కేంద్రంలో 9 లక్షల ఉద్యోగ ఖాళీలు

-రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలలో మొత్తం 9,79,327 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సిబ్బంది, ప్రధాన మంత్రి కార్యాలయ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభకు తెలిపారు. వైయ‌స్ఆర్‌సీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం కింద పనిచేసే పే రీసెర్చి వార్షిక నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో 9 లక్షల 79 వేల ఉద్యోగ ఖాళీలు ఏర్పడినట్లు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాలలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయడం లేదని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఏర్పడే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత ఆయా మంత్రిత్వ శాఖలదే. అదో నిరంతరం ప్రక్రియ. ఉద్యోగుల రిటైర్మెంట్‌, ప్రమోషన్‌, రాజీనామా, మరణం వంటి కారణాలతో ఖాళీలు ఏర్పడతాయని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడే ఉద్యోగ ఖాళీలన్నింటినీ నిర్దిష్ట కాలపరిమితిలోగా భర్తీ చేయాలని ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

దేశంలో 21 అణు విద్యుత్ కేంద్రాలు
దేశంలో మొత్తం 21 అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు పీఎంవో మంత్రిత్వశాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో వైయ‌స్ఆర్‌సీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. కార్బన్ ఉద్గారాలను అరికట్టి పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలలో భాగంగా 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సమకూర్చుకుంటుందని గ్లాస్కోలో జరిగిన కాప్26 సదస్సులో ప్రధాన మంత్రి పేర్కొన్నారు. తద్వారా దేశ ఇంధన అవసరాలలో 50 శాతం మేర పునరుత్పాదక ఇంధనం ద్వారా పొందేలా అణు విద్యుత్ ఉత్పాదనపై దృష్టి సారించినట్లు తెలిపారు.

దేశంలో నెలకొల్పుతున్న అణు రియాక్టర్లలో 8700 మెగా వాట్ల సామర్ధ్యం కలిగిన 11 రియాక్టర్లలో కొన్ని ఇప్పటికే ప్రారంభ అయ్యాయని, మరికొన్ని వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇవికాకుండా 700 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మరో 10 అణు రియాక్టర్ల స్థాపనకు ప్రభుత్వం ఆర్థిక, పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్లుల్లో పనులు చురుగ్గా సాగుతుండగా కొన్ని చోట్ల పలు కారణాల వలన పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. అణు రియాక్టర్ల ఏర్పాటుకు అవసరమైన కీలక పరికరాల సరఫరాలో అవాంతరాలు, ఆర్థిక సమస్యలు, ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతతోపాటు కోవిడ్ మహమ్మారి వంటి కారణాల వలన రియాక్టర్ల నిర్మాణంలో జాప్యం చోటుచేసుకున్నట్లు వివరించారు.

ఏపీలో 5876 మంది చిరు వ్యాపారులకు పెన్షన్
జాతీయ పెన్షన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 5876 మంది చిరు వ్యాపారులు మాత్రమే నమోదయ్యారని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు. రాజ్యసభలో గురువారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయం తెలిపారు. 2023-2024 నాటికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 3 కోట్ల మంది వివిధ రకాలైన చిరువ్యాపారులు, వర్తకులు, స్వయం ఉపాధిపై ఆధారపడే వారిని ఈ పథకంలో చేర్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు.

ఈ పథకం కింద ఈ ఏడాది జూలై 17 వరకు దేశవ్యాప్తంగా కేవలం 50680 మంది మాత్రమే నమోదయ్యారని మంత్రి చెప్పారు. గడిచిన రెండేళ్ళుగా కోవిడ్ మహమ్మారి ఈ పథకం అమలుపై తీవ్ర ప్రభావం చూపింది. అనేకమంది చిన్న వ్యాపారులు, వర్తకులు, వీధి వ్యాపారులు ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ ధన్ పథకంలో ఇప్పటికే నమోదయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సాయంతో ఆయా రాష్ట్రాల్లో అర్హులైన లబ్దిదారులు ఈ పథకంలో చేరేలా ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. జాతీయ పెన్షన్ పథకంపై సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నామని అన్నారు.

Leave a Reply