షాట్ గన్స్, రాకెట్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్ గ్రెనేడ్లు
బాంబులు, తూటాలు కూడా ఏంచేయలేవు
డోర్ 120 వోల్టుల ఎలక్ట్రిక్ షాక్ ను ఉత్పత్తి చేస్తుంది
కాడిలాక్ బీస్ట్ కారు ఖరీదు రూ.12.46 కోట్లు.
ఢిల్లీ రోడ్లపై అందరి దృష్టిని ఆకర్షిస్తున్న జో బైడెన్ ‘బీస్ట్’
భారత్ లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బైడెన్ తో పాటు ఆయన వాహనం ‘బీస్ట్’ కూడా ఢిల్లీ చేరుకుంది. ఢిల్లీ రోడ్లపై పరుగులు తీస్తున్న ‘బీస్ట్’ వాహనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
బీస్ట్ కు అనేక పేర్లు ఉన్నాయి. ‘ఎయిర్ ఫోర్స్ వన్’ తరహాలో ఈ కారును ‘కాడిలాక్ వన్’ అని, ‘ఫస్ట్ కార్’ అని కూడా పిలుస్తారు. దీని సంకేత నామం ‘స్టేజ్ కోచ్’. అమెరికా అధ్యక్షుడికి ఇది అధికారిక వాహనం. దీన్ని బాంబులు, తూటాలు కూడా ఏంచేయలేవు.
బీస్ట్ కారును ప్రపంచ ప్రఖ్యాత జనరల్ మోటార్స్ (జీఎం) కంపెనీ తయారుచేస్తోంది. అమెరికా అధ్యక్షుడి కోసం ఎప్పటికప్పుడు బీస్ట్ లేటెస్ట్ మోడల్ ను అందిస్తుంటారు. తొలిసారిగా దీన్ని 2001లో ప్రవేశపెట్టారు. 2018 నుంచి లేటెస్ట్ వెర్షన్ ఉపయోగిస్తున్నారు. దీని బరువు గరిష్ఠంగా 9,100 కిలోల వరకు ఉంటుంది.
దీని పొడవు 18 అడుగులు. ఇందులో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అమెరికా అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ కు సరిపడే రక్తం ఇందులో అందుబాటులో ఉంచుతారు.రసాయనిక దాడులు కూడా తట్టుకునేలా బీస్ట్ కు ప్రత్యేక పదార్థంతో కోటింగ్ వేస్తారు. చదునుగా ఉండే టైర్లు దీని ప్రత్యేకత.
రాత్రివేళ చూడగలిగే పరికరాలు, దాడుల సందర్భంగా ప్రత్యర్థులను ఏమార్చే ధూళి మేఘాలు, ఏవైనా వాహనాలు వెంటాడితే వాటిని అదుపు తప్పేలా చేయడం కోసం చమురును రోడ్డుపై జారవిడవడం బీస్ట్ కు మాత్రమే సాధ్యం.ఈ కారుకు అమర్చిన రక్షణ కవచాన్ని అల్యూమినియం, సెరామిక్, ఉక్కుతో రూపొందించారు. ఈ కారు బయటి వైపు గోడలు 8 అంగుళాల మందంతో ఉంటాయి. కారు అద్దాలు అనేక పొరలతో కలిసి 5 అంగుళాల మందం ఉంటాయి.
ఇక ఈ కారులోని ప్రతి డోర్ బోయింగ్ 757 విమానం డోర్ అంత బరువు ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు ఏదైనా విపత్కర పరిస్థితిలో చిక్కుకుంటే ఈ డోర్ 120 వోల్టుల ఎలక్ట్రిక్ షాక్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన షాట్ గన్స్, రాకెట్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్ గ్రెనేడ్లు ఉంటాయి.
అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ లో ప్రతిసారి రెండు బీస్ట్ లు ఒకే నెంబరుతో కనిపిస్తుంటాయి. దాంతో అమెరికా అధ్యక్షుడు ఏ కారులో ఉన్నది గుర్తించడం కష్టమవుతుంది. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే కాడిలాక్ బీస్ట్ కారు ఖరీదు రూ.12.46 కోట్లు.