ఐపీఎల్ లో మహిళల ఫ్రాంచైజీల విక్రయానికి రంగం సిద్ధమైంది. బీసీసీఐ ఆసక్తి గల పార్టీల నుంచి బిడ్‌లను ఆహ్వానించింది. ఐదు జట్లతో మహిళల ఐపీఎల్ తొలి లీగ్ ను ఈ ఏడాది నుంచి బీసీసీఐ నిర్వహించనుంది. మార్చిలో ఆరంభం కానున్న మహిళా ఐపీఎల్ జట్ల కొనుగోలుకు పురుషుల ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మహిళల జట్లపై పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నాయి. ఐటీటీ డాక్యుమెంట్ కొనుగోలు ప్రక్రియను సీఎస్కే ఇప్పటికే ప్రారంభించింది. ‘‘బిడ్ డాక్యుమెంట్ కొనుగోలుకు దరఖాస్తు చేసుకున్నాం. ఇందులో ఆర్థిక అంశాల పట్ల ఇప్పుడు దృష్టి పెట్టాల్సి ఉంది. సీఎస్కేకు మహిళా జట్టు లేకపోతే చూడ్డానికి బాగుండకపోవచ్చు. మహిళల క్రికెట్ ను ప్రోత్సహించాల్సి ఉంది’’ అని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు.
బిడ్ డాక్యుమెంట్ కొనుగోలు చేస్తున్నట్టు రాజస్థాన్ రాయల్స్ కూడా ధ్రువీకరించింది. వుమెన్స్ ఐపీఎల్ జట్టుకు కనీస ధర అంటూ బీసీసీఐ నిర్ణయించలేదు. ఇది మంచి నిర్ణయమని, కనీస ధరను అధికంగా నిర్ణయిస్తే అప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ముందుకు రాకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.