Suryaa.co.in

Andhra Pradesh

సనాతన ధర్మ విశిష్టతను చాటిన క్షణాలివి

  • భారతీయుల భావోద్వేగ సమయం… అయోధ్య శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఘట్టం
  • ఈ అపురూప క్రతువుకి హాజరుకావడం అదృష్టం
  • అయోధ్యలో జాతీయ మీడియాతో మాట్లాడిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 

అయోధ్య రామ మందిర ప్రారంభం, ఆలయంలో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆదివారమే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అయోధ్య చేరుకున్నారు. శ్రీరాముడు జన్మించిన పుణ్య స్థలిలో అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు. జగదభిరాముణ్ణి అక్కున చేర్చుకున్న అయోధ్యాపురిని తిలకిస్తూ ఆ ప్రాంత విశిష్టతలను తెలుసుకున్నారు. శ్రీరామ నామ జపంతో మార్మోగుతుండగా  శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో సోమవారం పాల్గొన్నారు. రామ మందిరం దగ్గర సెల్ఫీ తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంలో జాతీయ మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘అయోధ్య ఆలయ నిర్మాణం కోసం భరత జాతి కొన్ని శతాబ్దాలపాటు వేచి చూసింది. నేటి కార్యక్రమ సమయం ఓ ఉద్వేగ క్షణం.  కొన్ని తరాలు ఆశగా ఎదురుచూసిన ఘడియలివి. నిజంగా ఇది భారతీయులందరికీ భావోద్వేగ సమయం. ఈ మహా ఘట్టాన్ని కనులారా చూస్తుంటే అనుకోకుండానే నా కళ్ళు ఆనందంతో చెమర్చాయి.

ఈ అపూర్వమైన, చరిత్రాత్మకమైన క్రతువులో పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. అయోధ్యలోని శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం భారతీయులందరీ ఐక్యతను, జాతి సంకల్పాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాయి. భారతీయుల్లో అణువణువునా నిండి ఉన్న సనాతన ధర్మం గొప్పదనాన్ని మనం ఎల్లలు దాటి చూపించగలిగాం. ఉత్తరాది నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి ఎంతో భక్తిభావంతో వస్తారు. ఇప్పుడు దక్షిణాది నుంచి శ్రీ రాముడి దర్శన భాగ్యం కోసం అయోధ్యకు వస్తారు. ఇది భారతీయుల సమైక్యతను మరింత పెంచుతుంది. అయోధ్య నగరం దేశంలోనే ఓ విశిష్ట ప్రాంతంగా గుర్తింపు పొందనుంది’’ అన్నారు.

LEAVE A RESPONSE