– ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్ల తొలగింపు
-దొంగ ఓట్ల నమోదు నిజమేనని అంగీకరించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా
-దొంగ ఓట్ల నమోదుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
-ఎన్నికల ప్రక్రియ నుంచి వాలంటీర్లను శాశ్వతంగా తప్పించాలి
– ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ కు లేఖ రాశా…
-జగనన్న ఆణిముత్యాల స్కీం ఏమిటో ఒక్క క్షణం నాకు అర్థం కాలేదు
– నువ్వే మా దేవుడివని జగన్మోహన్ రెడ్డి పాట పాడించుకోవడం ఎబ్బేట్టుగా ఉంది
-ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించే ప్రతి మీటింగును రాజకీయ సభ మారుస్తోన్న జగన్మోహన్ రెడ్డి
-టిడిపి, జనసేన, బిజెపిల మధ్య నూటికి నూరుపాళ్లు పొత్తు ఉంటుంది
– పవన్ వ్యాఖ్యలు, చంద్రబాబు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు
-పవన్ కళ్యాణ్ ను కాపు నేతలతో తిట్టించినప్పుడు ముద్రగడ లేఖ రాసి ఉంటే బాగుండేది
– అలాగే నన్ను అపహరించి లాకప్ లో చిత్రహింసలకు గురి చేసినప్పుడు స్పందించి ఉంటే మరింత బాగుండేది
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
అధికార పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఐ ప్యాక్ కనుసన్నల్లోనే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో దొంగఓట్ల నమోదు ప్రక్రియ నిజమేనని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా అంగీకరించారు.
దొంగ ఓట్లు నమోదు నిజమేనన్న ఆయన వ్యాఖ్యలను అన్ని ప్రధాన దినపత్రికలు యధాతధంగా ప్రచురిస్తే, సాక్షి దినపత్రిక మాత్రం అది సర్వసాధారణ విషయమేనని ఆయన కొట్టి పారేశారని వార్తా కథనాన్ని ప్రచురించడం పరిశీలిస్తే ఈ దొంగ ఓట్ల నమోదు వెనుక మా పార్టీ ప్రమేయం ఉన్నట్టు స్పష్టం అవుతోందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు .
మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… దొంగ ఓట్ల నమోదు, ఓట్ల జంబ్లింగ్ విధానంపై మచిలీపట్నానికి చెందిన దిలీప్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఓట్ల జంబ్లింగ్ వల్ల సాధారణ ఓటరు తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేరని ఆయన తన ప్రజావాజ్యంలో పేర్కొన్నారు. ఇది అక్షరాలా నిజం అన్నారు. ఓటరు తన పోలింగ్ బూత్ కు వెళ్లడానికి బద్దకిస్తారని, ఆలోగానే మా పార్టీ వారు దొంగ ఓటు వేసేస్తారు.
విశాఖపట్నంలో ఈసారి ఎలాగైనా రామకృష్ణ బాబును ఓడించాలనే ఉద్దేశంతో 40 వేల దొంగ ఓట్లను నమోదు చేయడం జరిగింది. ఒక ఇంట్లో 500 ఓట్లు, మరొక ఇంట్లో 200 దొంగ ఓట్లను నమోదు చేశారు. ఈ దొంగ ఓట్ల నమోదు అంతా మా పార్టీ వారే చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రెవిన్యూ అధికారుల సహకారంతో వాలంటీర్లు దొంగ ఓట్ల నమోదు ప్రక్రియకు తెర లేపారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ కు వివరిస్తూ నేను ఒక లేఖ రాశాను.
దొంగ ఓట్ల నమోదు ప్రక్రియకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. వారిని కఠినంగా శిక్షించాలి. లేకపోతే, ఏముందిలే ఎవరు మనని పట్టించుకుంటారులే అనే ధీమాతో, మన దారిన మనం చేసుకో పోదామని అధికారులు పదే పదే తప్పులు చేస్తారు. నాలుగు కోట్ల ఓట్లలో రెండు, మూడు లక్షలు ఓట్లు గల్లంతు కావడం సర్వసాధారణమేనని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి పేర్కొన్నట్లుగా సాక్షి దినపత్రిక వక్రీకరణ కథనాలు రాయడం హాస్యాస్పదంగా ఉంది. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లకు సంబంధమే లేదు.
ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా రోజు వారి వేతనంతో కొంతమంది సిబ్బందిని ఎన్నికల సంఘం అధికారులు నియమించుకుంటారు. రోజువారి వేతనం పై పని చేసే వారిని ప్రభావితం చేసి, అధికారుల సహకారంతో దొంగ ఓట్ల నమోదు, ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడం ద్వారా వాలంటీర్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తంగా ఉండాలి. విదేశాలలో నివసించే వారి పేరిట కూడా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు. అలాగే ఎవరైతే గ్రామాలలో నివసించడం లేదో వారి ఇంటి చిరునామా పేరిట దొంగ ఓట్లు నమోదు చేయడమన్నది ఆనవాయితీగా మారింది.
నా నియోజకవర్గ పరిధిలోని తణుకులో రెండు బూతుల పరిధిలోని 100 ఇండ్లలో 200 నుంచి 300 దొంగ ఓట్లను నమోదు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఏడు నుంచి పదివేలకు తగ్గకుండా దొంగ ఓట్లను నమోదు చేయడమే కాకుండా, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
రెండు రోజులకు ఒకసారి వెలుగు చూస్తున్న వాలంటీర్ల అఘాయిత్యాలు
రాష్ట్రంలో రెండు రోజులకోకసారి వాలంటీర్ల అఘాయిత్యాలు వెలుగు చూస్తున్నాయి. వాలంటీర్లలో కొంతమంది మంచివారు ఉండవచ్చు కానీ, ఎక్కువమంది తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. విజయనగరంలో భర్త ఇంట్లో లేని సమయం చూసి ప్రవేశించిన వాలంటీర్, గృహిణిపై అఘాయిత్యం చేయబోగా, స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. మా పార్టీ సానుభూతిపరులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వాలంటీర్లుగా నియమించి ప్రజలపైకి వదిలేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగి అయితే ఒక భయం, భక్తి, బాధ్యత ఉంటుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు. ఏ ఇంటికి ఏ సమయంలోనైనా వెళ్లే అధికారాన్ని వాలంటీర్ కు అనధికారికంగా కట్టబెట్టారు. లక్షల మంది వాలంటీర్లను ప్రజల ఇళ్లపైకి వదిలివేస్తే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. బాధ్యత లేకుండా బజారులో వదిలేస్తే ఇలాంటి పనులే చేస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత కూడా వాలంటీర్లను యధావిధిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. వాలంటీర్లు బాధ్యతతో వ్యవహరించాలి. ప్రభుత్వ పెద్దలు చెప్పారని తప్పుడు పనులు చేసే వారిని కచ్చితంగా ప్రభుత్వం మారిన తర్వాత ఉద్యోగంలో నుంచి తొలగించడం జరుగుతుంది.
దొంగ ఓట్ల నమోదు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్ల తొలగింపు ప్రక్రియకు ఉద్యోగాలు కావాలనుకునే వాలంటీర్లు సహకరించవద్దు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలిసి రాష్ట్రంలో ఓట్ల నమోదు ప్రక్రియలో, తొలగింపులోనూ జరుగుతున్న అక్రమాలను కూలంకషంగా వివరిస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
ప్రజాస్పందనను చూసి గెలుస్తామని ప్రతిపక్షాలు భావించి, ఓటరు జాబితాను ఎప్పటికప్పుడు పరిశీలించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే, మా పార్టీ నాయకత్వం తెరచాటు వ్యవహారాలకు తెరతీసింది. తమ ఓట్లను తాము కాపాడుకుంటూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు తెలుగుదేశం, జనసేన పార్టీలు కృషి చేయాలని రఘురామకృష్ణం రాజు కోరారు.
పరీక్షల్లో ర్యాంకులు తెచ్చుకున్న వారు జగనన్న ఆణిముత్యాలట…!
పరీక్షల్లో కష్టపడి ర్యాంకులు సాధించుకున్న విద్యార్థులు జగనన్న ఆణిముత్యాలట. జగనన్న ఆణిముత్యాలు అనే పథకం ఏమిటో ఒక్క క్షణం నాకు అర్థం కాలేదు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతో పాటు పలు పథకాలకు ముఖ్యమంత్రి తన పేరు పెట్టుకున్నారంటే సరే… కానీ కష్టపడి చదివిన విద్యార్థుల శ్రమను తన కీర్తి ప్రతిష్టలు పెంపొందించు కోవడం కోసం వినియోగించుకోవాలని చూడడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఆణిముత్యాలు పథకానికి నాలుగు కోట్ల రూపాయల నిధులను కేటాయించారు.
ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేయాలని నిర్ణయించారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నప్పటికీ, ఈ పథకం ప్రచారం కోసం కోట్ల రూపాయలు వెచ్చించి సాక్షి దినపత్రికలో వ్యాపార ప్రకటనను జారీ చేయడమే విడ్డూరంగా ఉంది. నువ్వే మా దేవుడివని జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లల చేత పాట పాడించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కాళ్లకు దండం పెట్టిన వారి నెత్తిపై చేతులు పెట్టి ఆశీర్వదించడం విడ్డూరంగా ఉంది. తొమ్మిదేళ్లపాటు దేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరిని కూడా తన కాళ్లకు దండం పెట్టనివ్వరు.
ఎవరైనా చిన్నారులు దండం పెడితే వారితో ఎంతో ఆప్యాయంగా ముచ్చటిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి దానికి భిన్నంగా గ్రీకు మైథాలజీ ప్రకారం పరిపాలకుడే దేవుడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని రఘురామకృష్ణంరాజు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఒక్క అవకాశం ఇవ్వమని అడుక్కున్న వ్యక్తి… ఇప్పుడు నువ్వే మా దేవుడి వని పాట పాడించుకోవడం, ప్రజలు నవ్వుతారని కూడా భావించకపోవడం సిగ్గుచేటు. రాష్ట్రంలో దాదాపు 6000 స్కూళ్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నాలుగేళ్లలో ఒక ఉపాధ్యాయ నియామకాన్ని కూడా చేపట్టలేదు.
ఇంగ్లీషులో విద్యాబోధన కోసం ఉపాధ్యాయులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహించలేదు. అయినా తాను సీబీఎస్ఈ సిలబస్ ను ప్రవేశ పెట్టానని జగన్మోహన్ రెడ్డి గొప్పలు పోతున్నారు. 40 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో నాలుగున్నర నుంచి ఐదు లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్లారు. దేశంలోనే విద్యార్థుల డ్రాప్ అవుట్ లో చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉన్నది. నాడు నేడు పథకంలో భాగంగా ఐదువేల అదనపు తరగతి గదులను నిర్మిస్తామని చెప్పి 500 తరగతి గదులను మాత్రమే నిర్మించారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎత్తివేశారు. విదేశీ విద్య మూడేళ్ల పాటు విద్యార్థులకు అందుబాటులో లేదు. ఇప్పుడు ప్రవేశపెట్టినప్పటికీ ఎన్నో షరతులు విధించారు. వాలంటీర్లకు సేవా వజ్రా, సేవా రత్న అవార్డులను ఇచ్చి ప్రజా సొమ్మును గుల్ల చేస్తున్నారు. సంవత్సరానికి సాక్షి దినపత్రికకు 200 నుంచి 300 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఆదాయాన్ని ప్రభుత్వమే సమకూర్చుతోంది. ఒక్కొక్క ప్రభుత్వ సభకు ఐదు నుంచి 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ప్రభుత్వ సభలలో తన గొప్పలు, తన గురించి కీర్తనలు, ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటూనే, ప్రతిపక్ష పార్టీ నేతలపై, మీడియా సంస్థలపై విమర్శలు గుప్పించడం జగన్మోహన్ రెడ్డికి ఆనవాయితీగా మారింది.
ప్రతి ప్రభుత్వ సభను రాజకీయ సభగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. రాజమండ్రిలో మొక్కలు నాటినందుకు స్థానిక ఎంపీకి దుబాయిలో అవార్డు ప్రధానం చేసినట్టు తెలిసింది. అయితే ముఖ్యమంత్రి రాజమండ్రి పర్యటనలో చెట్లను నరకకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక ఎంపీదే.
ఉభయగోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వృక్షాలను నరికిస్తే, నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేసు వేస్తాను. అధికార పార్టీ రెండు నుంచి మూడు ఎకరాల స్థలాన్ని పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంటోంది. ఇందులో ప్రభుత్వం మారాక ఎన్ని స్థలాల లీజు రద్దు చేస్తారో చూడాలని రఘురామకృష్ణం రాజు అన్నారు.
సాక్షి దినపత్రిక పైత్యం ఇది…
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి, సిబిఐకి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే . అన్ని దినపత్రికలు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించగా, సాక్షి దినపత్రికలో మాత్రం ఒక మూడు లైన్ల వార్తను రాశారు. అదే జస్టిస్ అమానుల్లా ఖాన్ ఇచ్చిన ఉత్తర్వులను మాత్రం ఫ్రంట్ పేజీలో అర పేజీ రాయడం జరిగింది.
అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు ఇవ్వడంతో సాక్షి దినపత్రిక అవాక్కయినట్లుంది. తమ్ముడిని, చెల్లెల్ని జగన్మోహన్ రెడ్డి సమదృష్టితో చూసి ఉంటే ఒకరికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినప్పుడు ఫ్రంట్ పేజీలో అరపేజీ రాయడం, మరొకరికి అనుకూలంగా ధర్మాసనం తీర్పు ఇచ్చినప్పుడు మూడు లైన్ల వార్త రాయడం చేసి ఉండేవారు కాదని రఘు రామకృష్ణంరాజు అన్నారు.
మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుంది
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపిల మధ్య నూటికి నూరుపాళ్లు పొత్తు ఉంటుంది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిపోయాయి. గత రెండేళ్లుగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య మంచి సమన్వయం కనిపిస్తోంది. ఉభయగోదావరి జిల్లాలోని 34 స్థానాలలో ఒక్క స్థానం కూడా అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రావద్దన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల్లో ఎటువంటి దోషం లేదు.
అలాగే 175 కు 175 స్థానాలు మనకే రావాలన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్లోనూ తప్పులేదు. రేపు ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే నరసాపురం స్థానం ఏ పార్టీ తీసుకుంటే, ఆ పార్టీ తరఫున నేను పోటీ చేస్తాను. కూటమిలోని అన్ని పార్టీల జెండాలను ప్రచారంలో భాగంగా పట్టుకొని ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ముఖ్యమంత్రి అవకాశం వస్తే కాదననని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది.
మంత్రులు పెద్దిరెడ్డి, సత్తిబాబులకు ముఖ్యమంత్రి అవకాశం వస్తే వద్దంటారా?, మా పార్టీ వారి వాదనలు కోడిగుడ్డుపై ఈకలు పీకినట్టుగా ఉన్నాయని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ప్రజల ఆకాంక్షల మేరకు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు కచ్చితంగా ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టారు. పవన్ కళ్యాణ్ ను మా పార్టీ కాపు నేతలు, మంత్రులు, మాజీ మంత్రులు పరుష పదజాలంతో దూషించినప్పుడు ముద్రగడ పద్మనాభం లేఖ రాసి ఉంటే బాగుండేది.
అలాగే నన్ను అపహరించి లాకప్ లో చిత్రహింసలకు గురి చేసినప్పుడు, వీడియో చూసి జగన్ మోహన్ రెడ్డి ఆనందించినప్పుడు కూడా పద్మనాభం లేఖ రాసి ఉంటే మరింత బాగుండేది. పవన్ కళ్యాణ్ ను కాపు నేతల చేత తిట్టించినప్పుడు లేఖ రాయని ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు లేఖ రాయడం సమంజసమేనా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.