– ఎస్.కోట, సీతంపేట, భీమవరం, పీలేరు…ఇతర చోట్ల
– ఇప్పటి వరకు డయాలసిస్ కు పెట్టిన ఖర్చు రూ. 164 కోట్లు
– రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి : కిడ్నీ రోగులకు ఉపశమనం కలిగించేలా రాష్ట్రంలో అదనంగా ఏడు కొత్త డయాలసిన్ (రక్త శుద్ధి) కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారంనాడు జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
విజయనగరం జిల్లా ఎస్.కోట, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, చిత్తూరు జిల్లా పీలేరు ఏరియా ఆసుపత్రుల్లో, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట, ఎస్పీఎస్ఆర్ జిల్లా వెంకటగిరి, బాపట్ల జిల్లా అద్దంకి, నంద్యాల జిల్లా సున్నిపెంట సీహెచ్సీ అనువత్రుల్లో ఈ డయాలసిస్ కేంద్రాలు కొత్తగా రానున్నాయని చెప్పారు. ప్రతి కేంద్రంలో ప్రతి రోజూ మూడు సెషన్ల ద్వారా 15 మందికి చొప్పున రక్త శుద్ది జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిన్ ప్రోగ్రాం (పిఎంఎన్డీపీ) కింద ఏర్పాటు కానున్న ఒక్కొక్క కేంద్రంలో సుమారు రూ.75 లక్షలు విలువచేసే 3 రక్త శుద్ధి యంత్రాలు/పరికరాలు సమకూరుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 232 కేంద్రాలు పనిచేస్తున్నాయి. రానున్న కొత్తవాటితో కలిపి వీటి సంఖ్య 239కు చేరుకుంటుంది.
ఎన్.కోట, సీతంపేట ఆసుపత్రుల్లోని కేంద్రాలు సిద్ధం
ఎస్.కోట, సీతంపేట ఆసుపత్రుల్లో కొత్త డయాలసిస్ కేంద్రాలు త్వరలో పనిచేయనున్నాయి. పీపీపీ విధానంలో వీటి నిర్వహణ బాధ్యతలను ఓ సంస్థకు అప్పగించారు. మిగిలిన కేంద్రాలను కూడా పీపీపీ విధానంలో నడిపేందుకు టెండర్లు పిలవాలని రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస (ఏపీఎంఎస్ఐడీసీ)ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కోరింది.
ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు…
“ఒక్కొక్క కేంద్రంలో 5 చొప్పున ఆధునిక రక్త శుద్ది యంత్రాలు అందుబాటులోకొస్తాయి. ప్రతి కేంద్రానికి అనుబంధంగా ప్రత్యేకంగా ఆర్వోప్లాంటు ఉంటుంది. ఈ కొత్త కేంద్రాల ఏర్పాటువల్ల డయాలసిస్ కోసం కిడ్నీ (మూత్రపిండాలు) రోగాలతో బాధపడేవారు దూర ప్రాంతాలకు వ్యయప్రయాసలతో వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. సకాలంలో రక్త శుద్ది జరగడంవల్ల వారికి ఆరోగ్య సమస్యలు కూడా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ప్రజాప్రతినిధులు, రోగుల విజ్ఞప్తి మేరకు పైన పేర్కొన్న ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు” మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు.
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా..
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 232లో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు అనుబంధంగా పీపీపీ విధానంలో 173 కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిల్లో 153 కేంద్రాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో, మిగిలినవి బోధన, ఇతర ఆసుపత్రుల్లో ఉన్నాయి.
వీటి ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో వేలాది మంది రోగులు 10,62,008 సార్లు డయాలసిస్ చేయించుకున్నారు.
పీఎంఎన్డీపీ ద్వారా…
ప్రధానమంత్రి నేషనల్ డయాలసిన్ ప్రోగ్రాం (పీఎంఎన్డీపీ) ఆధ్వర్యంలో 59 డయాలసిస్ కేంద్రాలు వనిచేస్తున్నాయి. వీటి ద్వారా కూడా అధిక సంఖ్యలో రోగులకు 4,95,186 సార్లు డయాలసిస్ జరిగింది. ఈ కేంద్రాలు జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీల్లో ఉన్నాయి. వైద్యుల సిఫారసు మేరకు రోగులకు సగటున నెలకు 6 నుంచి 8 సార్లు ఉచితంగా రక్తశుద్ధి చేస్తున్నారు.
పేదల కోసం ఏటా భారీ వ్యయం
గడచిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో డయాలసిస్ చేయించుకున్న కిడ్నీ రోగుల కోసం కూటమి ప్రభుత్వం రూ.164 కోట్లు వ్యయం చేసింది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా రూ. 110 కోట్లు, ప్రధాన మంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద రూ.54 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది.
డయాలసిస్ ఎవరికి అవసరం
కిడ్నీలు శరీరంలో వ్యర్థాలను వడగడుతాయి. ఒకరోజులో దాదాపుగా 1,500 లీటర్ల రక్తాన్ని శుద్ధిచేస్తాయి. ఈ కిడ్నీలు అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్, మితిమీరిన మందుల వినియోగం, మధుమేహంతోనో దెబ్బతింటే రక్త శుద్ధి తప్పనిసరి. దీర్ఘకాలికంగా కిడ్నీ జబ్బులు ఉన్న వారికి జీవితాంతం డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తుంది