– మోసగాళ్లకు,మహిళలకు మధ్య జరుగుతున్న యుద్ధమే జూబ్లిహిల్స్ ఎన్నిక
– ఆటో డ్రైవర్లను రోడ్డున పడేసింది కాంగ్రెస్
– బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: మహిళా అధికారులను కొందరు మంత్రులు తమ ఇళ్లకు పిలిపించుకోవడం సిగ్గుచేటని,ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదని,కాంగ్రెస్ పాలనలో మహిళలకు గౌరవం లేదని బి ఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఈరోజు ప్రవీణ్ కుమార్ ,ఎమ్మెల్సి నవీన్ రెడ్డి శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ ప్రాంతంలో ఆటోలో ప్రయాణించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సి నవీన్ రెడ్డి లతో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారని, నెలనెలా లోన్ ఇచ్చిన ఫైనాన్సర్లు ఇంటి మీదికి వచ్చి గొడవ చేస్తున్నారని,ఇంటి కిరాయి చెల్లించే పరిస్థితి లేదని,పిల్లల ఫీజులు కూడా కట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసిఆర్ గారి పాలనలో నెలకు 24 వేలు సంపాదించుకునే ఆటో డ్రైవర్లు నేడు అప్పులపాలై 161 ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం 161 బాధిత కుటుంబాలను కలవలేదని,బాధిత మహిళలను ఓదార్చే దిక్కులేదని విమర్శించారు.
ఆటో డ్రైవర్లు తమ పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నారని,గురుకులాల్లో చదివిద్దామంటే కాంగ్రెస్ ప్రభుత్వం 110 మంది విద్యార్థులను చంపిందని భయపడుతున్నారని పేర్కొన్నారు.
ఇటీవలే మాజీ ప్రధాని పి.వి నరసింహరావు గారి జన్మస్థలమైన వంగర గురుకులంలో శ్రీ వర్షిణి అనే అమ్మాయి మరణిస్తే,శవాన్ని ట్రాక్టర్లో తీసుకెళ్లారని గుర్తుచేశారు. వంగర పాఠశాల మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత నియోజకవర్గం అయినప్పటికీ కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్మించడానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.110 గురుకుల విద్యార్థులు మరణిస్తే కనీసం బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు.
సైదాబాద్ లో ఉన్న జువైనల్ హోం లో పది మంది అమ్మాయిలపై అత్యాచారం జరిగితే, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఎందుకు పరామర్శించలేదని,కనీసం బాధితులకు ఎలాంటి సహాయం అందించలేదని మండిపడ్డారు.
ఆటో డ్రైవర్లను, గురుకుల విద్యార్థులను చంపిన రక్తపు మరకలతో, మరియు మాగంటి గోపినాథ్ చనిపోతే, ఆయన సతీమణి ఏడిస్తే కూడా శంకించే వారు ఈ రోజు జూబ్లిహిల్స్ ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని నిలదీశారు. మహిళలను అవమానిస్తూ, వేధించే రౌడీలకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందన్నారు.వారు గెలిస్తే మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం జూబ్లిహిల్స్ లో జరిగేది సునీత, నవీన్ యాదవ్ మధ్య యుద్ధం కాదని, మహిళలకు మరియు రాష్ట్రంలో అధికారంలో ఉన్న మోసగాల్లకు మధ్య యుద్ధమన్నారు. ఈ యుద్ధంలో మహిళలు గెలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా జూబ్లిహిల్స్ ప్రజలు ఈ మోసపు ప్రభుత్వానికి బుద్ది చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు.