-ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో ఆంధ్ర రాష్ట్రం ముందంజ
భారతదేశంలో ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ ప్రగతి సాధించాయని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, మేధావులు చెబుతుంటారు. వింధ్య పర్వతాలకు దిగువున ఉన్న రాష్ట్రాల్లో సర్వతోముఖ అభివృద్ధికి ప్రధాన కారణాల్లో ఒకటి బ్రిటిష్ వారి పాలన నుంచి మంచి పనిముట్టుగా అందివచ్చిన ఇంగ్లిష్ భాష అనేది అందరూ అంగీకరించే విషయం.
ఈ అంశాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం పాఠశాలల సంఖ్య పెంచడానికి నాలుగేళ్ల క్రితమే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన విద్యార్థులు అన్ని విధాలా ఎదగడానికి దోహదం చేస్తుంది. 20వ శతాబ్దంలో బ్రిటిష్ వారి పాలనలోనే దక్షిణాది రాష్ట్రాలు విద్యారంగంలో, పారిశ్రామిక రంగంలో శరవేగంతో అభివృద్ధి సాధించాయి.
ఈ వంద సంవత్సరాల్లో దక్షిణాది ప్రాంతం ఇండియాలోనేగాక, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధికి చిహ్నంగా రూపుదిద్దుకుంది. ఇంగ్లిష్ భాష వలస పాలకుల నుంచి వారసత్వంగా వచ్చిన ‘సంపద’ అని కొందరు విమర్శిస్తారు. అయితే, అనేక రంగాల్లో జ్ఞానవాహికగా ఆంగ్లం మానవాళికి ఉపయోపడుతోంది. స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లేని కోట్లాది మంది ప్రజలు ఇంగ్లిష్ విద్య ద్వారా విముక్తిపొందారు.
కిందటి శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఆంగ్ల విద్యాబోధనకు ఉన్న ప్రాధాన్యం ఉత్తరాది రాష్ట్రాల్లో ఇవ్వకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది. ఈ విషయం గుర్తించిన పాలకులు ఇప్పుడు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు, ఇంగ్లిష్ భాషా నైపుణ్యం పెంచడానికి కృషి చేస్తున్నారు.
విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఇంగ్లిష్ విద్య
ప్రపంచీకరణ వేగం పుంజుకున్న నేపథ్యంలో విశ్వవ్యాప్తంగా ఇంగ్లిష్ విద్యా బోధనకు ప్రాముఖ్యం పెరిగింది. ఇంగ్లిష్ మీడియం చదువులకు దక్షిణాది రాష్ట్రాల్లో రోజురోజుకూ ప్రాధాన్యం పెరుగుతుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా ఆంగ్ల విద్య అవసరం తెలుసుకున్నారు. ఇంగ్లిష్ భాషా నైపుణ్యం ఎక్కువ ఉన్న కారణంగానే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యువత అతిపెద్ద సంఖ్యలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారు.
ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ తదితర ఐరోపా దేశాలకు ఉన్నత విద్య, ఉపాధి కోసం వెళుతున్నారు. ఏ రకంగా చూసినా ఇంగ్లిష్ మీడియం చదువుల వల్ల మంచి ఉద్యోగాలు సంపాదించడానికి, ఆధునిక ప్రపంచంలోని అత్యంత అధునాతన రంగాల్లో కొత్త నైపుణ్యాలు ఆర్జించడానికి వీలవుతోంది. జాతీయ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్.ఎస్.ఎస్.ఓ) విద్యా సర్వే–2018 ప్రకారం–దక్షిణాది రాష్ట్రాల్లో 12వ తరగతి వరకూ ఆంగ్ల మధ్యమంలో విద్యాబోధన కొనసాగే ఉన్నత పాఠశాలల శాతం చాలా ఎక్కువని తేలింది.
ఇలాంటి ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల శాతం తెలంగాణలో (హైదరాబాద్ సహా) 63 శాతం, కేరళలో 60.7 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 59 శాతం, తమిళనాడులో 44 శాతం, కర్ణాటకలో 35 శాతం అని ఎన్.ఎస్.ఎస్.ఓ సర్వే వెల్లడించింది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో బిహార్ లో 6%, ఉత్తరప్రదేశ్ లో 14% స్కూళ్లలోనే 12వ క్లాస్ వరకూ ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన సాగుతోంది. పశ్చిమ ప్రాంతంలోని మహారాష్ట్రలో 29 శాతం, గుజరాత్ లో 12.8 శాతం పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన కొనసాగుతుండడంతో ఈ రెండు పారిశ్రామిక రాష్ట్రాలూ దక్షిణాది రాష్ట్రాల మార్గంలో పయనిస్తున్నట్టు కనిపిస్తోంది.
ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు నేర్చుకోవడం వల్ల విద్యార్థుల పరిజ్ఞానం, నైపుణ్యాలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిచెందిన దేశాల్లో ఉపాధి అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తున్నాయి. మన దేశం నుంచి విశాల ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఇంగ్లిష్ నైపుణ్యం పెద్ద కిటికీ మాదిరిగా ఉపయోగపడుతోంది.
2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు ఎన్నడూ లేనంత ప్రాధాన్యం ఇస్తున్నారు.

( రాజ్యసభసభ్యులు)