అన్ని ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్‌

Spread the love

– ఆయన అరెస్ట్‌లో ఏ రాజకీయం లేదు
– మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ వెల్లడి

తాడేపల్లి: స్కిల్‌ స్కామ్‌లో ఈరోజు చంద్రబాబునాయుడు అరెస్టయ్యాడు. ప్రజాధనం దుర్వినియోగమైన ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు అంతా ఏదొక నాటికి చట్టానికి లోబడాల్సిందే. దర్యాప్తు సంస్థలకు సహకరించి అరెస్టు కావాల్సిందే. అందులో భాగంగానే చంద్రబాబు అరెస్టు జరిగింది తప్ప, ఇందులో ఎక్కడా రాజకీయాలకు ఆస్కారం లేదు. చట్టబద్ధమైన దర్యాప్తు సంస్థలను ఏ నాయకుడో ఒత్తిడి చేసి.. ప్రలోభ పెట్టి నడిపించలేరు. ప్రభావితం చేయలేరు.

స్కిల్‌ స్కామ్‌ దర్యాప్తు ఇప్పటిది కాదు. అలాగే ఈ కేసులో ఇదే మొదటి అరెస్టు కూడా కాదు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈడీ, జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు చేశాయి. ఆ తర్వాత సీఐడీ దర్యాప్తు మరింత లోతుగా జరిగింది. పక్కాగా అన్ని ఆధారాలు దొరికిన తర్వాతే చంద్రబాబు అరెస్టు జరిగింది.

స్కిల్‌ స్కామ్‌ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోంది. అందుకని మాజీ సీఎం చంద్రబాబు సీఐడీ దర్యాప్తుకు సహకరించాలి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు, చట్టబద్ధమైన దర్యాప్తు సంస్థలను ఎలా గౌరవించాలో తెలుసనుకుంటాను. చట్టం ముందు అందరూ సమానమే. దీన్ని చంద్రబాబు గుర్తించాలి. ఇక్కడ యథేచ్ఛగా ప్రజాధనాన్ని లూటీ చేశారు. ప్రజాధనాన్ని కాపాడవలసిన వారే ఆ పని చేస్తే ఎలా?

స్కిల్‌ స్కామ్‌కు సంబం«ధించి బాధ్యుల్ని సీఐడీ అరెస్టు చేస్తే.. దాన్ని ప్రభుత్వ కక్ష సాధింపు అనడంలో సరికాదు. టీడీపీ, జనసేన, సీపీఐతో పాటు, కొందరు బీజేపీ నేతల ఆవేశపూరిత మాటలు అర్ధం లేనివి. రూల్‌ ఆఫ్‌ లా అనేది ఎవరికైనా ఒకటేనని వారు తెలుసుకోవాలి. ఏదైనా కేసులో ఎవరైనా అరెస్టు అయితే న్యాయవ్యవస్థ ద్వారా పోరాటం చేస్తారు. అంతే కానీ అరెస్టులను ఖండించరు. తప్పు పట్టరు. అయితే ఈ స్కిల్‌ స్కామ్‌లో నిందితులకు అండగా నిలవడం రాజకీయాల్లో మంచి ఒరవడి కాదు.

నిబద్ధతతో పని చేస్తున్న మా ప్రభుత్వం, అందుకు బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ కూడా చట్టం తన పని తాను చేసుకుపోతోంది తప్ప, మా ప్రభుత్వం ఎక్కడా, ఎవరిపైనా, ఏ విధమైన ఒత్తిడి చేయడం లేదు. దర్యాప్తు సంస్థను ప్రభావితం చేయడం లేదని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ స్పష్టం చేశారు.

Leave a Reply