– జగన్ చిత్రపటంపై మద్యం పోసిన నిరసన తెలిపిన టీడీపీ నాయకులు
– పోలీసుల… టీడీపీ నాయకుల మద్య తోపులాట
– రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చారంటూ టీడీపీ నాయకులు ధ్వజం
రాజమహేంద్రవరం :నకిలీ… పిచ్చి బ్రాండ్లతో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని, అందుకే ఆయనకు మద్యాసురుడు బిరుదు ఇచ్చి మద్యాభిషేకం చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని ఏ ఆధారం లేకుండా అన్యాయంగా అరెస్టు చేసి జైలులో ఉంచినందున దానికి నిరసనగా స్థానిక నందం గనిరాజు జంక్షన్లో ముఖ్యమంత్రి చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్ రాష్ట్రంలోకి తీసుకువచ్చిన నకిలీ బ్రాండ్లతో మద్యాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవీవరప్రసాద్ తదిరతులు మాట్లాడుతూ మద్యంపై వస్తున్న ఆధాయంతో రాష్ట్ర పాలన సాగిస్తున్నందుకు జగన్‌కు మద్యాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ముందుకు ఇచ్చిన వాగ్ధానాల్లో భాగంగా తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
అబ్కారీ కార్పొరేషన్‌పై అప్పులు తెచ్చారా లేదాని ప్రశ్నించారు. గతంలో ఉన్న మంచి బ్రాండ్ల స్థానంలో నకిలీ బ్రాండ్లు తీసుకురావడం వల్ల వేలాది మంది మృతి చెందారని ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.
డిఎస్సీ ప్రకటించనందుకు, యువతకు ఉపాధి కల్పించనందుకు నిరసనగా జగన్‌కు మద్యాభిషేకం చేశామన్నారు. నకిలీ బ్రాండ్ల తెచ్చి పేదల కష్టాన్ని దోచుకుంటుంనందుకు, మధ్యంపై వచ్చే ఆదాయంతో పాలన సాగిస్తున్నందుకు, రాష్ట్రంలో అభివృద్ధి మరిచిపోయినందుకు, నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి ఎలాగైనా ఆయనపై అవినీతి మరక వేయాలని చూస్తున్న జగన్ కుటిల బుద్ధికి వందనం చేస్తూ ఈ మద్యాభిషేకం చేశామన్నారు.
అలాగే రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో భయ బ్రాంతులకు గురి చేస్తూ మానసిక ఆనందం పొందుతున్నందుకు, ఒక వైపు గంజాయి, మరో వైపు మాదక ద్రవ్యాలు, ఇంకో వైపు నాటు సారా ఇలా ఏపీని మత్తులో ముంచెతుత్తూ రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తున్నందుకు, కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలను హరిస్తూ… కష్ట జీవుల రెక్కల కష్టాన్ని మద్యం బాటిళ్ల రూపంలో దోచుకుంటున్న జగన్‌కు జోహార్లుకు చెబుతూ ఈ మద్యాభిషేకం చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, రాష్ట్ర నాయకులు, రాజమండ్రి పార్లమెంట్ నాయకులు, నగర కమిటీ నాయకులు, మహిళ కమిటీ నాయకురాళ్లు, తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్, వివిధ కమిటీల సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
పోలీసులు… టీడీపీ నాయకుల మద్య తోపులాట :
కాగా నందం గనిరాజు జంక్షన్లో తెలుగుదేశం పార్టీ వారు కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారని తెలిసిన పోలీసులు ఉదయం 8 గంటల నుంచే ఆ ప్రాంతంలో వేచి ఉన్నారు. కర పత్రాల పంపిణీ కాకుండా మరేదో నిరసన కార్యక్రమం చేట్టనున్నారని వారిలో అనుమానం కూడా నెలకొంది. అయితే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవీవరప్రసాద్ తదితర యువకులు బైపాస్ రోడ్డు మీదుగా ‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి’’ నినాదంతో ఉన్న ఫ్లక్స్‌తో ర్యాలీగా నందం గనిరాజు జంక్షన్ చేరుకున్నారు.
కొద్ది సమయం తరువాత ర్యాలీలో వారితో పాటు తీసుకువచ్చిన ఫ్లక్స్ను తొలగించి దాని వెనుక ఉన్న ముఖ్యమంత్రి జగన్ చిత్ర పటాన్ని బయట పెట్టి జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివిధ బ్రాండ్ల మద్యంతో మద్యాభిషేకం చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు… తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య కొద్ది సేపు తొపులాట జరిగింది. మద్యాభిషేకం చేయకుండా నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నం చేసినా అధి ఫలించలేదు. అటు తరువాత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొద్ది సేపు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు.