16 మంది ప్రధాన న్యాయమూర్తులలో సగం మంది అవినీతిపరులని అఫిడవిట్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు ఉలకలేదు
రాష్ట్రంలో వేలాది కోర్టు ధిక్కరణ కేసులు; అంటే అధికారులు కోర్టు ఉత్తర్వులను చెత్త కాగితాల క్రింద తీసిపారేస్తున్నారన్న మాట
సామాన్యుడు వ్యాఖ్యానిస్తే ధిక్కారం కేసు, అధికారంలో ఉన్న వారు తిట్టి పోసినా సగించినట్లు (ఫర్లేదులే.. కావాల్సిన వాళ్లే అన్నట్లు) వింటున్నారు
బలవంతులకొక న్యాయం, బలహీనులకొక న్యాయం న్యాయ వ్యవస్థ ఏర్పాటులోని మూల లక్ష్యమే దెబ్బతింటున్నది
Justice is not only done, but is seen to be done. న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్లు కన్పించాలి కూడా.
ప్రజలలో నమ్మకం లేని న్యాయానికి విలువలేదు. మన న్యాయ స్థానాలు ఈ కోణంలో ఎంత మేర ప్రజా విశ్వాసం పొందగలుగుతున్నాయన్న అంశంపై దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ మొదలు కావలసిన అవసరం ఉంది.
శాంతిభూషణ్, ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు; 50 ఏళ్లకు పైగా న్యాయవాద వృత్తిలో గడిపిన ప్రముఖుడు; కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా కూడా పని చేశారు. అంత గొప్ప వ్యక్తి, గత 16 మంది ప్రధాన న్యాయమూర్తులలో 8 మంది అవినీతిపరులు… అని సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు.
ఈ మాట అన్నందుకు నన్ను జైలుకు పంపాలనుకొంటే, పంపేయండి; స్వచ్ఛమైన, అవినీతి లేని న్యాయ వ్యవస్థను భారతదేశ ప్రజలకందించడానికి సంతోషంగా శిక్ష అనుభవిస్తానని శాంతి భూషణ్ అన్నాడు. దానిపై సుప్రీంకోర్టు పెదవి విప్పి మాట్లాడ లేదు; ఔననలేదు, కాదనలేదు. మౌనం అర్ధాంగీకారం అని సరిపెట్టుకోవాలేమో తెలియదు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని (జస్టిస్ దీపక్ మిశ్రాను) తెర వెనుక నుంచి ఎవరో ప్రభావితం చేస్తున్నారని అదే కోర్టులో రిటైర్ అయిన జస్టిస్ కురియన్ జోసెఫ్ ఒక ఆంగ్ల పత్రికలో ప్రకటించాడు.
ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య నడుస్తున్న మితిమీరిన స్నేహం, ప్రజాస్వామ్య హత్యకు మరణ మృదంగం మోగిస్తోందని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. ఆయనా సుప్రీంకోర్టులో రిటైర్ అయిన న్యాయమూర్తి.
IAS, IPS, న్యాయాధికారులలో అవినీతి వరదలై ప్రవహిస్తోందని మద్రాసు హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్య చేసింది.
గత ఐదేళ్లలో న్యాయమూర్తుల మీద 1600 ఫిర్యాదులు వచ్చాయని, వాటన్నిటిని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు పంపామని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజ్జు పార్లమెంటులో ప్రకటించారు.
రిటైర్మెంట్ ముందు తీర్పులు.. రిటైర్ కాగానే పదవులు
మన న్యాయ వ్యవస్థ ప్రస్తుత దుర్గతికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. లోతుకు వెళ్లి పరికిస్తే (చూస్తే) అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాజకీయ జోక్యం, అధికార యంత్రాంగపు బెదరింపు ధోరణి, బడా కార్పొరేట్లకు దాస్యం వంటి అవలక్షణాలు చాలా భయానకమైన రీతిలో కన్పిస్తాయి. రిటైర్ కాబోయే ముందు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన తీర్పు లివ్వడం ఒక ఆనవాయితీగా మారింది. సహారా – బిర్లా కేసులలో జస్టిస్ అరుణ్ మిశ్రా మీద ఈ కోణంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి.
రిటైర్ అయిన తర్వాత మరొక ఉన్నత హోదా కోసం ప్రభుత్వ పెద్దల చెలిమికి అర్రులు చాచడం అలవాటుగా మారింది. హోంమంత్రి అమిత్ నిందితుడిగా ఉన్న కేసును విచారిస్తున్న జస్టిస్ లోయా అనుమానాస్పదపు మృతి మీద కూడా జస్టిస్ అరుణ్ మిశ్రా చివరి రోజులలో తీర్పు చెప్పాడు. న్యాయ లోకం గగ్గోలు పెట్టినా ఫలితం లేదు. మోదీ అవినీతికి దర్పణమైన రాఫెల్ విమానాల కొనుగోలు కేసు తీర్పు కూడా ఇట్లనే వివాదాస్పదమైంది.
వీటన్నిటిని విన్న తర్వాత, మన న్యాయస్థానాలను మనం ఎంత వరకు నమ్మాలి, నమ్మగలం అన్న ప్రశ్నలు పుట్టుకొని రావడం సహజం. పైన చెప్పినదంతా అత్యున్నత స్థాయిలో, సర్వోన్నత న్యాయస్థానంలో నడుస్తున్న చరిత్ర. కింది స్థాయిలోని హైకోర్టుల్లో, జిల్లా కోర్టుల్లో, ప్రత్యేక కోర్టులలో ఇటు వంటి కథలు పుంఖాను పుంఖాలు. బార్ రూములలో న్యాయవాదులు పిచ్చా పాటీ కబుర్లలో – ఏ తీర్పు ఎట్లా వచ్చింది అన్న చర్చలే అధికంగా విన్పిస్తూ ఉంటాయి. న్యాయమూర్తుల మీద న్యాయవాదులలో చులకన భావన దుస్సహమైన (తీవ్ర) స్థాయికి చేరుతున్నది.
నీతిపరులెవరో చెప్పే వ్యవస్థ ఉంటే మేలు
ఈ పరిస్థితులలో మన కోర్టులను మనం నమ్మడం ఎట్లా? ఏ కోర్టులో ఏ న్యాయమూర్తి నిజాయితీపరుడో నిర్ధారించే వ్యవస్థ ఏదీ లేదు. దానితో మొత్తం వ్యవస్థ పట్లనే అపనమ్మకం పెరిగిపోతున్నది. కీలకమైన, వివాదాస్పదమైన, రాజకీయ ప్రమేయం ఉన్న అంశాల్లో న్యాయస్థానాలు వెలువరిస్తున్న తీర్పుల పట్ల చాలా తేలికగా మాట్లాడేస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో హేళనలు ఎక్కువై పోయాయి.
న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం లేకపోవడం వల్లనే ఈ దుర్గతి అన్నది నిర్వివాదాంశం. పత్రికలు, TV ఛానళ్లు రాజకీయ నేతల మీద, ఉన్నతాధికారుల మీద విస్తృతంగా విమర్శలు, వారి నిర్ణయాలపై విశ్లేషణలు చేస్తాయి. కానీ న్యాయస్థానాల జోలికి మాత్రం వెళ్లవు. తీర్పులో దొర్లిన తప్పిదాల గురించి, కేసుల విచారణలో జరిగే అవాంఛిత ఆలస్యం గురించి చర్చలు పెట్టవు. కోర్టులను ఎవరూ ప్రశ్నించకూడదన్నది అలిఖిత శాసనం.
