Suryaa.co.in

Political News

జనసేన టిడిపి తో కలిసినందుకు… 90% సంతృప్తి..10% అసంతృప్తి!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రం బాగు పడాలంటే, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే,రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధిజరగాలంటే, చట్టం తన పని తాను చేసుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోవాలని పిలుపునిచ్చారు.

కలిసి వస్తే బిజెపి తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తూ వారాహి విజయ యాత్ర ద్వారా ప్రజలలో వాస్తవ విషయాలను ప్రజల భాషలో అర్థమయ్యేటట్టుగా వివరంగా తెలియచేస్తున్నారు.

ప్రభుత్వం ఎందుకు మారాలి? మారకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడే బాధలను కళ్ళకు కనపడేటట్టుగా వివరిస్తూ, నేను అధికారం అనుభవించడానికి, డబ్బు సంపాదించుకోవడానికి, రాజకీయాలలోకి రాలేదని చెబుతూ, నమ్మిస్తూ, నమ్మకాన్ని కలుగజేస్తూ,ధైర్యం ఇస్తూ ముందుకు పోతున్న విషయం మనకు తెలిసిందే.

అయితే కొంతమంది కాపు సోదరులు, గతంలో రంగా గారి మర్డర్ లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు హస్తం ఉందని నమ్ముతున్న కాపులు, చంద్రబాబు నాయుడు తో పవన్ కళ్యాణ్ కలవడం ఇష్టం లేదు అనే విషయం అర్థం అవుతుంది. అది కొంతవరకు వాస్తవం.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, దౌర్జన్యాలను అరికట్టాలంటే.. చంద్రబాబుతో కలవకుండా ప్రభుత్వం మారుతుందా? మారకపోతే ఈ రాష్ట్రం ఏమై పోతుందో ఒకసారి ఆలోచించారా? ఆ రోజులలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంటే అది తప్పే. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి.. రంగా గారి మర్డర్లో ఉన్న ముద్దాయిలకు ఒకరికి కూడా శిక్ష పడకుండా కేసు నీరుగారిపోయిన విషయం మర్చిపోవద్దు.

పవన్ కళ్యాణ్ ఒక్కరే ఎవరి సహకారం లేకుండా పోటీ చేస్తే, ఈ మాటలు మాట్లాడిన వారే ఏమంటారంటే .. పవన్ కళ్యాణ్ ఒక్కరే గెలవలేరండి ఓటు వేస్ట్ అవుతుంది అండి. నాకు స్థానికంగా ఆ నాయకుడు వైఎస్ఆర్సిపి తో,ఈ నాయకుడు తెలుగుదేశంతో మొహమాటం ఉందండి. గెలిచేటప్పుడు వేస్తామండి అని… ఇలాంటి పలుకులు పలుకుతారు. మరి దీనికి ఏం సమాధానం చెబుతారు? చెబుతారా!ఆలోచించండి. వాస్తవాలకు విరుద్ధంగా ఆలోచిస్తే శ్రమ, కంఠశోష, తప్ప ఫలితం రాదు.

కొంతమంది కాపు సోదరులు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలని 2024 కాకపోతే, 2029 లో కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని అభిప్రాయంతో ఉన్నారు. సంతోషం. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఒక్కసారి గ్రహించండి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ సినిమాలో ఆడనివ్వకుండా ఉండడం, సినిమా టికెట్టు ఐదు రూపాయలు చేయడం, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వస్తే ప్లాస్టిక్ నిషేధమని ఫ్లెక్సీలు కట్టనివ్వకుండా జరిగిన పరిణామాలు మరిచిపోయారని నేను అనుకోను.

తను సంపాదించిన డబ్బును రైతులకు, పార్టీకి ఖర్చు పెడుతూ ప్రజలలో చైతన్యం తీసుకువస్తూ, ఎవరి సహాయ సహకారం లేకుండా కేవలం కొంతమంది యువత అభిమానులు,కాపు సోదరుల సహాయంతో పార్టీని ఒక గౌరవప్రదమైన స్థానానికి తీసుకొచ్చి ప్రపంచం మెచ్చే నరేంద్ర మోడీ పక్కన స్థానం కల్పించారంటే.. వారి నిజాయితీ,నిబద్ధత,దేశం పట్ల ప్రేమ అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ ని అభిమానించకుండా, ప్రేమించకుండా ఉండలేము.

రాష్ట్ర రాజకీయాలలో కొంతమంది మేధావులు, పండితుల ఆలోచన ఏంటంటే.. ఈ రాష్ట్రంలో అనాదిగా రెండు కులాల (ఒకటి 5%,ఇంకొకటి 6% %) పెత్తనం,నాయకత్వం సాగుతూ వచ్చింది. ఇప్పుడు మూడో కులం (23% ఓట్లు) నాయకత్వం వస్తే సహించలేక.. కొంతమంది డిబేట్లలో, అనలిస్టుల పేరుతో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. రాష్ట్ర రాజకీయాలలో ఏ పార్టీ కూడా ఒక కులం ఓట్లతో గెలవలేదు ఇది అందరికీ తెలిసిన సత్యమే.

రాష్ట్ర రాజకీయాలలో వంగవీటి మోహన్ రంగా గారి 30 సంవత్సరాల తర్వాత నిస్వార్ధ, నిజాయితీ, నిబద్ధత, దేశభక్తి కలిగిన.. కోట్లాదిమంది ప్రజాదరణ పొందిన నాయకుడు ఎవరూ రాలేదేనే దాంట్లో మొహమాట పడవలసిన అవసరం లేదు. ఈ రాష్ట్ర పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ఇటువంటి నాయకుడికి జేజేలు పలికి వారికి అండగా, దండగా ఉండకపోతే రాష్ట్రం నష్టపోతుంది ఆలోచించండి.

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు ,
మొబైల్ నెంబర్ 7386128877

LEAVE A RESPONSE