Suryaa.co.in

Andhra Pradesh

షర్మిళా రెడ్డిని షర్మిళా శాస్త్రిగా సంబోధిస్తారా?… ఇదెక్కడి పైత్యం?

– జగన్మోహన్ రెడ్డిది వేరే కులమా?
-వైయస్ రాజారెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డిలు కూడా రెడ్డి కాదా?
-సజ్జల బెదిరింపుల నేపథ్యంలో షర్మిల అన్ని జాగ్రత్తలను తీసుకోవాలి
-సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళవద్దు
-నాపై పోటీ చేసే అభ్యర్థులు దొరకక దేహి.. దేహి అంటూ తిరుగుతున్నారు
-బాలశౌరి వైకాపాను ఎందుకు వీడారో తెలియదు
-లేకపోతే వైకాపా నాయకత్వమే ఆయన్ని పంపేసిందా?
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

వైయస్ షర్మిళా రెడ్డి అని నిన్న మొన్నటి వరకు సాక్షి దినపత్రికలో రాసుకుని, ఇప్పుడు ఆమె రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టగానే మొరసుపల్లి షర్మిళా శాస్త్రి అని రాస్తారా?, ఇదేమి పైత్యమని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణంరాజు విమర్శించారు. మొదట షర్మిళా రెడ్డి అని ఆ రాసిన మీరే ఇప్పుడు ఆమెను రెడ్డి కాదని అంటే మీ ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసములో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వైయస్ రాజారెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిలు కూడా రెడ్డి కాదా?, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ది వేరే కులమా? వాళ్లు ముగ్గురు రెడ్డి అయినప్పుడు షర్మిళ… రెడ్డి కాకుండా ఎందుకు పోతారని నిలదీశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె గురించి నోటికి వచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషిస్తుంటే రక్తం మరిగిపోతుంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు గురించి వాళ్ల అబ్బాయే మాట్లాడిస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోంది.

కుటుంబం జోలికి వస్తే ఊరుకోమని చెప్పి, ఇప్పుడు సోదరి గురించి తన అనుచరులు, ఎన్నారై వింగ్ ప్రతినిధులు సభ్య సమాజం తలదించుకునే విధంగా దూషిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఖండించరా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఇక ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ వివేకాకు పట్టిన గతి షర్మిల కు పడుతుందని బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. సజ్జల బెదిరింపుల నేపథ్యంలో, షర్మిల అన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళవద్దు. ఎప్పటినుంచో ప్రతిపక్ష పార్టీలు, పాలక పక్షంలో ప్రతిపక్షంగా ఉన్న నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాము . ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి, ప్రత్యేక హోదా తీసుకురావడం దేవుడు ఎరుగు…కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన పాపాన పోలేదని షర్మిల ప్రశ్నిస్తే తప్పా? అంటూ నిలదీశారు.

దానికి అక్కడ తంతే ఇక్కడకు వచ్చావంటూ కారు కూతలు కూయడం ఎందుకన్నారు. తెలంగాణలో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల తన ఆశయాన్ని నెరవేర్చుకుంది. అక్కడి ప్రభుత్వాన్ని దించాలనుకుంది తప్పితే, తానేమీ ముఖ్యమంత్రి కావాలని కోరుకోలేదు. తెలంగాణలోని గత ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోవడంలో ఆవిడ కూడా ప్రముఖ పాత్ర పోషించారు. ఇప్పుడు పుట్టింటికి వచ్చింది. పుట్టిల్లులో అరాచకాలు అధికంగా జరుగుతుండడంతో, అత్తారిల్లు సర్దుకుంది. ఇక ఇప్పుడు పుట్టింటిని సరి చేసుకోవలసిన బాధ్యత తనపై ఉందని ఆమె భావించింది. ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించి ప్రజలను వైకాపాకు ఓటు వేయమని ఒప్పించింది నేనే కదా అని భావించిన షర్మిల, ఇప్పుడు రాష్ట్రం లో జరుగుతున్న దురాగతాలను చూసి స్పందించి తప్పులను సరిదిద్దడానికి ఒక వ్యక్తిగా మహిళగా రాష్ట్రానికి వచ్చింది.

కాంగ్రెస్ పార్టీకి ఎంత ఓట్ల శాతం వస్తుంది… సీట్లు ఎన్ని వస్తాయన్నది నాకు అనవసరమని రఘురామకృష్ణం రాజు తేల్చి చెప్పారు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని కాదు. త్వరలోనే నేను ఏ పార్టీలో చేరబోతున్నానో ఇప్పటికే స్పష్టత ఇచ్చాను. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీని అయినా ఆహ్వానించాల్సిందే. ఆ పార్టీలో లోపాలు ఏమైనా ఉంటే వాటిని మాత్రమే ఎత్తిచూపాలి. ప్రజలకు నిజాలను తెలియజేయడానికి అందరికీ సమానమైన హక్కులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉన్న నిజాలను చెబితే వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దారుణం. వైకాపా అధికారిక సోషల్ మీడియా పేజీ లో నీ చెల్లి గురించి నీ అనుచరులే అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ, అనరాని మాటలు అంటుంటే జగన్మోహన్ రెడ్డి వారించకపోవడం సిగ్గుచేటు.

కచ్చితంగా వైకాపా ఓటు బ్యాంకు చీలుతుంది. వైకాపా ఓటు బ్యాంకు ఆరు నుంచి 10% వరకు కాంగ్రెస్ పార్టీ వైపు షిఫ్ట్ అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదంతా నా ప్రస్తుత పార్టీకి పెద్ద బొక్కేనని రఘురామకృష్ణం రాజు అన్నారు. గత రెండేళ్ల క్రితమే వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తారని నేను పేర్కొన్నాను. కానీ నా మాటలను కొంతమంది తప్పు పట్టారు. ఈరోజు, నేను గతంలో చెప్పింది నిజమై పోలేదా? అని ఆయన ప్రశ్నించారు. షర్మిల కు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారని నేను ఒక టీవీ ఛానల్ డిబేట్లో లేకుంటే ఒకరిద్దరూ నాయకులు తెలియని తనముతో తెలివి తక్కువ తనం తో మాట్లాడారు. పాయింట్ లేకుండా నేను ఏదీ మాట్లాడనని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.

ఘోర పరాజయం దిశగా వైకాపా
గతంలో నేను చెప్పినట్లుగానే పరాజయం దిశగా కాదు… ఘోర పరాజయం దిశగా వైకాపా పయనిస్తోందని రఘురామకృష్ణం రాజు అన్నారు. అందుకే నా ప్రస్తుత పార్టీ నాయకులలో టెన్షన్ నెలకొంది. దొంగ సర్వేలను ప్రజల పైకి వదులుతున్నారు. సదరు సర్వే సంస్థలకు క్రెడిబిలిటీ ఉందని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా, గతంలో తమ అంచనా వేసిన ఫలితాలే వెల్లడయ్యాయని చెప్పే ప్రయత్నాన్ని చేస్తున్నారు. గత ఎన్నికల ఫలితాలను బ్యాక్ డేట్ లో అప్లోడ్ చేసి, ఎన్నికలకు ముందే పోస్టు చేసిన ఫలితాల అంచనా జాబితాను డిలీట్ చేసే సంస్థలు, రానున్న ఎన్నికల్లో వైకాపాకు 110 స్థానాలు, తెదేపాకు 60 స్థానాలు వస్తాయని అంచనాలు వేయడం హాస్యాస్పదంగా ఉంది.

కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు, మంగళగిరిలో నారా లోకేష్, భీమవరంలో పవన్ కళ్యాణ్ లు విజయం సాధిస్తారని చెప్పే , సర్వే సంస్థలు వేసే సినిమా స్టంట్ లు ఎవరికి తెలియనివని ప్రశ్నించారు. వైకాపాకు 50 నుంచి 52 స్థానాలకు మించి దక్కవని పందెం రాయళ్లు పందాలను కాస్తున్నారు. అంటే దీన్నిబట్టి వాస్తవ పరిస్థితి ఏమిటో అర్థం అయిపోతుంది. ఇటువంటి బోగస్ సర్వే అంచనాలను నమ్మాల్సిన పనిలేదు. రాంగ్ క్రెడిబిలిటీ తో గతంలో మేము చెప్పిన అంచనాలే నిజమయ్యాయని నమ్మించే ప్రయత్నాన్ని ప్రజలు గమనించాలి. అయినా, షర్మిల పుంజుకుంటే వైకాపాకు 30 నుంచి 35 స్థానాలకు మించి దక్కే అవకాశాలు లేవని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.