రాజ్యాంగంలో కూడా ఏ న్యాయమూర్తి మీదా కేసు పెట్టే అవకాశం ఎవరికీ లేకుండా రక్షణ వుంది. ఒక న్యాయమూర్తి మీద ఫిర్యాదు చేయాలంటే, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర మాత్రమే సమర్పించాలి. సామాన్యులకు అది అసాధ్యం. సామాన్యులు కోర్టును ప్రశ్నిస్తే, వెంటనే కోర్టు ధిక్కార నేరం వెలికి వస్తుంది. శాంతిభూషణ్ వంటి సీనియర్ న్యాయవాదులు, పలువురు సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు, రిటైర్డ్ న్యాయమూర్తులు అభియోగాలు చేసినప్పుడు మాత్రం కోర్టు ధిక్కార నేరం ఎవరికీ గుర్తుకు రాదు. అంటే న్యాయస్థానాల దృష్టిలో సామాన్యులు వేరు, ఉన్నతస్థానాలలో ఉన్న వారు వేరని అర్థం చేసుకోవాలి.
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ షబరివాల్ ఇచ్చిన ఒక తీర్పు మీద మిడ్ డే దినపత్రిక విమర్శనాత్మక కథనం ప్రచురించింది. తన కుమారుడు భాగస్వామిగా ఉన్న షాపింగ్ మాల్స్ ప్రయోజనం కోసం ఆ తీర్పు ఇచ్చినట్లు మిడ్-డే ప్రచురించింది. వెంటనే ఢిల్లీ హైకోర్టులో కోర్టు ధిక్కార నేరం విచారణ మొదలైంది. అంతే తప్ప, ఆ తీర్పులోని అసమంజసతను, ఆశ్రితపక్షపాతం అన్న ఆరోపణను ఎవరూ పట్టించుకోలేదు. అంటే, న్యాయమూర్తులు తప్పు చేసినా న్యాయవ్యవస్థ క్షమిస్తుందని అర్థం. ఈ కోర్టు ధిక్కార నేరాలకు భయపడే పత్రికలు న్యాయస్థానాల వివాదాలకు దూరంగా ఉండి పోతున్నాయి.
11 అవినీతి నిరోధక కేసులలో నిందితుడిగా విచారణ ఎదుర్కొంటూ, బెయిల్ మీద ఉన్న మన ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి తన ప్రతినిధి అజయ కల్లాం నోటితో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల మీద నానా మాటలు అనిపించి, వాటికి విశేష ప్రాచుర్యం కల్పిస్తే, ఒక్క న్యాయస్థానం కూడా స్పందన చూపలేదు. బలవంతులను చూస్తే న్యాయస్థానాలకు కూడా భయం.
పౌరహక్కులు భగ్నమవుతున్నాయి
న్యాయస్థానాలలో బలహీనుడు తన హక్కులను కోల్పోతున్నాడు; వనరులు ఉన్న వాడు వ్యవస్థను తనకు అనుకూలంగా మలచుకొంటున్నాడు. ఏ లక్ష్యం కోసమైతే న్యాయవ్యవస్థ ఏర్పడిందో, ఆ లక్ష్యం దీనివల్ల నిర్వీర్యం అయిపోతోంది. బలహీనులను రక్షించవలసిన న్యాయవ్యవస్థ బలవంతుడి దౌర్జన్యాలకు వంత పాడిన సంఘటనలు కోకొల్లలుగా కన్పిస్తున్నాయి.
మన రాష్ట్రం విషయమే చూస్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నరేళ్లుగా తన పదకొండు కేసుల విచారణకు హాజరు కావడం లేదు. కానీ న్యాయమూర్తి అదేమని అడగడం లేదు.
చివరకు, తానే పెట్టిన కోడికత్తి కేసు విచారణకు కూడా హాజరు కాలేదాయన. ఆ ఆయన ఇంటికి కూత వేటు దూరంలో. కానీ న్యాయమూర్తులకు అడిగే ధైర్యం లేదు. క్రిమినల్ కేసులలో నిందితులు కోర్టుకు హాజరు కాకపోతే వెంటనే అరెస్ట్ వారెంట్ ఇస్తారు. పోలీసును ఇంటికి పంపుతారు. పట్టుకెళ్లి న్యాయమూర్తి ముందు నిలబెడతారు. బలహీనులకు మాత్రమే ఈ న్యాయం; బలవంతులకు వేరే న్యాయం.
