తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు
ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల పట్ల హర్షం
బీవి రావు నగర్ పౌల్ట్రీ వద్ద పాతూరి వెంకట్రావు ఆద్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర.. భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అన్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు వంద రూపాయల నాణాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపాలిటీ పరిధిలోని బి.వి.రావ్ నగర్ పౌల్ట్రీ వద్ద పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు పాతూరి వెంకట్రావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు మీడియాతో మాట్లాడుతూ ఒక తెలుగువాడిగా గొప్ప ఖ్యాతిని అందుకోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా వంద రూపాయల నాణాన్ని ఆయన పేరిట విడుదల చేసి జాతి యావత్తు గర్వపడేలా చేశారని కొనియాడారు. తెలంగాణ రాయలసీమ ఆంధ్ర మూడు ప్రాంతాల ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఏకైక వ్యక్తిగా స్వర్గీయ ఎన్టీఆర్ కు పేరు ఉందని అన్నారు.
తెలుగుజాతి గర్వపడేలా ఆయన అందుకున్న శిఖరాలను భావితరాలు ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటారని అన్నారు. జాతి యావత్తు గర్వపడేలా వంద రూపాయల నాణాన్ని రాష్ట్రపతి మురుము చేతుల మీదుగా విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు. తెలుగుజాతి వున్నంత వరకు ఎన్టీఆర్ చిరస్మరణీయుడిగా వుంటారని చెప్పారు.
దేశంలో సంక్షేమ పథకాల అమలుకు ఆద్యులు ఎన్టీఆర్ అని అన్నారు. 1985లో ఆయన తిరుపతిలో నిత్య అన్నదానం సత్రాన్ని ప్రారంభించడం విశేషం అన్నారు. వికలాంగుల కోసం బర్డ్ సంస్థలు ఏర్పాటు చేయడం అదేవిధంగా జాతీయస్థాయిలో ఎన్టీఆర్ పేరిట సేవా ట్రస్టులు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. 1994లో నందమూరి తారకరామారావు తన భుజంపై చేయి వేసి షాద్ నగర్ వద్ద చేసిన ప్రసంగాన్ని నేటికీ మర్చిపోలేనని ఆయన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు.
బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకురావడంతోపాటు దేశ రాజకీయాల్లో సైతం కీలకపాత్ర వహించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పటేల్ పట్వారి వ్యవస్థను రూపుమాపి తెలంగాణలో ప్రజల జీవనానికి స్వేచ్ఛ కల్పించిన మహానుభావుడని అన్నారు. వృద్ధాప్య పింఛన్, పేదలకు పక్కాగృహాలు తదితర సంక్షేమ పథకాలను దేశంలోనే తొలిసారి ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు.
తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీరామారావు.. సమాజానికి గొప్ప రాజకీయ నాయకులను అందించారని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సామాజిక భావనతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు పాతూరి వెంకట్రావు మాట్లాడుతూ..
నిజాయితీ, పట్టుదల, ఆత్మగౌరవాలకు ప్రతీక ఎన్టీఆర్ అని, నేటి తరం ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సంక్షేమానికి శాశ్వత చిరునామా ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన గొప్ప సంస్కరణ వాది అని, ప్రజల వద్దకే పాలన, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు, మహిళలకు ఆస్తిలో సమానహక్కు వంటి వాటిని తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కమ్మ సంఘం నాయకులు పినపాక ప్రభాకర్ రావు, శ్రీను, రమేష్ సత్యనారాయణ, నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణ, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.