Suryaa.co.in

Telangana

దేశంలో సుపరిపాలనకు ఆద్యుడు అటల్ బిహారీ వాజ్‌పేయి

– సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా.. డిసెంబర్ 25న దేశవ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్బంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.

దేశంలో సుపరిపాలనకు ఆద్యుడు భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి . అంత్యోదయ నినాదంతో భారతదేశంలో సుపరిపాలనకు సరికొత్త నిర్వచనాన్ని చెప్పారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి ప్రభుత్వం కూడా.. అటల్ బిహారీ వాజ్‌పేయి గారు చూపిన మార్గంలో.. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం బాటలో నడుస్తోంది.

1999లో వాజ్‌పేయి గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత టెలికాం రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. ఇవాళ మోదీ ప్రభుత్వం ప్రతి గ్రామానికీ ఆప్టికల్ ఫైబర్ సేవలను అందించే లక్ష్యంతో పనిచేస్తోంది. 2 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలను బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసింది.

వాజ్‌పేయి గారి టెలికమ్యూనికేషన్ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆర్థిక వ్యవస్థలో సాంకేతికతను తీసుకొచ్చి.. JAM (జన్ ధన్-ఆధార్ మొబైల్) ని అమలు చేశారు. JAM ద్వారా.. దేశ ఆర్థిక సేవల రంగంలో చారిత్రకమైన మార్పులు వచ్చాయి.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా.. వాజ్‌పేయి గారి ప్రభుత్వం 1999లో గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసింది. 2003లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST) ను ఏర్పాటుచేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కారు కూడా.. గిరిజనుల సాధికారతకోసం, వారి ఆర్థిక, సాంస్కృతిక వికాసం కోసం చాలా కార్యక్రమాలు చేపట్టారు.

వాజ్‌పేయి గారి ప్రభుత్వం 1998లో పోఖ్రాన్‌లో అణు పరీక్షలు నిర్వహించింది. ఇది సుపరిపాలనలో కీలకమైన అంశం. జాతీయ భద్రత అంశంలో వాజ్‌పేయి గారి ఆలోచనను నరేంద్రమోదీ గారి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. దేశ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అడుగులేసిన దూరదృష్టి గల నేత వాజ్‌పేయి గారు. 2001లో తూర్పు రష్యాలోని ‘సాఖలిన్-ఐ’ ఆయిల్ & గ్యాస్ ఫీల్డ్స్‌లో వ్యూహాత్మకంగా 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 20% వాటాను సంపాదించుకుంది. మోదీ ప్రభుత్వం..20కి పైగా దేశాల్లో ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టింది. భారత పౌరులకు ఇంధన భద్రతను సునిశ్చితం చేసే లక్ష్యంతో గ్లోబల్ జియో-పొలిటికల్ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోంది.

వాజ్‌పేయి గారి.. స్వప్నమైన ‘గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్టు’ – ‘స్వర్ణ చతుర్భుజి’ ప్రాజెక్టు.. స్వాతంత్ర్య భారతంలో అతిపెద్ద జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుగా నేటికీ కీర్తించబడుతోంది. ప్రధాని నరేంద్రమోదీ గారు.. భారతమాల ప్రాజెక్టు, ప్రగతి (ప్రొ-యాక్టివ్ గవర్నెర్స్ అండ్ టైమ్‌లీ ఇంప్లిమెంటేషన్), పీఎం గతిశక్తి యోజన వంటి ప్రాజెక్టులు.. వాజ్‌పేయి గారి సుపరిపాలనను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నారు.
1998లో వాజ్‌పేయి గారు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టారు. దీని ద్వారా రైతులు తమ పంట ఉత్పత్తి అవసరాలకోసం బ్యాంకుల వద్ద రుణాలు తీసుకునే విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. నరేంద్రమోదీ గారి ప్రభుత్వం కూడా మరెన్నో రైతు అనుకూల సంస్కరణలు తీసుకొచ్చింది.

వాజ్‌పేయి గారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి ఆయా రాష్ట్రాల సమస్యలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. వాజ్‌పేయి గారి ఈ విజన్‌ను ముందుకు తీసుకెళ్తూ.. ప్రధాని మోదీ గారు.. యాక్ట్ ఈస్ట్ పాలసీని ప్రవేశపెట్టి.. ఈశాన్యరాష్ట్రాలను అష్టలక్ష్మిగా పిలుస్తూ.. ఆ రాష్ట్రాల అభివృద్ధికి 10% జీబీఎస్ కేటాయిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆ పనులను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
వాజ్‌పేయి గారి నేతృత్వంలో.. భారతదేశాన్ని స్వయంసమృద్ధిగా మార్చడం, దిగుమతులు తగ్గించడంపై వంటి ఆర్థిక సంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాని మోదీ గారి ప్రభుత్వం కూడా దేశాన్ని ఆత్మనిర్భరంగా మార్చేందుకు.. వాజ్‌పేయి గారు చూపిన బాటలో పయనిస్తోంది.

