Suryaa.co.in

Andhra Pradesh

సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

-ఈస్టిండియా కంపెనీలా బీజేపీ
-భావసారూప్యత కలిగిన పార్టీలతో ముందుకు..
-బీజేపీ… ఒక చేయి వైసీపీతో మరో చేయి టీడీపీతో..
-26న అనంతలో ఖర్గే సభకు తరలిరండి..
– సీడ్ల్యుసీ సభ్యులు గిడుగు రుద్రరాజు

విజయవాడ: చండీఘర్ మేయర్ ఎన్నికకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీడ్ల్యుసీ సభ్యులు, పీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కమలమ్మలతో కలిసి.. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

బీజేపీ చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు ప్రజలందరికీ తెలిసాయని ఆయన తెలిపారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న విధానాన్ని గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అందరికీ చెబుతూనే ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉందని తెలిపారు.

రాముడిని తమతో పాటు కాంగ్రెస్ పార్టీ వారు కూడా పూజిస్తారని., అందరం రాముడిని దేవుడిగా కొలుస్తామని పేర్కొన్నారు. రామునికి ఉన్న కార్యదక్షత మోదీ, అమిత్ షాలలో ఎవరికీ లేదన్నారు. తాజాగా జరిగిన బీజేపీ జాతీయ సమావేశాల్లోనూ అంతా రామనామ స్మరణ… మోదీ నామ స్మరణగా జరిగిందని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ., దేశంలోని పార్టీలను ఆక్రమించడంలో.. గతంలో భారత దేశాన్ని ఆక్రమించిన ఈస్ట్ ఇండియా కంపెనీలా మారిందని గిడుగు రుద్రరాజు విమర్శించారు. ఆర్టికల్ 370., లోక్ సభలో 370 సీట్లు అంటూ విలువలులేని రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ని., స్థానికంగా బీజేపీకి వ్యతిరేంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు.

మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మొదలగు రాష్ట్రాల్లో బీజేపీ చేస్తున్న అక్రమాలు, అరాచకాలు ప్రజలందరూ గమనించాలని పేర్కొన్నారు. సీబీఐ, ఈడీలతో దాడులు చేయించి., కేసులు నమోదు చేయించి.. భయభ్రాంతులకు గురి చేయడం., ఆనక బీజేపీలో చేరిన తరువాత సదరు నేతలపై ఆ కేసులు ఎత్తేయడం పరిపాటిగా మారిందని వాపోయారు. మిలింద్ దేవర., జితిన్ ప్రసాద్, ఆర్పీఎన్ సింగ్ తో పాటు పలువురు నేతలే దీనికి ఉదాహరణ అన్నారు.

రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ విజ్నతతో ఆలోచించాలన్నారు. ఐఐటీలు, ఐఐఎంలు స్థాపించి., నాగార్జున సాగర్, బాక్రానంగల్, హీరాకుడ్ వంటి ఆనకట్టలను కట్టి.. దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా అభివ్రుద్ధి చేసి ప్రజలకు ఎంతో మేలు చేసే కాంగ్రెస్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఆనకట్టలు దేశంలో ఆధునిక దేవాలయాలు అని చెప్పిన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో పాటు ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, మన్ మోహన్ సింగ్ వంటి ఎందరో కాంగ్రెస్ ప్రధానులు దేశాన్ని ఎంతో అభివ్రుద్ధి చేశారని కొనియాడారు.

బీజేపీ వ్యవహార శైలి రాజ్యాంగ వ్యవస్థలకు పూర్తి వ్యతిరేకంగా ఉందని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ఆంధ‌్రప్రదేశ్ కు సంబంధించి., అధికార వైసీపీతో ఒక చేయి., టీడీపీతో మరో చేయి కలిపిన బీజేపీ., మరోపక్క పవన్ కళ్యాణ్ తోనూ తమ పొత్తు కొనసాగిస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎవరకి ఓటేసినా పరోక్షంగా బీజేపీకే ఓటేసినట్లే అన్నారు. అందుకే రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

కేంద్రంలో బీజేపీ వ్యతిరేక, రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసి ముందుకు వెళ‌్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఈ నెల 23వ తేది సీపీఎం అగ్రనేత శ్రీనివాసరావు, సీపీఐ అగ్రనేత రామక్రిష్ణలతో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలిపారు. అనంతరం అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు తేదీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

ఈ నెల 26వ తేదీ అనంతపురంలో జరిగే ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలందరూ తరలి రావాలని గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ తో పాటు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పాల్గొనే ఈ సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అక్రమాలు, అన్యాయలపై గళమెత్తుతామని తెలిపారు. గత పదేళ్లుగా టీడీపీ, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలు రాష్ట్రానికి చేస్తున్న నష్టాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివ్రుద్ధి చెందుతుందన్నారు. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఏ విధంగా అభివ్రుద్ధి చెందిందో అందరికీ తెలుసన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులను కనీసం పార్లమెంట్ లోకి కూడా రాని విధంగా చేసి… మోదీ ఆడుతున్న మైండ్ గేమ్ లో రాష్ట్ర ప్రజలు భాగం కావద్దొని విజ్నప్తి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగతంగా చాలా బలంగా ఉందని సీడ్ల్యుసీ సభ్యులు, పీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు.

శాసన సభకు సంబంధించి ఇప్పటికే 1017 దరఖాస్తులు వచ్చాయని స్పష్టం చేసిన ఆ‍యన., తాజా మాజీలతో పాటు ఎంతో మంది మాజీ ఎమ్మెల్యేలు మళ్లా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విభజన హామీలతో పాటు ఇతర అన్ని అంశాలూ కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆ‍యన తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు, పీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ తులసి రెడ్డి పేర్కొన్నారు. అమరావతి, అనంతపురంతో పాటు కర్నూలులలో మీడియాపై జరిగిన దాడులను ఖండిస్తున్నామని తెలిపారు. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ల పాలన కంటే రాష్ట్రంలో జగన్ దారుణమైన పాలన చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఫ్యాక్షనిస్టులను ఎన్నికల్లో గెలిపిస్తే పాలన ఇలాగే ఉంటుందని., మరోసారి వైసీపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ ను గెలిపించాలని ఆ‍యన పిలుపునిచ్చారు. అదే విధంగా అంతర్జాతీయ మాత్రు భాష దినోత్సవం సందర్భంగా ఇకనైనా ప్రాధమిక విద్యను తెలుగులోనే బోధించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

LEAVE A RESPONSE