– సర్కారుపై సమరం చేయాలా? వద్దా?
– బీఆర్ఎస్ను విమర్శించాలా? వద్దా?
– కేసీఆర్‌ను విమర్శించే అంశంపై వైఖరేమిటి?
– బీజేపీపై పార్టీ వైఖరేమిటి?
– బీజేపీతో పొత్తు ఉంటుందా? లేదా?
– లేపోతే ఒంటరి పోటీనా?
– అధ్యక్షుడు కాసానిపై అధికార ప్రతినిధుల ప్రశ్నల వర్షం
– చంద్రబాబుతో మాట్లాడి ఖరారు చేస్తానన్న కాసాని
– మీడియా ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అధికార ప్రతినిధులు
– సోమవారం నుంచి చానెళ్లకు వెళతానన్న కాసాని
– అధికార ప్రతినిధులు సీరియస్‌గా పనిచేయాలని ఆదేశం
– అధికార ప్రతినిధిని రావద్దని అధ్యక్షుడి ఆదేశం
– మీ పేరు లేదని అధికార ప్రతినిధికి సమాధానం
– దానితో కాసాని చాంబరు బయటే డాక్టర్ ఏఎస్రావు
– మీడియా కమిటీ చైర్మన్‌కు అందని ఆహ్వానం
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ తెలుగుదేశం పార్టీ దారెటు? అధికార బీఆర్ఎస్ను విమర్శించాలా? వద్దా? సీఎం కేసీఆర్‌ను విమర్శించే అంశంలో పార్టీ వైఖరేమిటి? వద్దా? అసలు బీజేపీపై పార్టీ వైఖరి ఏమిటి? ఆ పార్టీతో పొత్తు ఉంటుందా? ఉండదా? లేకపోతే ఒంటరి పోటీయేనా? ఒంటరిగా చేస్తే అన్ని స్థానాలకూ పొటీ చేస్తామా? లేదా?.. ఇవీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు, ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌పై సంధించిన ప్రశ్నలు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కొత్త నాయకత్వం వచ్చి ఆరునెలలు అవుతున్నా, ఇప్పటివరకూ వివిధ పార్టీలపై వైఖరి ఏమిటన్న దానిపై, స్పష్టత లేకపోవడం అయోమయానికి దారితీస్తోంది. ఇప్పటిదాకా అధ్యక్షుడు కాసాని కూడా బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్‌ను విమర్శించిన దాఖలాలు లేవు. ఇంకా అధికార ప్రతినిధులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పటం విశేషం. టీవీ చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు, వెబ్‌సైట్స్‌లో ఒకరిద్దరు అధికార ప్రతినిధులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు.
తాజాగా పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పార్టీ అధికార ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో పాల్గొన్న అధికార ప్రతినిధులు, తమ సందేహాలు వ్యక్తం చేశారు. టీడీపీ- బీజేపీ పొత్తు ఉంటుందా? ఉండదా? ఉంటే పార్టీ ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తుంది? ఒకవేళ పొత్తు లేకపోతే సొంతంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది? అని సందేహం వ్యక్తం చేశారు.
అధికార బీఆర్ఎస్పై పార్టీ వైఖరి ఏమిటి? ప్రభుత్వాన్ని విమర్శించాలా? వద్దా? సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేయాలా? వద్దా? వివిధ సమస్యలపై ఏవిధంగా స్పందించాలని అడిగారు. మీడియా తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, అధికార ప్రతినిధులు కాసాని దృష్టికి తీసుకువెళ్లారు. ఆ అంశంపై దృష్టి సారించాలన్నారు.
దానికి స్పందించిన కాసాని.. సోమవారం నుంచి తాను అన్ని చానెళ్ల కార్యాలయానికి వెళతానని హామీ ఇచ్చారు. సోమవారం తాను అధినేత చంద్రబాబునాయుడును కలసి, బీఆర్ఎస్-బీజేపీలపై పార్టీ వైఖరి ఏమిటన్న అంశంపై సూచనలు తీసుకుంటానని వెల్లడించారు. ఇకపై అధికార ప్రతినిధులు ఇంకా చురుకుగా పనిచేయాలని, ఎప్పటికప్పుడు స్పందించాలని, పార్టీ నాలెడ్జ్ కమిటీ కూడా అధికార ప్రతినిధులకు తగిన మెటీరియల్ ఇవ్వాలని ఆదేశించారు.
ఇదిలాఉండగా, అధికార ప్రతినిధుల సమీక్షా సమావేశానికి.. తెలంగాణ టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ప్రకాష్‌రెడ్డిని, ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమయింది. స్వయంగా పార్టీ అధినేత నియమించిన ప్రకాష్‌రెడ్డిని పక్కనపెట్టి, ప్రైవేటు పీఆర్వోతో మీడియా వ్యవహారాలు కొనసాగిస్తుండటంపై ఫిర్యాదులు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
కాగా పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావును సమావేశానికి వెళ్లకుండా, సిబ్బంది అడ్డుకున్నారు. సమావేశంలో మీ పేరు లేదని చెప్పడంతో, ఆయన పక్క గదిలోకి వెళ్లి కూర్చున్నారు. ఇటీవల మీడియాలో వచ్చిన కొన్ని కథనాలకు ఆయనే కారకుడన్న అనుమానంతోనే, తెలంగాణ నాూ బ్రాహ్మణ్య రాష్ట్ర అధ్యక్షుడైన డాక్టర్ ఏఎస్‌రావును సమావేశాలకు దూరంగా ఉంచుతున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: తెలంగాణ టీడీపీ ఆఫీసులో బీఆర్ఎస్ భక్తులు
పార్టీ కార్యాలయంలో కాసాని ప్రైవేటు పీఆర్వో పెత్తనం పెరుగుతోంది. అధికార ప్రతినిధులు కేసీఆర్‌ను విమర్శించవద్దని, పార్టీ ఆఫీసులో కాకుండా ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టుకోమన్నారన్న వార్తలు మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే.
దీనికి కొందరు నేతలే కారణమని అనుమానించిన అధ్యక్షుడు కాసాని.. తన ప్రైవేటు పీఆర్వో సమక్షంలోనే వారిని పిలిపించి ప్రశ్నించడాన్ని నేతలు అవమానంగా భావించారు. తాజాగా అదే అనుమానంతో అధికార ప్రతినిధి డాక్టర్ రావును వెనక్కిపంపించినట్లు కనిపిస్తోంది.