Suryaa.co.in

Andhra Pradesh

ఏ అత్తారింటికి దారి చెబుతావు పవన్‌కళ్యాణ్‌?

– పొలిటికల్‌ కాంట్రాక్ట్‌ పార్టీ జనసేన
– చంద్రబాబు కోసమే పనిచేసే వ్యాపార సంస్థ అది
– తెలంగాణ రిజల్ట్‌తో పవన్‌కళ్యాణ్‌కు మతి చెడింది
– పవన్ కల్యాణ్ కంటే.. బర్రెలక్క(శిరీష)నయమనిపిస్తుంది
– అబ్రహం లింకన్ కాదు..నారా లింకనే పవన్ కు స్ఫూర్తి
– ప్రజల్లో ఎటువంటి స్థాయి, బలం లేని వ్యక్తి పవన్ కల్యాణ్
– జగన్ ని విమర్శించి తన స్థాయి పెంచుకోవాలని పవన్ చూస్తున్నాడు.
– విశాఖ ఉక్కుపై అబద్ధాల కబుర్లు చాలించు పవన్..!
– ఆంధ్రప్రదేశ్‌తో నీకు సంబంధం ఏంటి పవన్ కల్యాణ్..?
– పార్టీ పెట్టి పదేళ్లయినా సొంత నియోజకవర్గం ఏంటో చెప్పలేని పవన్
– మంత్రి గుడివాడ అమరనాథ్‌

పవన్‌కళ్యాణ్ మతి చెడిందిః
తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మతి చెడింది. అతను మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా మాట్లాడుతున్నాడు. జనసేన పార్టీకి తెలంగాణలో దక్కిన ఓట్లశాతం చూసి అతను మతిస్థిమితం కోల్పోయాడేమోనని ప్రజల్లో చర్చ మొదలైంది. కనీనం, స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా తన పార్టీకి రాలేదనే మనస్తాపం పవన్‌కళ్యాణ్‌ను వెంటాడుతుందేమో.. కారణాలేమైనా.. నిన్న విశాఖపట్నంలో ఆయన ప్రసంగం తీరుకు రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు.

రాజకీయంగా ఎటువంటి స్థాయి, బలం లేని వ్యక్తి పవన్ కల్యాణ్:
ఎన్నికల బరిలో నిలబడే ఏ వ్యక్తికైనా.. రాజకీయ పార్టీకైనా ఒక స్థాయి, బలం ఉంటుంది. ఎన్నికల ఫలితాలనే ఆ రాజకీయ పార్టీ నాయకుడి స్థాయి, అతని నాయకత్వ బలానికి కొలమానంగా చూస్తారు. దీన్నిబట్టి చూస్తే.. పవన్‌కళ్యాణ్‌ కన్నా బర్రెలక్కనే నయమనిపిస్తుంది. స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసిన ఆమె బలం కన్నా జనసేన పార్టీ చాలా వీక్‌గా కనిపించింది. అతని నాయకత్వ బలం పేలవమని.. ఎన్నికల బరిలో నిలబడే స్థాయి ఆపార్టీకి లేదని తేటతెల్లమైంది.

కనుకనే, అతను ఈ రాష్ట్రంలో పర్యటించిన ప్రతీచోటా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, ప్రభుత్వ పరిపాలనను విమర్శిస్తూ ప్రజల్లో ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆయన నిన్న విశాఖపట్నంలో ప్రభుత్వం మీద, జగన్‌గారిపై ఇష్టానుసారంగా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడాడు. ఆయన మాటల్ని వైఎస్‌ఆర్‌సీపీ తరఫున మేము, ప్రజలు కూడా ఖండిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌తో నీకున్న సంబంధమేంటి..?
పవన్‌కళ్యాణ్‌ను నేనొక ప్రశ్న అడుగుతున్నాను. నీకు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఏంటి సంబంధం..? నీకు ఇక్కడ రాజకీయాలతో సంబంధం ఏంటి..? మొన్నటి వరకు తెలంగాణలో నువ్వు ఏం మాట్లాడావు..? రాష్ట్ర విభజన జరిగిన ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆంధ్రలో నువ్వు ఎన్ని రోజులు ఉన్నావు..? నువ్వు అత్యధికంగా నివాసం ఉన్న ప్రదేశాలు గానీ.. స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌. మరి, అక్కడ ఎన్నికల్లో మీరు జనసేన పార్టీ తరఫున పోటీచేస్తే మీ బలమేంటో తేలిపోయింది కదా..?