YS వివేకానంద రెడ్డి హత్య కేసు ఇందుకు మరొక ఉదాహరణ. తన తండ్రి చావుకు కారకులైన వారిని శిక్షించండి అని ఆయన కుమార్తె దీనంగా కింది నుంచి పై వరకు కాళ్లరిగేట్లు తిరుగుతున్నా, ఒక్క న్యాయస్థానంలో కూడా న్యాయం లభించడం లేదు.
పరిస్థితి ఇట్లనే కొనసాగితే, మన దేశం ఏమైపోతుంది? ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే, స్వతంత్ర పోకడ, సమర్ధత కలిగిన న్యాయవ్యవస్థ తప్పనిసరి. న్యాయవ్యవస్థ బలహీనమైతే, రూల్ ఆఫ్ లా విఫలమవుతుంది; ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుంది; న్యాయం దొరకదని తేలిపోతే సమాజంలో అరాచకం ప్రబలుతుంది; న్యాయం కోసం గూండాలు, రాజకీయ నాయకులను ఆశ్రయించవలసి వస్తుంది. ఆ పరిణామాలు ప్రజల జీవితాలను ఎంత భయానకంగా మారుస్తాయో ఊహించడం కూడా కష్టం.
న్యాయమూర్తులకే రక్షణ లేదు
న్యాయవ్యవస్థ స్వతంత్రంగా, న్యాయమూర్తు లకు స్వేచ్ఛ వుండాలి. భయం అనే పదం వారి దరికి కూడా చేరకూడదు. కానీ గత కొంతకాలంగా ఆ పరిస్థితులు లేవు. హైకోర్టు న్యాయమూర్తుల మీద YCP నేతలు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాలలో వ్యక్తిత్వ హననం చేస్తూ విశృంఖలంగా పోస్టింగ్లు పెట్టారు. వీటి మీద చర్య తీసుకోవాలని హైకోర్టు తీవ్ర స్వరంతో ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ సరైన చర్యలు తీసుకొన్న సూచనలు లేవు.
దానివల్ల చంద్రబాబు కేసులో రిమాండ్ విధించిన ACB కోర్టు న్యాయమూర్తి మీద ఆ పార్టీ కార్యకర్తలు అదే నమూనాలో పోస్టులు పెట్టారు. తమ వ్యక్తిత్వాన్ని రక్షించు కొనే శక్తి లేని న్యాయమూర్తులు, ప్రజల హక్కులను కాపాడడం ఎట్లా సాధ్యం? మన హైకోర్టులో కోర్టు ధిక్కార నేరాల కేసులు ఐదారు వేల వరకు పెండింగ్లో ఉన్నాయని సమాచారం.
అంటే, అన్ని సందర్భాలలో హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఉల్లంఘించారని అర్థం. న్యాయ వ్యవస్థ మీద గౌరవం, భయం లేనితనం వల్లనే అధికారులు న్యాయస్థానాలిచ్చే ఉత్తర్వులను చెత్త కాగితాల కింద తీసిపారేస్తున్నారు. తామిచ్చే ఉత్త ర్వులు అమలుకాకుండా ఏమీ చేయలేని నిస్సహా యతలోకి వెళ్లి పోతున్న న్యాయవ్యవస్థను ప్రజలు ఎట్లా నమ్ముకోగలరు?
న్యాయ వ్యవస్థను పరిరక్షించాలంటే, న్యాయ స్థానాలు తమను తాము సంస్కరించుకోవాలని జస్టిస్ చలమేశ్వర్ ఒక తీర్పులో పేర్కొన్న వ్యాఖ్య చాలా సందర్భోచితమైనది.

జమీన్ రైతు ఎడిటర్