50 సీట్లు కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ సాక్షి దినపత్రిక చెవిలో చెప్పారా?
ఎన్నికల పొత్తులో భాగంగా 50 స్థానాలను కోరుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమైనా సాక్షి దినపత్రిక చెవిలో చెప్పారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. సీట్ల కేటాయింపులో తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు అన్యాయం చేస్తారేమోనని సాక్షి దినపత్రిక వార్తా కథనం చూస్తే విడ్డూరంగా ఉంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ పై అసత్య కథనాలను రాస్తూ, పొద్దున లేస్తే మొదలు దూషించే సాక్షి దినపత్రికకు తెదేపా, జనసేన కూటమి సీట్ల సర్దుబాటు గురించి ఏమీ అవసరమని ఆయన నిలదీశారు.

సీట్ల సర్దుబాటు గురించి ఎక్కువ సమయానికి తీసుకుంటున్నారని సాక్షి దినపత్రిక తన వార్తా కథనం లో పేర్కొనడంపై రఘురామకృష్ణం రాజు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. తెదేపా, జనసేన కూటమి సీట్ల సర్దుబాటును గురించి ఎప్పుడు చేసుకుంటే, సాక్షి దినపత్రికకు వచ్చిన నష్టం ఏమిటి?. ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి. ఎంపీ టికెట్ కోసం 140 కోట్ల రూపాయలను వైకాపా నాయకత్వం అడిగిందని ఇన్ డైరెక్టుగా చేసిన వ్యాఖ్యలపై సాక్షి దినపత్రిక సమాధానం చెప్పాలి. నర్సాపురం నియోజకవర్గంలో నాపై పోటీ చేయమని ఏ రాజుతో మాట్లాడారో, కాపు నాయకునితో మాట్లాడారో నాకు తెలుసు.

నాపై పోటీ చేసే అభ్యర్థులు దొరకక దేహి.. దేహి అంటూ తిరుగుతున్నారు. నేను తెచ్చుకున్న పదవిని పీకేసి వల్లభనేని బాలశౌరికి కట్టబెట్టారు. ఫైనాన్స్ కమిటీ మెంబర్ గా కూడా అవకాశాన్ని ఇచ్చారు. దానికి కన్సిడరేషన్ ఏమిటో తెలియదు. బాలశౌరి వైకాపాను ఎందుకు వీడారో తెలియదు. లేకపోతే వైకాపా నాయకత్వమే ఆయన్ని పంపేసిందా? అన్న దానిపై సాక్షి దినపత్రిక స్పందిస్తే బాగుంటుంది. బాలశౌరి కిరీటాలు పెట్టుకున్న స్వాగతిస్తున్న వైకాపా నాయకత్వం ఆయన్ని బయటకు పంపేసిందనే దాని కంటే ఆయనే బయటకు వచ్చారన్నది నిజం. సంజీవ్ కుమార్ ఎందుకు బయటకు వెళ్లారో చెప్పాలి. కర్నూలు ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పినా వద్దని ఎందుకు అంటున్నారో సాక్షి దినపత్రికలో రాస్తే బాగుంటుందని రఘురామకృష్ణంరాజు అన్నారు.

షర్మిళ బాణం అన్నకు గట్టిగానే గుచ్చుకుంది
షర్మిల సంధించిన బాణం అన్న జగన్మోహన్ రెడ్డికి గట్టిగానే గుచ్చుకుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన షర్మిళ, కొన్ని అర్థవంతమైన ప్రశ్నలను సంధించారు. గతంలో ఈ తరహా ప్రశ్నలను ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు, నేను కూడా ప్రశ్నించడం జరిగింది. క్రైస్తవులకు అన్యాయం జరిగితే, ఒక క్రైస్తవుడిగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని షర్మిల నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అయినప్పటికీ క్రైస్తవులపై అట్రాసిటీలు జరగలేదనే ఉద్దేశంతో ఆయన ప్రశ్నించలేదేమో. అదే విషయాన్ని ఆయన చెప్పవచ్చు. రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగినప్పుడు ఉద్రిక్తతలు తలెత్తుతాయి. దానికి అధికారములోని పార్టీని బాధ్యున్ని చేయడం సమంజసమేనా? అన్న రఘురామ కృష్ణంరాజు… ఇతరులను విమర్శించడానికి ముఖ్యమంత్రి వద్ద గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే అనుమతి లభించేది.

