-ఈసారి మనం గెలుపుపై కాదు…మెజారిటీపైనే దృష్టిపెట్టాలి
-జగన్ పని అయిపోయింది…రాబోయే 9నెలలే కీలకం!
-నిత్యం ప్రజల్లో ఉండి అరాచకపాలనపై చైతన్యం తీసుకురండి
-పర్చూరు నియోజకవర్గ సమావేశంలో యువనేత లోకేష్
గుండ్లాపల్లి: ఎండా,వానను తట్టుకుని 2200 కి.మీ. పాదయాత్ర పూర్తిచేశాను, 5కోట్లమంది ప్రజల ఆశీస్సులు, టిడిపి కుటుంబసభ్యుల ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తోందని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. గుండ్లాపల్లి క్యాంప్ సైట్ లో పర్చూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో యువనేత సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… టీడీపీ కార్యకర్తలకు ఇబ్బంది వస్తే నేరుగా పార్టీనే స్పందిస్తోంది. ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు సంక్షేమ నిధితో పాటు బీమా కల్పించాం. జిల్లాలో పెద్దాయన అని చెప్పుకుని తిరిగిన వ్యక్తి పార్టీ మారారు… కానీ కార్యకర్తలు మారలేదు. నాయకులు వస్తూ పోతుంటారు, కార్యకర్తలే శాశ్వతం. గత నాలుగేళ్లలో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు…అక్రమ కేసులు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రం సరైన దారిలో లేదు. రాబోయే తరాలు బాగుండాలంటే చంద్రబాబు సీఎం అవ్వాలి. మొదట టీడీపీ శ్రేణులపై దాడులు చేశారు, తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు చేశారు, ఇప్పుడు ఏకంగా పోలీసులపై కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. అందరం కలసి పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. పని చేసేవాళ్లను ప్రోత్సహిస్తా. మన బూత్..మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా అందరూ ప్రతి బూత్ వారీగా పార్టీకి మెజార్టీ తీసుకురండి, మీ భవిష్యత్ నేను చూసుకుంటా.
పర్చూరులో మళ్లీ పసుపుజెండా ఎగరాలి!
పర్చూరులో మళ్లీ టీడీపీ జెండా ఎగరాలి..ఏలూరి సాంబశివరావును భారీ మెజార్టీతో గెలిపించాలి. ప్రభుత్వ ఎదురుదాడులను పర్చూరు ప్రజలు ఎదుర్కొన్నారు. పర్చూరు ప్రజలు చాలా తెలివైన వాళ్లు. ఈసారి మనం గెలుపుపై కాదు..మెజారిటీపై దృష్టి సారించాలి. క్లస్టర్, బూత్, యూనిట్, మండల అధ్యక్షులు కలసి పని చేయాలి. వారానికి 5 రోజులు… రోజుకు 2 గంటలు కష్టపడంది. విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్, గ్యాస్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందడం లేదు.
ప్రతిగడప తలుపుతట్టండి!
మనం మహాశక్తి కార్యక్రమం తీసుకొచ్చాం… అధికారంలోకి వచ్చిన యేడాదిలో అమలు చేస్తాం. ప్రతి ఇంటి తలుపు తట్టండి..చివరి ఓటు పడే వరకూ కాపలా కాయాలి. నేను పాదయాత్ర ప్రారంభించినప్పుడు
అడ్డుకుంటామని అన్నారు… కానీ కార్యకర్తలు వైసీపీ వాళ్లకు బుద్ధి చెప్పారు. పలానా వ్యక్తి ఓటే వేయరు అని అనుకోవద్దు..ఒకటికి పదిసార్లు తిరగండి. మంగళగిరిలో ఓడిపోయానని నేను వదిలి వెళ్లలేదు.
ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నాను. మిమ్మల్ని అక్రమంగా ఇబ్బంది పెట్టిన వారిని నేను వదిలిపెట్టను. మీకు ఏలూరి సాంబశివరావు అండగా ఉంటాడు. ఈ 9 నెలల సమయం చాలా కీలకం. జగన్ పనైపోయిందన్న భావనలో వైసీపీ కార్యకర్తలున్నారు. జగన్ తీరు నచ్చక టీడీపీకి ఓటేయడానికి వైసీపీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉండి జగన్ అరాచకపాలనపై చైతన్యం తీసుకురండి.