– డిసెంబర్ 3న ఉదయం 11.30గంటలకు విజయవాడ వన్ టౌన్ లో కొత్తగుడుల కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో చర్చకు రెడీ
-ఆర్యవైశ్యులకు టీడీపీ ఏం చేసిందో, జగన్ ప్రభుత్వం ఏం చేసిందో వివరించటానికి డూండి రాకేష్ సిద్ధం
– జగన్ సీఎం కాకుండా అడ్డుకున్నారనే అక్కసుతో రోశయ్యపై కోపాన్ని ఆర్యవైశ్యులపై చూపడం తగదు
– దమ్ముంటే చర్చకు రావాలని సవాల్
– ఆర్యవైశ్యులంటే వైసీపీ ప్రభుత్వానికి ఎందుకింత కక్ష?
– ఆర్యవైశ్యులను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు
-టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేశ్
వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ కు డూండి రాకేష్ ప్రతిసవాల్ విసిరారు. డిసెంబర్ 3న ఉదయం 11.30గంటలకు విజయవాడ వన్ టౌన్ లో కొత్తగుడుల కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో చర్చకు రెడీ అన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. జగన్ ను సీఎం కాకుండా కొణజేటి రోశయ్య అడ్డుకున్నారనే అక్కసుతో ఆర్యవైశ్యులపై కక్ష కట్టడం తగదని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేశ్ మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేశ్ మాట్లాడిన మాటలు …
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తోంది. ఆర్యవైశ్య సోదరులపై కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోంది. కులగణన తెచ్చి వైశ్యుల్లో చీలిక తెచ్చారు. ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత, నిధులు, కార్పొరేషన్ ఇవేవీ అవసరం లేనట్లు వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ వివరాలన్నీ వైట్ పేపర్ పై రిలీజ్ చేయడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. నేడు కుల గణనలో 723 కులాల పేర్లు చేర్చారు. వాటిలో ఆర్యవైశ్య కులం పేరే లేదు. ఇందులో అసలు కోమటి అనే కులం పేరే లేదు, తెచ్చి కోమటి అని చేర్చారు. ఆర్యవైశ్యుల్నే గుప్తాలు అని పిలుస్తారు. దీన్ని కూడా చేర్చారు. ఆర్యవైశ్యుల్ని శెట్టిగారు అని ఊత పదంగా పిలుస్తారు. దాన్ని కూడా తెచ్చి కులం పేరులో పెట్టారు. ప్రపంచంలోని 72 దేశాల్లో ఆర్యవైశ్య సంఘాలున్నాయి.
ప్రపంచంలోనే ఆర్యవైశ్యులకు గుర్తింపు ఉంది. ఆర్యవైశ్య సభలు, ఆర్యవైశ్య ఆర్గనైజింగ్, ఆర్యవైశ్య మహాసభ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఇలా ఆర్యవైశ్య కుల సంఘాల పేర్లు గొప్పగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన 723 కులాల లిస్టులో ఆర్యవైశ్య కులం పేరే లేదు. వైసీపీలోని ఆర్యవైశ్య నాయకులు ఎందుకు నోరు తెరచి మాట్లాడటంలేదు? ప్రభుత్వానికి ఆర్యవైశ్యులంటే ఎందుకింత చులకన? ఈ కులాల లిస్టులో ఆర్యవైశ్య కులం పేరును 723 కులాల లిస్టులో నుంచి తొలగించడంలో ప్రభుత్వ అంతరార్థం ఏమిటో తెలియాలి. కుల గణన గురించి వాలంటీరు, సచివాలయ సిబ్బంది ఇళ్లకు వచ్చి అడిగినప్పుడు మేం శెట్టి, కోమటి, గుప్త కాదు.. మేం ఆర్య వైశ్యులమని చెప్పండి అప్పుడే ఆర్యవైశ్యులు లెక్కల్లోకి వస్తారని నాయకులు మెసేజ్ లు పంపుతున్నారు. ఆర్యవైశ్య కులం పేరును తీసేయడంలో అర్థమేమిటి? ఎందుకు ఆర్యవైశ్యులంటే ఇంత కక్ష? ఎందుకు ఆర్యవైశ్యులను ఇబ్బంది పెడుతున్నారు? దేనికీ పనికిరాని ఆర్యవైశ్య కులానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ ను జగన్ మోహన్ రెడ్డి తొత్తుగా పెట్టుకున్నారు. ఎక్కడ ఆర్యవైశ్యులకు ఇబ్బందులు కలిగినా వెల్లంపల్లి శ్రీనివాస్ అణగదొక్కే ప్రయత్నం చేస్తాడు.
