తరుచుగా మాటా మాటా విసురుకుని దెబ్బలాడుకునే వారెవరంటే.. అరవై దాటిన భర్త భార్య లే అని చెప్పాలి. ఈ వయసు వచ్చాక.. ఒకరిమాట ఒకరికి పొసగదు, ఆలోచనా విధానంలో తేడాలు, ఎదిగిన పిల్లలు భార్యకు బలం, కుటుంబం ఉన్నా తాను ఏకాకి అని భర్త ఫీలింగ్ వంటి అంశాలు ముడిపడి ఉంటాయి.
సాధారణంగా రిటైర్మెంట్ అయ్యాక .. ఇదివరలో ఉన్న భర్తకి భార్య ఇచ్చే విలువ గౌరవం తగ్గుతాయి. కారణం ఎక్కువగా ఇంట్లోనే ఉండటం, అర్జెన్సీ లేకపోవడం.. శక్తి తగ్గడం శారీరక రుగ్మతలు కూడా కారణాలే. కారణం ఇద్దరికీ వయసులో సాధారణంగా ఆరేడేళ్ళ తేడా ఉంటుంది. ఇప్పుడు తరచూ గొడవలకి కారణాలు ఏమిటో చూద్దాం.
భార్య దృష్టిలో.. భర్తకి వయసు మీదపడుతుండటం, ముసలితనం, మతిమరుపు, చాదస్తం, మంకుపట్టు, ఆదాయం లేకపోవడం (పెన్షన్ లేకపోతే), వేళకి తెమలలేకపోవడం, సపర్యలు సేవలు అధికం కావడం, అనారోగ్య సమస్యలు మొదలైనవి.
ఇక భర్త దృష్టిలో.. భార్య ఇదివరకులా తనను పట్టించుకోవడం లేదనే ఫీలింగ్, ప్రతీదానికి విసుక్కుంటుందని అనుకోవడం, తను పిల్లలు ఒకటైపోయి తాను ఏకాకి అనే భావన, కుటుంబం ఉన్నా తనది ఒంటరి జీవితమే అనే బాధ, ముఖ్యంగా కుటుంబ సభ్యులు తనతో సరిగా మాట్లాడరని.. కొన్ని విషయాలు తనకి తెలియనివ్వడం లేదనే .. ఒకరకమైన భావన, ఈ వయసులో తన పనులు కొన్ని తనమటుకు తాను చేసుకోలేక పోతున్నానే బాధ, 70-80 దాటిపోతున్నాయనే భయం, ప్లస్ అనారోగ్య సమస్యలు, వృద్ధాప్యం లక్షణాలు మొదలైనవి.
ముసలి వయసులో భార్యాభర్తలు కీచులాడుకోవటం మామూలే పై కారణాల వలన. ఇద్దరికీ ఓపిక తగ్గిపోవడంతో అసహనం ఇర్రిటేషన్ పెరుగుతాయి.. బీపీ ఉండనే ఉంది. ఈ వయసు మీరిన భర్త భార్య ల భాగోతానికి చెక్ పెట్టాలంటే ఒక్కటే చిట్కా. సాధ్యమైనంత వరకు.. ఇద్దరూ ముఖ్యంగా భర్తలు నోరు తెరవకుండా ఉండాలి.. మాటలు వాదనలకి ఇర్రిటేషన్ లకి దారి తీయకూడదు.
భార్యాభర్తలు తమపని తాము చేసుకుపోతూ మంచిగా ఉంటూ మనవరాలు మనవడితో కాలక్షేపం చేయడం ఉత్తమం. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరే ఉంటే.. వారి అభిరుచులే వ్యాపకాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలి. ఆ వయసుతో వారి స్నేహాలు కూడా అవసరమే. ఎవరికొనా మేలుచేసేది.. మంచితనం, పాజిటివ్ దృక్పథం.. ఈ కాఫీ కబుర్లు లో.. అరవై దాటిన మనందరం ఉన్నాం కదా.. రేపు మరో అంశంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి.
-గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)