– ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలిపిన కేటీఆర్
– ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆయన స్వయంగా ఆటోలో ప్రయాణించిన కేటీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలియజేశారు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆయన స్వయంగా ఆటోలో ప్రయాణించి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఆటో డ్రైవర్ల దయనీయ పరిస్థితిని కేటీఆర్ వివరించారు. తాను ప్రయాణించిన ఆటో డ్రైవర్ మస్రత్ అలీ ఎన్నో విషయాలను చెప్పారని అన్నారు.
మస్రత్ అలీకి రెండు ఆటోలు ఉండేవి, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటిని అమ్మాల్సి వచ్చిందని కేటీఆర్ తెలిపారు. “ఇప్పుడాయన రోజుకు వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలకే సంపాదిస్తున్నారని వెల్లడించారు. అందులో ఆటో కిరాయి నాలుగు వేలు కట్టాల్సి వస్తోందని.. ఇక.. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులకు వచ్చే ఆదాయం సరిపోవడం లేదని మస్రత్ అలీ బాధపడినట్లు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఇప్పటి వరకు 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు కేటీఆర్. ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించినట్లు గుర్తుచేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఫైరయ్యారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్న రూ.5 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. మూడు రంగుల జెండా కింద ఆటో అన్నల మూడు చక్రాలు నలిగిపోయాయని అన్నారు.
ఇక.. ఇప్పుడు తెలంగాణలో అహనా పెళ్లంటా సినిమా లా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఓట్లు దండుకుందని ఆరోపించారు. తులం బంగారం ఇస్తామని చెప్పి.. మెడలో ఉన్న గొలుసు కూడా లాక్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరూ కష్టాల్లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పే సమయం వచ్చిందని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోందని.. ప్రజలు ఆ డబ్బులు తీసుకున్నా, ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని సూచించారు. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు తీసుకునే నిర్ణయంతో నాలుగు కోట్ల మంది ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
నెలకు 2500 చొప్పున ఒక్కొక్క యువతికి కాంగ్రెస్ ప్రభుత్వం 60వేలు బాకీ పడిందని.. ఆటో అన్నలకు.. వృద్ధులకు ఇలా అందరికీ రేవంత్ సర్కార్ బాకీ పడిందరి గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికల కోసం డబ్బులు ఇస్తే.. వాటిని కూడా తీసుకొని మిగితా బాకీ డబ్బులు ఎక్కడా అని ప్రశ్నించండని చెప్పారు.
ఇక.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు ఎన్నో కుట్రలకు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. కారును పోలిన గుర్తులను కొందరు అభ్యర్థులకు కేటాయించి.. ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కారు గుర్తు పై నుంచి మూడో నెంబర్లో ఉంటుందని, అందరూ జాగ్రత్తగా ఓటేయాలని సూచించారు.
కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో షాక్ ఇస్తేనే మనకు వాళ్లు ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని తెలిపారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటే మాగంటి సునీతకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.