ఖమ్మంలో మీ పార్టీ తరఫున నిలబడిన శంకర్‌గౌడ్‌కు అంతా కలిపితే కేవలం 4వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అది మీ బలం. మరి, ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఉనికి చాటుకోలేని బలంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికొచ్చి నువ్వెలా మాట్లాడతావు..? అని ప్రశ్నిస్తున్నాను. జనసేన పెట్టి పదేళ్లు దాటిపోయినా.. ఆంధ్రలో నీది ఏ నియోజకవర్గమో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. జగన్‌గారిది పులివెందుల, చంద్రబాబుది చంద్రగిరినో.. లేదంటే, గడచిన కొన్నేళ్లుగా కుప్పం అనో చెబుతారు. అలాంటిది, పవన్‌కళ్యాణ్‌ నియోజకవర్గమేంటనేది.. ప్రజలకు సమాధానం చెప్పాలికదా..? నువ్వు ఇక్కడ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గమే చెప్పలేనప్పుడు.. నీకు ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం ఏంటయ్యా చెప్పు..

‘నారా’ లింకన్‌ స్ఫూర్తితోనే పనిచేస్తున్నావా..?
పవన్‌కళ్యాణ్‌ .. నువ్వు ఏ ఊరికెళితే ఆ ఊర్లోనే పుట్టానంటావు. ఒంగోలు, గుంటూరు, పొన్నూరులో పుట్టానంటావ్‌.. చదివానంటావ్‌.. కర్నూలులో మీ ఇల్లుందంటావ్‌.. నెల్లూరు వీధుల్లో తిరిగానంటావ్‌.. నిన్ననేమో విశాఖపట్నమని చెబుతావు. అమెరికా అంటావు. అబ్రహాం లింకన్‌తో నిన్ను నువ్వు పోల్చుకుంటావ్‌.. నువ్వు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన భీమవరం గురించి కూడా ఏదేదో.. అంతా నీకే తెలిసినట్లు చెబుతావు..? ఆంధ్రలో ప్రాంతాలే నీకు తెలియదు.

ఇక్కడ ప్రజల మనోభావాలు నీకు అర్ధం కావు గానీ ఏమాత్రం స్థాయి, బలం లేకుండా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అనేకసార్లు ప్రయత్నించి ఓడిన అబ్రహం లింకన్‌ నీకు స్ఫూర్తి అంటున్నావు. నిజానికి నీకు అబ్రహం లింకన్‌ కాదు. నారా లింకన్‌ నీకు స్ఫూర్తి. ‘నారా’వారి లింకులతోనే రాజకీయ మనుగడ అంటూ ప్రచారం చేసుకో.. బాగుంటుంది. నీకూ చంద్రబాబు నాయుడుకు ఉన్న లింకుల గురించి మాట్లాడు తప్ప అబ్రహాం లింకన్‌ వంటి మహానుభావుల గురించి నీకెందుకు..?

పొలిటికల్‌ కాంట్రాక్ట్‌ల వేదిక ‘జనసేన’
తెలంగాణలో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తానని ప్రగల్భాలు పలికిన నువ్వు అక్కడ బలం లేక చతికిలపడ్డావు. ఆంధ్రలో మాత్రం అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ పార్టీని కూలదోస్తానని సొరకాయ కబుర్లు చెబుతున్నావు. తెలంగాణలో నువ్వు ఊడబొడిచిందేమీ లేదని తేలిపోయింది. రేపు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ నీకు జరిగే పరాభవం ఎలా ఉంటుందో.. వేచిచూడు. రాజకీయ పార్టీ పుట్టుక వెనుక ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం, ప్రజాసామ్య సిద్ధాంతం ఉంటుంది. అయితే, జనసేన పార్టీ మాత్రం ఒక లక్ష్యమూ.. సిద్ధాంతం లేని పార్టీ అని ప్రజలకు ఇప్పటికే అర్ధమైంది.

జనసేన అనేది కేవలం పొలిటికల్‌ కాంట్రాక్టుల కోసమే పుట్టిన పార్టీగా ప్రజలు ఫిక్స్‌ అయ్యారు. ఇది నిజం. నీ సినిమా ఇమేజ్‌ను ఆధారంగా చేసుకుని పొలిటికల్‌ కాంట్రాక్టులను నెరవేరుస్తున్నట్లు పవన్‌కళ్యాణ్‌ను ప్రజలు గుర్తిస్తున్నారు. ఇన్నాళ్లూ రాజకీయ పార్టీగా చూసిన జనసేనను ఇప్పుడు పొలిటికల్‌ కాంట్రాక్ట్‌ వేదికగా ప్రజలు చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీతో అధికారికంగా పొత్తు అంటూ ఒక కాంట్రాక్ట్‌ నడుపుతావు. ఆంధ్రలో మాత్రం అన్‌ అఫీషియల్‌గా టీడీపీతో పొత్తు నడుపుతూ, మరో పొలిటికల్‌ కాంట్రాక్ట్‌ నడుపుతున్నావు. నీ దాగుడుమూతల రాజకీయ వ్యాపారం అందరికీ తెలిసిపోయింది.

