Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ని గద్దెదించడం లక్ష్యంగా గ్రామ సర్పంచ్ లు పోరు సాగించాలి

-బీజేపీ అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్

నిధులు దారి మళ్లించి గ్రామ సౌభాగ్యానికి తూట్లు పొడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని గద్ది దించడమే లక్ష్యంగా గ్రామీణ ప్రాంత సర్పంచులు పనిచేయాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ డి విల్సన్ పిలుపు ఇచ్చారు.సర్పంచ్ నిధులు దారి మళ్లించడంపై గురువారం నెల్లూరు కలెక్టరేట్ ఎదురుగా జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా విల్సన్ మాట్లాడుతూ 14,15 వ ఆర్థిక సంఘం నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాలపై నిధులు పంపిణీ చేస్తే వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర పథకాలకు మళ్ళిస్తున్నారని దానివల్ల గ్రామీణ అభివృద్ధి పూర్తిగా పడకేసిందని విల్సన్ దుయ్యబట్టారు. గ్రామ సర్పంచులు ఏ ఒక్క పని చేయలేక కళ్ళ నిండా నీళ్లు నింపుకొని బతుకుతున్నారని విల్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో రోడ్లు, మంచినీళ్లు, పారిశుధ్యం.. వంటి పనులకు.. నిధులు లేక సర్పంచులు అల్లాడిపోతున్నారు అన్నారు.

కొందరు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తుంటే.. మరికొందరి మానసిక స్థితి చాలా దారుణంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సర్పంచులకు నిధులు యుద్ధ ప్రాతిపదిక పైన విడుదల చేయకపోతే రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆదేశాల మేరకు వీధి పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ప్రతి బిజెపి కార్యకర్త ప్రాణాలకు తెగించి పనిచేయడానికి సిద్ధంగా ఉందన్నారు.

రాబోయే రోజుల్లో బిజెపి మహోగ్రరూపం జగన్ కి తెలుస్తుంది అన్నారు. 151 యొక్క ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి పరిపాలించమంటే.. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. ఈరోజు ప్రతి కుటుంబం పై 7 లక్షల అప్పు పడిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి చేతకాని పాలనే అన్నారు. రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి దించి జగన్ మాత్రం కోట్లకు పడగలెత్తారని విల్సన్ విమర్శించారు. ఇసుక మద్యం మైనింగ్ పేరుతో లక్షల కోట్లు ప్రజాధనం జగన్మోహన్ రెడ్డి లూటీ చేశారని విమర్శించారు.

రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయకపోవడం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగులు హైదరాబాద్ బెంగళూరు చెన్నై ప్రాంతాలకు వలస వెళుతున్నారన్నారు. నిరుద్యోగ భూతం యువతను పట్టి పల్లారుస్తుందని.. తమ బతుకులు బాగు చేసుకోవడానికి ఏం చేయాలో అర్థం కాక యువత మానసిక వ్యధకు లోనవుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టలేమని పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు అన్నారు. రాష్ట్రంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల వాళ్లు తీవ్రమైన మానసిక వ్యధ కు లోనవుతున్నారన్నారు.

ధర్నాకి నాయకత్వం వహించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షురాలు ఆదేశం మేరకు సర్పంచ్ హక్కులు కోసం ధర్నా చేపట్టామని భవిష్యత్తులో ఎలాంటి త్యాగాలు చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నామన్నారు. సహజ వనరులు దోపిడీ జరగడం వల్ల రాష్ట్రం 50 ఏళ్ళు వెనక్కి వెళ్లిపోయింది అన్నారు. బిజెపి మరో అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ జగన్ పాలన రాష్ట్రాన్ని తిరోగమన పదం లోకి తీసుకెళ్తుంది అన్నారు.

ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం పరిపాలన విషయంలో జగన్ చేతకానితనాన్ని నిదర్సనం మన్నారు. ధర్నాకు మద్దతిచ్చిన నాయకుడు మణిక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి జనసేన భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు తీసుకొని ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివ నారాయణ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మోసకారి ప్రభుత్వం అని ఢిల్లీ నుంచి వ చ్చిన ప్రతి పథకాన్ని తమ ఖాతాలో వేసుకుని రాష్ట్ర ప్రజలని జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారన్నారు.

మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుండి.. పక్కా ఇళ్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులేనన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేంద్రం ఎంత సహకరిస్తున్నా.. జగన్ చేతకాని పాలన వల్ల రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతుందన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో వేలాదిమంది బిజెపి జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

ధర్నాలో పలు గ్రామ సర్పంచులు పాల్గొని తమ ఆవేదన వ్యక్తం చేశారు. తాము అలంకారప్రాయంగా సర్పంచులు గా ఉన్నం తప్ప ప్రజల కోసం ఒక్క పని కూడా చేయలేకపోతున్నాం అన్నారు. రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తామన్నారు. ధర్నా తదనంతరం విజ్ఞాపన పత్రాన్ని జిల్లా అధికారులకు, బిజెపి జనసేన నాయకులు సంయుక్తంగా అందజేశారు.

LEAVE A RESPONSE