విన్యాసాలు, విధ్వంసాలను బట్టి అలా జరగదని గ్యారంటి లేదు కదా?అలా జరిగితే మా సర్పంచ్ లు అన్యాయం అయిపోతారు.
ఇప్పటికే యూనియన్ బ్యాంకులో రాష్ట్ర ప్రభుత్వం రూ, 6800 కోట్ల రూపాయలను అప్పు తీసుకోనియున్నది. రేపు మా నిధుల ద్వారా కొత్త ఋణం పొందే ప్రయత్నం లేదా గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లింపు కోసం వాడుకొనే ప్రమాదం ఉంది. ఇప్పటికే కేంద్ర పథకాలకు వచ్చే నిధులు హామీగా ఉంచుకొని ఓ. డి ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ని ప్రభుత్వం కోరియున్నది. అందుకే ….సర్పంచ్ లు మరియు ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్స్ తమకు అందుబాటులో, దగ్గరలో ఉన్న ఏ కేంద్ర ప్రభుత్వ బ్యాంకులలోనైనా పి. ఎఫ్. ఏం. ఎస్ అకౌంట్లను తెరుచుకొనే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
కార్యదర్శులకు జాయింట్ సిగ్నేచర్ పవర్ ఇవ్వకుండా, పాత పద్దతిలోనే సర్పంచ్ లకొక్కరికే చెక్ పవర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము.ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించిన 14, 15వ ఆర్థిక సంఘాల నిధులు, మా పంచాయతీ ల స్వంత నిధులు సుమారు రూ, 3000 కోట్ల రూపాయలను వెంటనే పంచాయతీ సర్పంచ్ లకు తిరిగి ఇచ్చివెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము.లేకపోతే రాష్ట్రం లోని సర్పంచ్ లంతా రాజకీయాలకతీతంగా రూ, 3000 కోట్లను ఇచ్చేవరకు పోరాడుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.
ఫైనల్ గా ఇందులో ట్విస్ట్ ఏమిటంటే:- రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లీస్తుందని ముందే గ్రహించిన కేంద్ర ప్రభుత్వం తాము ఇచ్చే నిధులను కేంద్ర బ్యాంకులలో పి. ఎం. ఎఫ్. ఎస్ ఖాతాలు తెరచి అందులో వేయాలని 7-1-2021 నే రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు D.P. O. NO : N- 19011 168/ 2016 -E-, OF MOPR, G.O.I, Dt : 7-1-2921 ద్వారా ఆదేశాలు జారీ చేసినది.కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చెయ్యకపోవడంతో మరలా D.O Letters 15-1-2021 న, 4-3-2021 న, 16-7-2021 న, చివరిగా 18-11-2021 న ఉత్తర్వులు ఇస్తూ, ఘాటుగా హెచ్చరికలు చేస్తూ డి.ఓ లేఖలు కూడా వ్రాసినది. ఈ నేపథ్యంలోనే 11-11- 2021 న చివరగా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ,919 కోట్లు రాగానే 12-11-2021 న ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సి.ఎఫ్.ఏం.ఎస్ ఖాతా నుంచి తీసివేసుకుని, తన పని అయిన తరువాత అతి తెలివిగా 1-12-2021 న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చెయ్యాలంటూ ఉత్తర్వులు జారీ చేసినది. ఇది సర్పంచ్ లను, కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చెయ్యడం కాదా ? ఇది అత్యంత సిగ్గుచేటైనా విషయం.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ఆర్థిక మోసాల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం.రాష్ట్ర ప్రభుత్వం దిగమింగిన, దారి మళ్ళించిన రూ,3000 కోట్లు రూపాయల కోసం హైకోర్టు లో కూడా మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘాలు కేసులు వేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.