చంద్రగిరి పోలీసు స్టేషన్ లో శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ ఆర్యవైశ్యుడిని బెదిరిస్తే పెట్రోల్ మీద వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీనిపై స్పందన లేదు. ఈ నాలుగున్నర సంవత్సరాలలో 13 మంది ఆర్యవైశ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. విపరీత ట్యాక్సులు వేసి ఆర్యవైశ్యులను ఇబ్బంది పెడుతున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబంలో ఏ శుభకార్యం జరిగిగినా కోట్లాది రూపాయలు వ్యాపరస్థులను బెదిరించి దండుకుంటున్నారు. కార్తిక పౌర్ణమి రోజున కృష్ణా నది ఒడ్డున కనకదుర్గమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న పున్నమి ఘాట్ లో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ గారి స్థలంలో ఆర్యవైశ్యులం ప్రతి సంవత్సరం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించుకుంటాం, ఎప్పటిలాగే ఈ యేడాది నిర్వహించదలచుకుంటే దాన్ని అడ్డుకుంటున్నారు. పేద ఆర్యవైశ్యులు తమ జీవితాల్లో మార్పు రావాలని వాసవీ ఫౌండేషన్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కలిసి 19వ తేదిన సత్యనారాయణ స్వామి వ్రతాలు పెట్ట దలచి.. 20 రోజులకు ముందే అనుమతికై దరఖాస్తు చేసుకుంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
3 పేజీల నోటీసు ఇచ్చి మీరు వన సమారాధన చేసుకోవడానికి వీలు లేదన్నారు. కల్యాణమండపాల్లో నిర్వహించదలచుకుంటే కల్యాణ మండపాల్లో సభలు, సమావేశాలు నిర్వహించరాదని సర్కులర్ పాస్ చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించరాదని 30 యాక్టు పెట్టారు. మండపం వారికి సర్కులర్ . వెల్లంపల్లి శ్రీనివాస్ బృదం ప్రెస్ మీట్ మాట్లాడుతుంటే గొడవలు సృష్టించాలని ప్రయత్నించారు. 10 వేల మంది భోజనాలను వెస్ట్ చేశారు. వెల్లంపల్లి శ్రినవాస్ నిర్వహించుకున్న సమారాధనకు వైసీపీ రంగులు వేసుకున్నారు. అది ఆర్యవైశ్య సమారాధానా లేక వైసీపీ మీటింగా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ పెట్టుకునే కార్యక్రమానికి ఎలాంటి అడ్డంకులు లేవుగానీ.. అదే మేం చేసుకునే కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించారు, ఇదెక్కడి న్యాయం?
ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా ఆర్యవైశ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నా చర్యలు మాత్రం శూన్యం. ఆర్యవైశ్యులపై ఎందుకు ఉక్కు పాదం మోపుతున్నారు? మీ సీఎం పదవికి మా రోశయ్య అడ్డొచ్చాడని ఆర్యవైశ్యులు రాష్ట్రంలో ఉండకూడదని కంకణం కట్టుకున్నట్లున్నారు. కొణిజేటి రోశయ్యపై ఉన్న కోపాన్ని మీరు ఆర్యవైశ్యులపై తీర్చుకుంటున్న మాట వాస్తవం కాదా? సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అడ్డుకొని వెల్లంపల్లి శ్రీనివాస్ పాపం మూటగట్టుకున్నాడు. జగన్ హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినవారిని ప్రోత్సహిస్తున్నాడు. హిందూయిజాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తూ ఊరుకోం. తొందరలోనే అందరం ఏకమౌతాం. డిసెంబర్ 3 వ తేదిన 11.30కు నేను బహిరంగకు సిద్ధం. ఆర్యవైశ్యులపై వైసీపీ ప్రభుత్వం చేసిన దురాగతాలను సాక్షాలతో సహా వచ్చి బయట పెడతాను. ధైర్యం ఉంటే వెల్లంపల్లి రావాలని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేశ్ సవాల్ విసిరారు.