కానీ ఇప్పుడు సుబ్బారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, వైకాపా సోషల్ మీడియా విభాగం అందరూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. గతంలో ప్రత్యేక హోదా గురించి గొంతు చించుకున్నారు జగన్ రెడ్డి… మరి ఇప్పుడు నోరు పడిపోయిందా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అందులో తప్పేముంది?,. 25 ఎంపీ స్థానాలు ఇవ్వమంటే, రాజ్యసభ సభ్యులకు కలుపుకొని 31 మంది ఎంపీలను ఇచ్చారు. అయినా ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారని అడగటం లో తప్పేముంది. మూడు రాజధానులను పేర్కొన్న ముఖ్యమంత్రి ఒక్క రాజధాని కూడా ఎందుకు నిర్మించలేదని పీసీసీ అధ్యక్షురాలి హోదాలో షర్మిల సంధించిన ప్రశ్నకు, జగన్మోహన్ రెడ్డి తన అనుచరులను ఉసిగొల్పి బూతులు తిట్టించి, ఒక స్త్రీ గురించి నీచంగా మాట్లాడించడం భావ్యమేనా? అని మహిళా లోకం ప్రశ్నిస్తోంది.

సొంత చెల్లిని గౌరవించని వ్యక్తి, మిగిలిన మహిళలను ఏమి గౌరవిస్తారని నిలదీస్తోంది. మహిళా లోకంలోని ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. నిజాయితీగా కొన్ని ప్రశ్నలు సంధిస్తే దానికి సమాధానం చెప్పడం మానేసి, కాంగ్రెస్ లోకి వెళ్లడం ఏమిటని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిందే కాంగ్రెస్ పార్టీ… వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ జీవితాన్ని ఇచ్చి ఎంపీ గా గెలిపించింది కాంగ్రెస్ పార్టీ అని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు . జగన్మోహన్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులను బనాయించిందని భావిస్తే, న్యాయస్థానాలకు హాజరై నిర్దోషిగా నిరూపించుకొని కాంగ్రెస్ పార్టీ తనపై అక్రమ కేసులను బనాయించిందని ప్రజలకు చెప్పాలి.

అంతేకానీ కేసుల విచారణకు న్యాయస్థానాలకు హాజరు కాకుండా, తనపై కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులను బనాయించిందని, 16 నెలలు జైల్లో పెట్టిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల పాదయాత్ర చేసింది. 2014 లోను చెప్పులు అరిగేలా రాష్ట్రమంతా తిరిగింది. 2019లో చెప్పులే కాదు కాళ్లు అరిగేలా వైఎస్ షర్మిల రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం తిరిగారు. షర్మిల తో పాటు ఆమె భర్త బ్రదర్ అనిల్ కూడా తిరిగారు. నర్సాపురం లోక్ సభ స్థానంలో తెదేపా పటిష్టంగా ఉన్నప్పటికీ, వారిద్దరు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నో సభలకు హాజరు కావడం, అభ్యర్థి నేను కావడం వల్లే గెలువగలిగాం. పోటా పోటీ ఉన్న స్థానాలన్నీ వైయస్ షర్మిల ప్రచార ప్రభావంతోనే వైకాపా గెలిచిందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

జైల్లోనే దస్తగిరికి బెదిరింపులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవల్ గా మారిన దస్తగిరిని జైల్లోనే ఈ కేసు లోని మరో నిందితుడైన శివ శంకర్ రెడ్డి తనయుడు డాక్టర్ చైతన్య రెడ్డి, ఆయన సోదరుడు కలిసి బెదిరించినట్లు తెలిసిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . ఈ విషయం నాకు కడప వాసుల ద్వారానే తెలిసిందని చెప్పారు. పిటి కేసులో కడప జైల్లో ఉన్న దస్తగిరిని, జైలులో వైద్య శిబిరం నిర్వహించిన డాక్టర్ చైతన్య రెడ్డి కలుసుకునే అవకాశాన్ని జైలు అధికారులు ఎలా ఇచ్చారు.

