– ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సూటిప్రశ్న
మంగళగిరి : కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించి, పేదలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెస్తుంటే, వైసీపీ దీనిపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా రాష్ట్ర విద్యార్థులకు 220 అదనపు మెడికల్ సీట్లు, అందులో 110 సీట్లు పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అందుబాటులోకి తెస్తోందని తెలిపారు.
జగన్ విధానాల వల్ల కాలేజీల నిర్మాణానికి 10 సంవత్సరాలకు పైగా సమయం పడితే, కూటమి పీపీపీ విధానం ద్వారా కేవలం రెండేళ్లలో 1750 మెడికల్ సీట్లను అందుబాటులోకి వస్తాయని, ఈ విధానంలో ప్రభుత్వ నిబంధనలు, రిజర్వేషన్లు పూర్తిగా అమలు అవుతాయన తెలిపారు. పీపీపీ విధానం ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, కానీ జగన్మోహన్ రెడ్డి ఈ సేవలను పేదలకు చేరకుండా అడ్డుకోవడం దారుణమని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.
వైసీపీ తమ పాలనలో ఒక్క మెడికల్ కాలేజీనైనా నిర్మించిందా అని ప్రశ్నిస్తూ, ఖర్చు చేసిన నిధులు కేంద్రం నుంచి వచ్చినవేనని ఆయన ఎద్దేవా చేశారు. జీఓ 107, 108, 133 ద్వారా జగన్ ప్రభుత్వమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 50% సీట్లను ప్రైవేటీకరించిందని, కూటమి ప్రభుత్వం కొత్తగా ఎలాంటి ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టం చేశారు. పీపీపీ కాలేజీలు 33 ఏళ్ల తర్వాత పూర్తిగా ప్రభుత్వ స్వాధీనంలోకి వస్తాయని తెలిపారు.
45 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల విజనరీ నాయకుడు చంద్రబాబు, హైదరాబాద్, సైబరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చినట్లే, ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని తెలిపారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత, లోకేష్ ఆధ్వర్యంలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని, దేశంలో ఏ రాష్ట్రమూ సాధించలేని భారీ పెట్టుబడులను లోకేష్ సాధించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గూగుల్ డేటా సెంటర్ లక్షలాది విద్యార్థులకు ఉపాధి అవకాశాలను అందిస్తుందని, ఇతర రాష్ట్రాలు గూగుల్‌ను తీసుకురాలేకపోయామని ఆవేదన చెందుతుంటే, వైసీపీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేక నీచ వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గూగుల్ రాష్ట్రానికి వచ్చిందా లేదా అని సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా చెప్పాలని వైసీపీ కోరడం అవివేకమని తెలిపారు. ఒకవైపు గూగుల్ రాలేదని, మరోవైపు దాని వల్ల పర్యావరణం దెబ్బతింటుందని వైసీపీ వాదనలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనల కోసం వందలాది చెట్లను నరికినప్పుడు పర్యావరణం దెబ్బతినలేదా అని ప్రశ్నించారు.
వైసీపీ 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టూ తీసుకురాలేకపోయిందని, ఉన్న ప్రాజెక్టులను కూడా నాశనం చేసిందని దుయ్యబట్టారు. జాకీ, అమర్ రాజా సంస్థలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయని, కియా సంస్థను బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర యువత భవిష్యత్తును ఫిష్, మటన్ మార్కెట్లకు వైసీపీ పరిమితం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రజాధనాన్ని పార్టీ కార్యాలయాలకు రంగులు వెయ్యడానికి, వృథా చేసిందని, పర్యావరణాన్ని పట్టించుకోకుండా రుషికొండలో భవనం నిర్మించిన జగన్, మెడికల్ కాలేజీలను మాత్రం నిర్మించలేకపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాంలో తాడేపల్లిపై ఆధారాలు చూపిస్తుండగా, దృష్టి మళ్లించేందుకు కల్తీ మద్యం కథను వైసీపీ సృష్టించిందని తెలిపారు.
నెల్లూరు జిల్లా, గుడ్లూరు మండలం రాళ్లపాడులో ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన హత్యను కులాలతో ముడిపెట్టి, వైసీపీ విష ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదు, అది రాక్షస సమూహమని తీవ్రంగా దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడించిన ఒక భూతాన్ని తరిమికొట్టామని ఆనందోత్సవాలతో ప్రజలు ఘనంగా దీపావళి పండుగ జరుపుకొన్నారని తెలిపారు. వైసీపీ స్వభావంలో విధ్వంసం ఉందని, అధికారంలో ఉన్నా, లేకపోయినా, వారి ధోరణి నాశనకారిగానే ఉంటుందని, ఈ విధ్వంస వ్యాధి రాష్ట్రాన్ని మళ్లీ ఆక్రమించకుండా ప్రజలు కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు