Suryaa.co.in

Andhra Pradesh

బాబులో భగత్ సింగ్ ను చూస్తున్నావా..?

– పవన్ కల్యాణ్ కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సూటి ప్రశ్న

తుస్సుమన్న పవన్‌ భీమవరం సభ
పవన్‌కళ్యాణ్‌ ఎట్టకేలకు మూడ్రోజుల తర్వాత భీమవరంలో బహిరంగసభ పెట్టాడు. రెండ్రోజులు జ్వరమంటూ కళ్యాణమండపంలో విశ్రాంతి పేరుతో తన సినిమా డబ్బింగ్‌ పనులన్నీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతమందిని పిలిపించుకుని చిన్న మీటింగ్‌లు పెట్టుకున్నాడు. తాను జూన్‌ 30న సుదీర్ఘంగా ప్రసంగిస్తానని, ఏవేవో మొత్తం విప్పేస్తానంటూ ఆ మీటింగ్‌ల్లో చెప్పుకున్నాడు. దీంతో అందరూ పవన్‌కళ్యాణ్‌ ఏం విప్పేస్తాడో.. ఏం మాట్లాడుతాడోనని ఊరించి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ని మరిపించాడు. అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. తీరాచూస్తే నిన్న బహిరంగ సభలో ఆయన తుస్సుమనిపించాడు. కాస్తాకూస్తో సభకొచ్చిన పిల్లసైన్యం కూడా నీరుగారి వెనక్కుదిరిగి పోయారు.

జనసేన అంటే.. జనాన్ని మోసగించే పార్టీ
వైఎస్‌ఆర్‌సీపీపైనా, ముఖ్యమంత్రిపైనా ఎన్నెన్నో అబద్ధాలు అల్లి చెప్పాడు. యువకులు, శ్రామికులు, రైతులు అంటూ నోటికొచ్చినట్లు డైలాగులు డొర్లించి అర్ధంపర్ధంలేని వ్యాఖ్యలు చేశాడు. దీన్నిబట్టి చూస్తే జనసేన పార్టీ అంటే జనాన్ని మోసగించే పార్టీ అని.. జనాలకు అబద్ధాలు చెప్పే పార్టీ అని అందరికీ అర్ధమైంది. ప్యాకేజీ తీసుకునే పార్టీ అని, జనసైనికుల్ని మోసం చేసే పార్టీగా నిన్న పవన్‌కళ్యాణ్‌ మాటల్ని బట్టి జనసేనను అందరూ అర్ధం చేసుకున్నారు. ఏతావాతా ఆయన ప్రసంగం మొత్తం వింటే.. పవన్‌కళ్యాణ్‌ అనే వ్యక్తి నాయకుడు కాదు.. ఆయనొక ప్యాకేజీ స్టార్‌ మాత్రమేనని రాష్ట్ర ప్రజానీకం తెలుసుకున్నారు.

బాబులో భగత్ సింగ్ ను చూస్తున్నావా..?
ప్రతీసారి వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల్ని, ప్రభుత్వ పెద్దల్ని దుమ్మెత్తిపోయడం.. బూతుల పురాణంతో ఊగిపోతున్న పవన్‌కళ్యాణ్‌ను నేను నేరుగా ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబులో మీరు చూస్తున్న రూపాలేంటి..? రైతుల్ని, మహిళల్ని, యువతను అన్నిరంగాల వారిని దారుణంగా మోసం చేసిన చంద్రబాబు మీకు ఎలా కనిపిస్తున్నారు.

ఒక గాంధీలాగా, ఒక పుచ్చలపల్లి సుందరయ్య, ఒక తరిమెల నాగిరెడ్డిలా కనిపిస్తున్నారా.. పవన్‌కళ్యాణ్‌..? బాబులో ఒక చే గువేరా.. ఒక పొట్టిశ్రీరాములు గారిని చూసుకుంటున్నావా..?. చంద్రబాబును ఒక భగత్‌సింగ్‌ అని చెప్పే దమ్ము పవన్‌కళ్యాణ్‌కు ఉందా..? ఆయనతో కలిసి ఎందుకు ప్రయాణిస్తున్నారు.. అనే విషయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. లేదంటే, కనీసం జనసేన కేడర్‌కైనా మీరు సమాధానం ఇవ్వాలని పవన్‌ను నేను డిమాండ్‌ చేస్తున్నాను. చంద్రబాబు, పవన్ లు తోడు దొంగలు. ఆ ఇద్దర్నీ జనం నమ్మరు.

99.5 శాతం అమలైన మేనిఫెస్టో హామీలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్‌లా పవిత్రంగా భావిస్తున్నారు. కనుకనే దాన్ని చిత్తశుద్ధిగా అమలు చేస్తూ ఇప్పటికే 99.5 శాతం హామీల్ని నెరవేర్చిన ప్రభుత్వంగా మేం గర్వంగా చెబుతున్నాం. నవరత్నాలకు సంబంధించి ప్రతీ పథకం యువత, శ్రామికులు, రైతులకు మేలు జరిగే విధంగా అమలు జరుగుతున్న వాస్తవాన్ని అందరూ గమనిస్తున్నారు.

ఈరోజు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకే లబ్ధిని జమ చేసే ప్రభుత్వం ఎక్కడైనా ఉందా..? అని అడుగుతున్నాను. వాలంటీర్‌ వ్యవస్థ సమర్ధంగా పనిచేస్తూ.. ప్రతీ నెలా ఒకటో తేదీనే తెల్లవారుజామునే ఇంటింటికీ తిరిగి పింఛన్‌లు ఇస్తుంటే ఈ ప్రతిపక్షాలకు కన్నుకుట్టిపోతుంది. అందుకే, చంద్రబాబు గానీ, పవన్‌కళ్యాణ్‌ గానీ తట్టుకోలేకపోతున్నారు.

పేదలకు మేలు జరిగితే పవన్ కు ఉక్రోశమా..?
పవన్‌కళ్యాణ్‌ ఏం మాట్లాడుతున్నాడో.. అసలు స్పృహలో ఉండి ప్రవర్తిస్తున్నాడో లేడోనని ఆయన పార్టీ నేతలే అయోమయంలో ఉన్నారు. ఏదో ఊగిపోతూ తిడుతూ.. వార్నింగ్‌లు ఇస్తూ బట్టలూడదీసి కొడతానంటాడు.. మక్కెలిరగదీసి తంతానంటాడు. ఎవర్ని కొడతాడు..? ఎవర్ని తంతాడు..? ఎందుకంత ఆవేశం..? ఎవరిపై అంత ఉక్రోశం..?

ఈ రాష్ట్రంలో పేదలకు మేలు జరిగితే పవన్‌కళ్యాణ్‌కు ఉక్రోశం పెరుగుతుందా..? వారికి న్యాయం జరిగితే ఈ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు ఎందుకు అంత కడుపుమంట..? అని ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలు కూడా ప్రతిపక్షాల ఆపసోపాలపై ఇదే అభిప్రాయంతో ఉన్నారు. వృద్ధులకు పింఛన్లు ఠంచనుగా వస్తుంటే తట్టుకోలేరు. మహిళలకు చేయూత, చేదోడు, ఆసరా, అమ్మఒడి వస్తుంటే ఈ బాబు, వపన్‌లకు జీర్ణంకాదు.

పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే కోర్టులకెళ్లి మరీ అడ్డంపడతారు. దీన్నిబట్టి ప్రతిపక్షపాత్రగా వీళ్లు ఏరకమైన రీతిలో వ్యవహరిస్తున్నారని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. ఈ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల పిచ్చిమాటల్ని నమ్మకుండా.. మంచి చేసే ప్రభుత్వానికి మద్ధతుగా నిలవాలనే ఏకాభిప్రాయంతో ఉన్నారు.

అమరావతి భూదందాపై బాబును ప్రశ్నించావా..
పేదలంటే ఈ చంద్రబాబుకు, పవన్‌కళ్యాణ్‌కు ఎందుకంత కోపమో ప్రజలకే వివరణ ఇవ్వాలి. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే చంద్రబాబు తన తాబేదారులతో కోర్టుల్లో కేసులెందుకు వేయించాడు. మరి, ఆనాడు అమరావతి ప్రాంతంలో ఆయన రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లుకు అండగా ఉండి.. రైతుల్ని బెదిరించి భయపెట్టి బలవంతంగా భూములు లాక్కున్నప్పుడు ఇదే పవన్‌కళ్యాణ్‌ ఎందుకు నోరుమెదపలేదు..?

మీరూ మీరూ కూడబలుక్కుని, కుమ్మక్కై ఒక సామాజికవర్గానికి కొమ్ముకాసి రాజధాని అక్కడ్నే వస్తుందని లీకులిచ్చి భూముల దందా నడపలేదా పవన్‌కళ్యాణ్‌..? దీనిపై నువ్వు సమాధానం ఇవ్వాలి అని అడుగుతున్నాను.

మేం పేదలకు ఇళ్లు ఇస్తామంటే నీకు అంత కడుపుమంట రావడంలో ఆంతర్యమేంటి..? నువ్వు ఎవరికోసం పనిచేస్తున్నావు..? అని ప్రశ్నిస్తున్నాను. అమరావతి భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ పేదలు అక్కడ ఉండకూడదని చంద్రబాబు, నువ్వు కలిసి ఎందుకు అడ్డుపడుతున్నారు.
మీరు చేసేది తప్పని.. మీ నడవడిక మంచిది కాదని మిమ్మల్ని ప్రశ్నిస్తే.. పవన్‌కళ్యాణ్‌ ఊగిపోతూ రెచ్చిపోతాడా..? ఆయన మాట్లాడే భాష, విమర్శించే తీరు, వాడుతున్న మాటలు.. రాష్ట్ర ప్రజలు ఛీ కొడుతున్నారు. ఆ పార్టీ నాయకులు కూడా అదే చెబుతున్నారు. అయినా గానీ, పవన్‌కళ్యాన్‌ ప్రసంగం పంథా మాత్రం ఏమాత్రం మారినట్లు లేదు.

వంద జన్మలెత్తినా జగన్‌ని ఇమిటేట్‌ చేయలేవు
గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేయిచూపుతూ మాట్లాడుతారని ఈ పవన్‌కళ్యాణ్‌ ఇమిటేట్‌ చేస్తాడా..? ఆయన్ను ఇమిటేట్‌ చేసే అర్హత వంద జన్మలెత్తినా పవన్‌కళ్యాణ్‌కు రాదు. ఇది అతను రాసిపెట్టుకోవాలి. మా జగన్‌లా ప్రజలకు అండగా ఉండాలంటే.. పేదలకు ఆరాధ్యదైవంగా కనిపించాలంటే.. ఈ రాష్ట్రప్రజలకు మంచి చేయాలంటే ఈ బాబు గానీ.. పవన్‌కళ్యాణ్‌ గానీ ఎన్ని జన్మలెత్తినా అది సాధ్యం కాదని ప్రజలే చెబుతారు. జగన్‌గారిలా ఉండలేకపోతున్నామని .. ఆయన మాదిరిగా ప్రజాదరణ పొందలేకపోతున్నామని మీరు బాధపడితే.. అప్పటికీ మీ పక్కన తోడుగా చంద్రబాబే ఉంటాడు.

బాబు మోసాలపై నీ నోరుపడిపోయిందా..?
చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సంబంధించి రుణమాఫీ ఎగొట్టి మోసం చేసినప్పుడు…. ప్రశ్నిస్తానన్న నీ నోరు ఎందకు పడిపోయింది పవన్‌కళ్యాణ్‌..? మరి,
ఆనాడు మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తానన్నప్పుడు అది సాధ్యంకాని హామీ అంటూ తీగలపై బట్టలారేసుకోవాలంటూ బాబు ఎగతాళి చేయలేదా..? అసలు, వ్యవసాయమే దండగమారిదని ఇదే చంద్రబాబు పలకలేదా..?

రైతు సంక్షేమం పట్ల బాబు తీరు నీకు తెలియదా పవన్‌కళ్యాణ్‌..?అని అడుగుతున్నాను. గతంలో ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన కిలో రూ.2 బియ్యం పథకంను బాబు అధికారంలోకి రాగానే రూ.5.60పైసలు చేశాడు. ఎన్టీఆర్‌ గారు సంపూర్ణ మద్యపాననిషేధం అమలు చేస్తే.. చంద్రబాబు వచ్చి దాన్ని ఎత్తేసి మద్యాన్ని రాష్ట్రంలో ఏరులా పారించాడు. అలాంటి వ్యక్తికి మీరు ఎందుకు, ఎలా మద్దతు ఇస్తున్నారు… అని ప్రశ్నిస్తున్నాను.