విశాఖ ఉక్కుపై అబద్ధాల కబుర్లు చాలించు..
విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నేను చెప్పాను కాబట్టే కేంద్రం నిలిపివేసిందని చెబుతున్నావు. కేంద్రం ఆ ప్రతిపాదనను నిలిపివేసినట్లు అధికారికంగా ఎక్కడైనా చెప్పిందా..? అలాంటి ప్రకటన ఏమైనా అధికారికంగా విడుదల చేసిందా..? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా రాష్ట్రం నలుమూలల నుంచి గళం వినిపిస్తుంటే.. దాదాపు వెయ్యిరోజులకు పైగా ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తుంటే.. ఆరునూరైనా ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని ప్రభుత్వం కేంద్రం దగ్గర పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా..?

అదే, ఈ పవన్‌కళ్యాణ్‌ను ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగులు ఆందోళన శిబిరానికి ఆహ్వానిస్తే.. ఏమన్నాడో తెలుసా.. నన్ను గాజువాకలో గెలిపించి ఉంటేనో.. నా పార్టీకి ఒక్క ఎంపీ సీటు ఇచ్చుంటేనో.. కేంద్రంతో బలంగా పోరాడేవాడ్ని అని అన్నావు. అది నీ సంస్కారం. బీజేపీతో పొత్తులో ఉన్న వ్యక్తివి కదా..? మరి, కేంద్రంతో మాట్లాడి ప్రైవేటీకరణ ఆపేయొచ్చు కదా..? మోదీ, అమిత్‌షా పక్కన కూర్చోగల వ్యక్తినంటావు కదా..మరి, వారిచేతనే అధికారికంగా విశాఖ ఉక్కుఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయబోమని చెప్పించు..? ఇవేమీ చేతకాక.. అబద్ధాలాలను అల్లేసి చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మేంత పిచ్చోళ్లు కాదని నువ్వు తెలుసుకో..

నీకూ, చంద్రబాబుకు ప్రజలే బుద్ధిచెబుతారు
పవన్‌కళ్యాణ్‌ .. నీ రాజకీయ బతుకంతా చంద్రబాబుతోనే ముడిపడి ఉందని ఈ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయం. ఆయన్ను అధికారం లోకి తిరిగి తేవాలని నువ్వెంతగా తాపత్రయపడుతున్నావో.. అందులో భాగంగానే ప్రస్తుత ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద నువ్వు బురదజల్లే ప్రయత్నాలకు పాల్పడుతున్నావనేది జగమెరిగిన సత్యం. కనుక, రేపటి ఎన్నికల్లో నీకు, నీ జనసేన పార్టీతో పాటు చంద్రబాబుకు, టీడీపీకి ఘోరపరాభవం ఏ స్థాయిలో జరుగుతుందనేది ప్రజలు ఇప్పటికే నిర్ణయించారు.

అందులో భాగంగానే నిన్న విశాఖపట్నంలో జనసేన సభాకార్యక్రమం ఎంత పేలవంగా జరిగిందనేది ఉదాహరణ. ఇక, రాను రానూ జనసేన పార్టీకి, నీకు ప్రజల నుంచి స్పందన దాదాపు కరువైనట్లేనని అర్ధంచేసుకో.. నువ్వు, చంద్రబాబు కలిసి ఎన్ని రాజకీయ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా వైఎస్‌ఆర్‌సీపీ విజయదుందుభిని ఎవరూ ఆపలేరన్నది వాస్తవం.ఈ నిజాల్ని తెలుసుకుని మసలుకుంటే ఎంతైనా మంచిది. లేదంటే మీకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

రాజధానిపై వెటకారంగా మాట్లాడుతున్నావ్. అత్తారింటికి దారేది.. అంటూ నీ సినిమాతో పోల్చావు. ఎవరికైనా అత్తారింటికి దారేది.. అంటే ఠకీమని చెబుతారు. నీవు మాత్రమే చెప్పలేవు. ఎందుకంటే.. ఏ అత్తారింటికి దారి చెబుతావు..? అని మంత్రి అమర్నాథ్ సెటైర్లు వేశారు.

LEAVE A RESPONSE