జైల్లో దస్తగిరిని కలిసిన డాక్టర్ చైతన్య రెడ్డి, సిబిఐ అధికారి రామ్ సింగ్ బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నారని చెప్పాలని, లేకపోతే రిస్కులో పడతావని హెచ్చరించినట్లు తెలిసిందన్నారు. సిబిఐ అధికారి రాంసింగ్ పైనే కేసులు నమోదు చేసిన ఘనత ఏపీ పోలీసులది. జైలులో ఉన్న దస్తగిరి పిటి కేసు నుంచి బయటకు వస్తే, ఆయనపై మరో పిటి కేసు నమోదు చేస్తారన్నారు. ఒకవేళ దస్తగిరి ఏదైనా ప్రమాదం జరిగినా, ఆయన ఒకవేళ మాట మార్చిన
దానికి ఈ కేసులో సహ నిందితులుగా ఉన్నవారి బెదిరింపులే కారణమని రఘు రామ కృష్ణంరాజు అన్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా మారిన తర్వాతే వ్యూహం సినిమా విడుదల
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా మారిన తర్వాతే వ్యూహం సినిమా చూసే భాగ్యం దక్కుతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. వల్లభనేని బాలశౌరి అనుచరుడైన దాసరి కిరణ్ కుమార్, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం సినిమాలో నేరుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పేర్లను పాత్రలకు పెట్టి నీచంగా మాట్లాడించారు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేశారు. రివైజ్డ్ చేసి ఏ సంగతి క్లియర్ గా రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఆ రిపోర్టు ఇచ్చిన తర్వాత కోర్టే ఈ సినిమాను చూస్తుందా?, ఏమి చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. అయినా అప్పటికే ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇటువంటి సినిమాల విడుదలకు అనుమతి ఇవ్వరని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

రాముడంటే భయం లేదు… భక్తి మాత్రమే ఉంటుంది
శ్రీరామ చంద్రుడు అంటే భక్తులకు భయం ఉండదని, భక్తి మాత్రమే ఉంటుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. అయోధ్యనగరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. 500 ఏళ్ల నాటి భక్తుల కల బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టతో తీరింది. బాబర్ హయాంలో కూల్చబడినట్లుగా చెబుతున్న దేవాలయం, పునర్ నిర్మించుకొని కన్నుల పండుగ ప్రారంభం కావడంతో దేశమంతా శ్రీరామ నామస్మరణతో మారు మోగింది. దేశంలో రామాలయం లేని ఊరు లేదు. రాముని లోని విశిష్టత ఏమిటంటే… సత్యవాక్కు పరిపాలన . ప్రస్తుతం సమకాలీన జీవితంలో ఎంతోమంది పనికిమాలిన నాయకులను చూస్తున్నాము.

ఒక నాయకుడు, కొడుకు ఎలా ఉండాలో… ఒక భర్త, ఒక రాజు ప్రజాభిష్టానికి ఎలా గౌరవం ఇవ్వాలో శ్రీరాముడిని చూసి నేర్చుకోవాలి. పురుషోత్తముడు , ఆదర్శ పురుషుడైన ఆయన్ని దేవుడిగా ఆరాధిస్తున్నాం. ఒక సంస్కృతి నిలబడాలన్న, బాగుపడాలన్న ఆరాధించే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని బట్టే మన ప్రవర్తన, నియమావళి ఉంటుంది. ఒక ఆదర్శ పురుషుడిగా ఉండాలనుకుంటే శ్రీరాముని ఉదాహరణగా మన పెద్దలు గుర్తించేవారు. ఇప్పటి తరం ఆ విషయాన్ని మర్చిపోతోంది. 500 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించి, అచిర కాలములోనే అయోధ్య రామాలయాన్ని అద్భుతంగా తీర్చిదినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, దేవాలయ ట్రస్ట్, సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి అభినందనలను తెలియజేయాల్సిందే.

ఒకవైపు అత్యద్భుతంగా రామాలయాన్ని తీర్చిదిదితే, రామతీర్థంలో రాముల వారి తల నరికారు. ఈరోజుకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. వాళ్లు దొరకలేదట… సిబిఐకి కేసును అప్పగిస్తామని చెప్పారు… ఇప్పుడు సిబిఐ కేసు టేకప్ చేయకపోతే మేమేమి చేస్తామని అంటున్నారు. రాముని తల నరికి నా పట్టించుకోని నాయకుడు ఒకవైపు అయితే, దేశ వైభవాన్ని ఔన్నత్యాన్ని చాటిచెప్పే రామతత్వాన్ని పున ప్రతిష్టించిన మహానుభావుడు మరొక వైభవని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

1 COMMENTS

LEAVE A RESPONSE