జనాభాలో 56 శాతం ఉన్నా.. శాతం మాత్రమే రాజకీయ అవకాశాలు
పార్లమెంటులో బిల్లు పెడితేనే బీసీలకు న్యాయం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
బిసీలకు ప్రత్యేక బిల్లు ధర్నా పోస్టర్ల ఆవిష్కరణ
అమరావతి, సెప్టెంబర్12: చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తేనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో… కార్యక్రమ పోస్టర్లను మంగళవారం మంత్రి విడదల రజిని ఆవిష్కరించారు.
మంగళగిరిలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో పోస్టర్లను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఇప్పటివరకు పరిపాలన అందించిన కేంద్ర ప్రభుత్వాలన్నీ బీసీలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాటా ఇచ్చే దిశగా పరిపాలన సాగించలేకపోయాయని తెలిపారు. మన దేశంలో 56 శాతం జనాభా బీసీలేనని, అయినా సరే వీరికి రాజకీయాల్లో కేవలం 14 శాతం, ఉద్యోగ రంగంలో కేవలం 9 శాతం, పారిశ్రామిక రంగంలో కేవలం ఐదు శాతం మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయని పేర్కొన్నారు.
బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా మరింత ఎదిగేలా కేంద్ర ప్రభుత్వాలు చొరవచూపాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరిపాలనలో ఏపీలో బీసీలు అన్ని విధాలా సాధికారత పొందుతున్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్ మారేష్ మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50% రిజర్వేషన్ కల్పించాలని, బీసీ జనగణ జరిపించాలని కోరారు.
21, 22 తేదీలలో జరగనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి బీసీలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ నాయకులు మహిధర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మణికంఠ, కృష్ణా జిల్లా అధ్యక్షుడు సుధాకర్, బీసీ నాయకులు జగన్నాథం, మురళి తదితరులు పాల్గొన్నారు.