– తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ‘పోలీస్’ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా… విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వచ్చినా పోలీస్ వెనుకడుగు వేయడు. ఒకవైపు నెత్తురు చిందుతున్నా… మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గోషామహాల్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ‘అక్టోబరు 21’న“పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నా.
పోలీసు అమరవీరులను స్మరించుకునే రోజు అక్టోబర్ 21కి మహోన్నత చరిత్ర ఉంది. దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణ త్యాగం చేశారు. వారందరికీ పేరు పేరునా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు.
గ్రేహౌండ్స్ కమాండోలు.. టి. సందీప్, వి.శ్రీధర్, ఎన్. పవన్ కల్యాణ్ సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం చెందారు. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి.సైదులు విధినిర్వహణలో మరణించారు. మూడు రోజుల కింద నిజామాబాద్ లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం చెందారు. భర్త ప్రమోద్ ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.
ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీ తో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నాం.
వీటితోపాటు పోలీస్ భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా… పోలీస్ వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటాం. 29-06-2008 న ఒరిస్సాలో మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది పోలీస్ కుటుంబాలకు గాజులరామారంలో 200 గజాల స్థలం కేటాయించాం. తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం మా ప్రభుత్వానికి గర్వకారణం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం, దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించింది. అదేవిధంగా, పాస్పోర్ట్ వెరిఫికేషన్ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందింది.
ఈ విజయాలు తెలంగాణ పోలీస్ సిబ్బంది నిరంతర కృషి, అంకితభావానికి నిదర్శనం. ఇలాగే, ప్రజల భద్రత, శాంతిని కాపాడుతూ, తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆశిస్తున్నా. తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్ కాలర్ నేరాలు, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో పెరగనివ్వకుండా అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు.
నేరం చేసి తప్పించుకోలేమన్న పరిస్థితిని సృష్టించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచిన తెలంగాణ పోలీస్ శాఖను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఈగల్’ వింగ్ సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి అనేది మా ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతోపాటు విస్తృత అధికారాలు ఇచ్చాం. డ్రగ్స్ దందా వెనక ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దు అనే ఆదేశాలను జారీ చేశాం.
ఒకప్పటితో పోలీస్తే నేరాల స్వభావం మారుతోంది. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు, మార్ఫింగ్ కంటెంట్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. మానవ నేరాలను మించి సైబర్ క్రైమ్ వార్తలు పత్రికల్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. టెక్నాలజీ రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెబుతున్న తీరు భేష్.
సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు అందరికంటే ముందంజలో ఉండటం మనకు గర్వకారణం.
సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ‘సైబర్ సెక్యూరిటీ బ్యూరో’ను ఏర్పాటు చేశాం. ఈ విభాగం అత్యంత సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తూ దేశంలో ది బెస్ట్ గా నిలిచింది. సైబర్ నేరగాళ్ళను అరికట్టడానికి అంతర్ రాష్ట్ర ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది. తీవ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి.
కానీ నేడు పోలీస్ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సూచిస్తున్నాను. ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పని చేసిన అధికారుల కృషిని మా ప్రభుత్వం గుర్తించింది. పోలీసు శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ పోలీసు అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబీ, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్, ఆర్మ్డ్ రిజర్వ్, సీసీఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్ల సారథ్యం వహించడం మా ప్రభుత్వానికి గర్వకారణం.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ కీలక పోలీసు కమిషనరేట్లలో జోన్ డీసీపీలుగా ఏడుగురు మహిళా అధికారులే. రెండేసి కీలక విభాగాలను సైతం సమర్థవంతంగా నడిపిస్తున్న మహిళా ఐపీఎస్ అధికారులను చూసి తెలంగాణ గర్విస్తోంది. పోలీసు ఉద్యోగమంటే కత్తి మీద సాము వంటిదే.
పోలీసులకు ప్రతి క్షణం పరీక్షే, ప్రతి దినం పోరాటమే. ఒకవైపు నేరాల అదుపు, మరోవైపు నేరాల విచారణ, ట్రాఫిక్ నియంత్రణ, పగటి గస్తీ, రాత్రి గస్తీ, బందోబస్తు, వీఐపీ రక్షణ.. ఇలా సవాలక్ష బాధ్యతలతో విరామం లేకుండా పని చేస్తూ మనమందరం ప్రశాంతంగా జీవించేందుకు తమ జీవితాలను త్యాగం చేస్తుంటారు. ఇంతటి కఠినమైన సవాళ్లతో బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.
అందుకే మా ప్రభుత్వం పోలీసుల సంక్షేమం కోసం అనేక చర్యలను చేపట్టింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 వేల మంది కానిస్టేబుల్స్, ఎస్ఐలను రిక్రూట్ చేసింది. రాజకీయ జోక్యం లేకుండా పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పించాం. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి, అంగవైకల్యం పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యధిక నష్టపరిహారం అందించాం.
విధినిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉచిత విద్య, వైద్యం, బస్ పాస్ సౌకర్యం తదితర పథకాలను అందజేస్తున్నాం.
మెడికల్ సీట్ల లోను పోలీస్ అమరుల పిల్లలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తున్నాం. తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్ గ్రేషియాను కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐల వరకు కోటి రూపాయలను, ఎస్సై సీఐలకు కోటి 25 లక్షల రూపాయలను, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీలకు కోటి 50 లక్షల రూపాయలను, ఎస్పీలకు ఇతర ఐపీఎస్ అధికారులకు రెండు కోట్ల రూపాయలకు పెంచుతూ మా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
మన ప్రాణానికి వారి ప్రాణాలను అడ్డుపెట్టే పోలీసుల రుణం ఏమిచ్చినా తీరదు. సమాజ శ్రేయస్సే ఊపిరిగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యతతోనే పోలీసు సిబ్బంది పిల్లలకు ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం. అందులో భాగంగా పోలీసుల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించాం. ఇందులో 50 శాతం సీట్లు పోలీస్ సిబ్బంది పిల్లలకు, మిగతా 50 శాతంసాధారణ పౌరుల పిల్లలకు కేటాయించాం. ఒలంపియన్, బాక్సర్ నిఖత్ జరీన్, వరల్డ్ కప్ విన్నర్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు డీఎస్పీగా ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ పోలీసుల ప్రతిష్ఠతను పెంచాం.
ప్రజాస్వామ్య పాలనలో ప్రజల హక్కులను కాపాడుతూ, వారి సమస్యలను తెలియజేసేందుకు చేపట్టే నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తూనే, ఈ సందర్భంలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో సున్నితంగా వ్యవహరించాలి. సమాజంలో శాంతి భద్రతలను సుస్థిరంగా ఉంచేందుకు పాటుపడే క్రమంలో విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేని.
ఈ పోలీసు ‘ఫ్లాగ్ డే’ సందర్భంగా వారి ఆత్మలకు శాంతి కలగాలని మా ప్రభుత్వం తరఫున మరోసారి హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది