Suryaa.co.in

Telangana

ముఖ్యమంత్రి కుర్చీలో రైతు బిడ్డ కూర్చో కూడదా?

– దొరలే కూర్చోవాలా?
– ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేసీఆర్, మోదీ కుట్రలు
– తెలంగాణ ప్రజలను అవమానించిన మోదీ ఓట్లెలా అడుగుతారు?
– కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూస్తే మా ఆడబిడ్డలు మీ గుడ్లుపీకి గోలీలు ఆడుకుంటారు
-10 లక్షల మహిళ ఆడబిడ్డలతో కవాతు
– శిల్పారామం పక్కన స్వయం సహాయక సంఘాల మహిళలకు స్టాల్స్
– మా సైన్యం మీరే.. మా బలగం మీరే
– ఉచిత బస్సు ప్రయాణం వద్దని కవిత, హరీష్,కేటీఆర్ ఆటోడ్రైవర్లతో ధర్నాలు చేయిస్తున్నారు
– ఎవరడ్డుపడ్డా మహిళలకు ఉచితబస్సు ప్రయాణం కొనసాగిస్తాం
– స్వశక్తి మహిళా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళా శక్తి సోనియమ్మ. కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ.. సోనియమ్మ.. ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ పార్టీని నడిపిస్తోంది ఒక మహిళ అని మేం గర్వంగా చెప్పుకుంటాం. పదేళ్ల కేసీఆర్ పాలనలో మహిళా సంఘాలు దివాళా తీశాయి. అందుకే మా ఆడబిడ్డలు కంకణం కట్టుకుని ఎన్నికల్లో కేసీఆర్ ను బండకేసి కొట్టారు.

ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మేం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే…కేసీఆర్, హరీష్, కవిత, కేటీఆర్ కిరాయి ఇచ్చి ఆటో డ్రైవర్లతో ధర్నాలు చేయిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని అమలు చేయొద్దంటున్నారు. ఎవరు అడ్డు వచ్చినా సరే… మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కొనసాగిస్తాం.

రూ.500లకే మహిళలకు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం.గృహలక్ష్మి పథకం ద్వారా పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. భద్రాద్రి రామచంద్ర స్వామి ఆశీస్సులతో ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ప్రారంభించుకున్నాం.ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు ఆర్ధిక సాయం అందించబోతున్నాం.రాష్ట్రంలో 63 లక్షల మంది స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు.63 లక్షలు కాదు.. కోటి మంది సభ్యులు కావాలి.

ఐదేళ్లలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత మాది. అప్పుడే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది… ధనిక తెలంగాణగా మారుతుంది.రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన స్వయం సహాయక సంఘాల మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేస్తాం. మీరు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తాం.

మా ప్రభుత్వాన్ని పడగొడతామని కేసీఆర్ కుటుంబం ఫామ్ హౌస్ లో చిందులు వేస్తోంది. ముఖ్యమంత్రి కుర్చీలో దొరలే కూర్చోవాలా? రైతు బిడ్డ కూర్చో కూడదా? మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేసీఆర్, మోదీ కుట్రలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని ఎవరైనా వస్తే.. మా ఆడబిడ్డలు చీపురు కట్టలు మర్లేసి కొడతారు.

తెలంగాణ ప్రజలను అవమానించిన మోదీ ఓట్లెలా అడుగుతారు? కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూస్తే మా ఆడబిడ్డలు మీ గుడ్లుపీకి గోలీలు ఆడుకుంటారు. రాబోయే కొద్ది రోజుల్లో 10లక్షల మహిళ ఆడబిడ్డలతో కవాతు చేస్తాం. మా సైన్యం మీరే.. మా బలగం మీరే. వచ్చే ఐదేళ్లలో మా ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వానిది.

 

LEAVE A RESPONSE