– పులిహోర ప్రసాదంలో మాంసపు ఎముక
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు.. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. మల్లన్న భ్రమరాంబ దంపతులను దర్శనం చేసుకుని తరిస్తారు. తాజాగా క్షేత్ర పరిధిలో భక్తులకు పులిహోర ప్రసాదం పంపిణి చేశారు. ఈ ప్రసాదంలో మాంసపు ఎముక రావడంతో కలకలం సృష్టించింది. భ్రమరాంబ అమ్మవారి ఆలయం వెనుక బ్రహ్మానందరాయ గోపురం ప్రసాదాల పంపిణీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తనకు పంపిణీ చేసిన పులిహోరలో మాంసపు ఎముకను హరీష్ రెడ్డి అనే భక్తుడు గుర్తించారు. వెంటనే దేవస్థానం అధికారులకు లిఖితపూర్వకంగా ఎముక ముక్కను ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాడు. పవిత్రమైన పుణ్య క్షేత్రంలో ఇటువంటి అపచారాలు జరగడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు.
ఇలా పులిహోర ప్రసాదంలో మాంసం ఎముక రావడానికి కారణం అధికారుల పర్యవేక్షణలో లోపం అంటూ ఆరోపిస్తున్నారు. ఇదెక్కడి దారుణం అంటూ భక్తుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరు నిర్లక్ష్యం అంటూ మండి పడుతున్నారు. పులిహోరలో మాంసపు ఎముకపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి భక్తుడు హరీష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.