మాది ప్రజా ప్రభుత్వం
ఈరోజు రైతులు గిట్టుబాటు ధరల విషయంలోనూ.. ధాన్యం కొనుగోళ్లల్లోనూ ఆనందంగానే ఉన్నారు. ప్రకృతివైపరీత్యాలు సంభవించినప్పుడు ఏ సీజన్‌కు ఆ సీజన్‌ ముగిసేలోపే పంట నష్టపరిహారం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మాది. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ప్రతీదాన్ని అందుబాటులోకి తెచ్చాం.

మరోవైపు మద్యనిషేధంపై నిన్న పవన్‌కళ్యాణ్‌ మాట్లాడాడు. మద్యం వినియోగంలో చంద్రబాబు హయాన్ని, జగన్‌గారి పాలనను పోల్చి చూసుకోవాలి. మా నాయకుడు జగన్‌ అధికారంలోకి రాగానే మద్యం దుకాణాల్ని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో నుంచి ప్రభుత్వానికి అప్పగించారు. బెల్టుదుకాణాల్ని రద్దు చేశారు. మద్య నియంత్రణ వైపు మళ్ళించే చర్యల్లో భాగంగా… మద్యం ధరలు కూడా పెంచి వినియోగాన్ని తగ్గిస్తున్నారు. ఈ విషయాలన్నీ పవన్‌కళ్యాణ్‌కు తెలియకపోవడం అతని అజ్ఞానానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

భీమవరం డంపింగ్‌యార్డు కోసం కృషిచేశాం
భీమవరంలో పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ.. నామీద ఏవేవో అవాకులు చెవాకులు పేలాడు. సరే, భీమవరం నియోజకవర్గానికి మేం ఏం మేలు చేస్తున్నామనేది ఇక్కడ ప్రజలు నీకు చెబుతారు. మరి, 2019కు ముందు అధికారంలో ఉన్న టీడీపీని ఏనాడూ ఎందుకు ప్రశ్నించలేదు పవన్‌కళ్యాణ్‌..?

నేను భీమవరంలో డంపింగ్‌యార్డు కోసం కృషిచేశానని దమ్ముగా ధైర్యంగా చెబుతున్నాను. దాదాపు 27.5 ఎకరాల్ని సేకరించాం. దానిపై కోర్టులకెళ్లారు. అది పెండింగ్‌లో పడింది. అలాగే మరో 6.5 ఎకరాల భూమిని కంపోస్టు యార్డుకు తీసుకున్నాం. దీనికి సంబంధించి కేంద్ర అనుమతులు కూడా తీసుకున్నాం. ఇదంతా రహస్యంగా ఎందుకు చేసుకుంటూ పోతున్నామంటే.. మేలుజరిగితే ఓర్చుకోలేని మీలాంటి వారి కడుపుమంట కోర్టులదాకా వెళ్తుందని మా పని మేం చేస్తున్నాం.

ప్రభుత్వపరంగా మేం చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి కోర్టు ఫైళ్లు మీ జనసేన అధ్యక్షుడి టేబుల్‌పై ఉన్నాయని చెబుతున్నారంటే.. మీరు అడ్డుకుంటారనే విషయం స్పష్టమౌతుంది కదా..? అందుకే, మేం ఇప్పటివరకు కంపోస్టు యార్డు విషయం అధికారికంగా ప్రకటించలేదు.

అదేవిధంగా భీమవరం బ్రిడ్జిలకు సంబంధించి రూ.12.5 కోట్లు శాంక్షన్‌ చేయించాం. పనులు వీలైంత త్వరలో మొదలవుతాయి. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు మేలు చేసే విషయం, వారికి పనిచేసే విషయంలో మాకు ఈరోజు మీరొచ్చి నీతులు చెబితే నేర్చుకునే పరిస్థితుల్లో లేము. ఎమ్మెల్యేగా నా గురించి, నా మంచితనం, నా సేవ గురించి ప్రజలకు తెలుసు.. ఎల్లప్పుడూ ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండే విషయంలో నేను ఎక్కడా తగ్గేప్రసక్తే లేదని మరోమారు స్పష్టంచేస్తున్నాను.

LEAVE A RESPONSE