ఆర్థిక క్రమశిక్షణ దేశవ్యాప్తంగా ఉండాలన్న సంకల్పంతో వాజ్‌పేయి గారు.. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (FRBM) చట్టాన్ని తీసుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా.. మోదీ ప్రభుత్వం ‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్‌సీ కోడ్’ (దివాళా కోడ్) తీసుకొచ్చింది.

సాధారణ సేల్స్ టాక్స్ స్థానంలో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను వాజ్‌పేయి ప్రభుత్వం తీసుకొచ్చింది. 2017, జూలై 1 నుంచి జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా కరువు, వరదల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు వాజ్‌పేయి ప్రభుత్వం నదుల అనుసంధానతను తెరపైకి తీసుకొచ్చింది. వాజ్‌పేయి గారి స్వప్నాన్ని.. మోదీ గారి నేతృత్వంలోని కేబినెట్ సాకారం చేసింది.

వాజ్‌పేయి గారి ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఇద్దరి లక్ష్యాలు.. ‘అంత్యోదయ’ను సాకారం చేయడమే. ఈ దిశగా మోదీ సర్కారు విస్తృతంగా కృషిచేస్తోంది. పర్యావరణ పరిరక్షణతోపాటుగా దేశమంతా సమానమైన అభివృద్ధి ఫలాలు అందించే విషయంలోనూ బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణకోసం ‘మిషన్ లైఫ్‌’ను మోదీ సర్కారు తీసుకొచ్చింది.

వాజ్‌పేయి గారు 2001లో 14 లక్షల స్వయం సహాయక బృందాలు (SHGs)ను ప్రకటించారు. దీని స్ఫూర్తితో.. మోదీ గారి ప్రభుత్వం 2021లో సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసింది. ఈ శాఖ ద్వారా.. స్వయం సహాయక బృందాలకు ప్రోత్సాహకరమైన వాతారణాన్ని కల్పించేందుకు ‘లఖ్‌పతి దీదీ’, ‘నమో డ్రోన్ దీదీ’ వంటి కార్యక్రమాలను తీసుకొచ్చింది.

తొలిసారిగా వాజ్‌పేయి ప్రభుత్వం.. కేంద్రీయ విద్యుత్ నియంత్రణ కమిషన్ అనే క్వాసీ-జ్యుడిషియల్ వ్యవస్థను ఏర్పాటుచేసింది. మోదీ ప్రభుత్వం కూడా మారుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంపై, విద్యుత్ రంగంలో సంస్కరణలపై దృష్టిసారించింది.

వ్యవసాయ రంగంలో వాజ్‌పేయి గారి ప్రభుత్వం సుపరిపాలన సంస్కరణలు మోదీ ప్రభుత్వం చాలా వేగంగా విస్తరింపజేసింది. వ్యవసాయ రంగంలో, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌, తదితర అంశాలకు సంబంధించి తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా.. 2014లో.. 12 మెట్రిక్ టన్నులున్న భారత ఫుడ్ ప్రాసెసింగ్ సామర్థ్యం.. ఇవాళ 200 మెట్రిక్ టన్నులకు పెరిగింది.

వాజ్‌పేయి గారి ‘సర్వశిక్షా అభియాన్’ స్ఫూర్తితో.. మోదీ ప్రభుత్వం.. కనీసం పదిలక్షలమంది విద్యార్థుల్లోని సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ.. వారిని సైంటిస్టులుగా తీర్చిదిద్దేందుకు.. 10వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఏర్పాటుచేశారు.

డిసెంబర్ 2000లో వాజ్‌పేయి ప్రభుత్వం పేదకుటుంబాలకోసం ‘అంత్యోదయ అన్నయోజన’ను ప్రవేశపెట్టింది. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. మోదీ ప్రభుత్వం ‘వన్ నేషన్ – వన్ రేషన్ కార్డ్’ను తీసుకొచ్చింది.
వాజ్‌పేయి గారు భారతీయ భాషలను ప్రోత్సహించేవారు. నరేంద్రమోదీ గారు కూడా నూతన జాతీయ విద్యావిధానం (NEP) ద్వారా.. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించాలని నిర్ణయించారు.

LEAVE A RESPONSE