Suryaa.co.in

Political News

ట్రస్ట్ పాలిటిక్స్

నాలుగు రోజుల క్రితం ఇద్దరు తెలంగాణ జర్నలిస్టులు అమరావతి వచ్చారు. పాత పరిచయం ఉండడంతో ఎక్కడ అంటూ ఫోన్ చేశారు. చాలా రోజులు అయ్యిందని కలిసి, తాడేపల్లి బాలాజీ హోటల్ దగ్గర టీ తాగి రాజకీయాల గురించి కొద్దిసేపు మా అభిప్రాయలు షేర్ చేసుకున్నాం. ఈ సందర్భంగా వారు చెప్పిన మాటలు ఖచ్చితంగా రాజకీయాలను ఫాలో అవుతున్న ఎపి ప్రజలకు చేరాలి అని ఈ పోస్ట్….

ట్రస్ట్ పాలిటిక్స్ పై మా మాటలు సాగాయి. దీనికి కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలో నేడు జరుగుతున్న పరిణామాలు. ప్రతిపక్షంగా తెలుగు దేశం 5 ఏళ్లలో పడిన కష్టాలు, చేసిన పోరాటం పై చర్చ జరిగింది. అణిచివేతను ఎదుర్కొని చంద్రబాబు పార్టీని నడిపిన విధానంపైనా చర్చ జరిగింది. గతంలో 10 ఏళ్ల ప్రతిపక్షంగా, తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ అనేక సవాళ్లను ఎదుర్కొంది.

అయితే పడి లేచే కెరటంలా టీడీపీ మళ్లీ నిటారుగా నిలబడింది. 2014 లో గెలిచింది. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత ఎప్పటి లాగానే టీడీపీ పని అయిపోయిందనే చర్చను తీసుకువచ్చారు. ఎపి ప్రభుత్వ కేసులు, దాడులు, బెదిరింపులు, హింసా రాజకీయాలతో ప్రతి రోజూ టీడీపీని అణిచివేసే ప్రయత్నం చేశారు. అయితే మొదట్లో కొంత ఇబ్బందులు పడినా మళ్లీ తెలుగు దేశం నిలబడింది అంటూ కెసిఆర్, జగన్ లతో పోలుస్తూ వాళ్లు వివరించిన విధానం చాలా కొత్తగా, ఆసక్తిగా అనిపించింది. అదే ట్రస్ట్ పాలిటిక్స్.

తెలంగాణలో 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలన సాగిన విధానం….ఆ తరువాత 2023 ఎన్నికల్లో ఓటమి తరువాత ఆ పార్టీ పరిస్థితులు వారి చెపుతుంటే కాస్త ఆశ్చర్యం వేసింది. 10 ఏళ్ల పాటు అధికారంలో అంగ, అర్థ బలంతో….తెలంగాణ అంటే తామే అనే పార్టీ….నేడు డీలా పడిన విధానం నిజమేనా అనిపించింది. ఇప్పుడు వచ్చిన లోక్ సభ ఎన్నికలకు బిఆర్ఎస్ కు అభ్యర్థులు కూడా దొరకడం లేదని…చాలా మందికి పిలిచి సీటు ఇస్తాము అని చెప్పినా ఆసక్తి చూపడం లేదని ఆ ఇద్దరు జర్నలిస్ట్ మిత్రులు చెపితే మొదట నమ్మలేదు. కానీ వాస్తవాలు వివరించిన తరువాత కాదనలేక పోయాను.

10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి బిఆర్ఎస్ పెద్దలు అనుసరించిన అహంకార విధానమే నేటి దుస్థితికి కారణం అని నేతలు చెపుతున్నారు. పార్టీ నేతలకు, పార్టీ లో వ్యక్తులకు ఏ మాత్రం విలువ లేకుండా అధిష్టానం వ్యవహరించిన తీరు వల్లనే ఈరోజు అక్కడ సీన్ పూర్తిగా తిరగబడిందని చెప్పారు. దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ ను వీడతారు అని ప్రచారం జరుగుతోంది.

ఇంత మంది వెళ్లడం నిజం కాకపోయినా అందులో సగం మంది ఇప్పటికే కాంగ్రెస్ కు టచ్ లోకి వెళ్లారు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం పార్టీ నాయకత్వంపై నేతలు,ఎమ్మెల్యేలు ట్రస్ట్ (నమ్మకం,) కోల్పోయారు అని వాళ్లు చెప్పారు. పార్టీతో నాయకులకు అనుబంధం లేకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి అని అక్కడ పరిస్థితి చాటిచెపుతోంది.

ఇదే సమయంలో టీడీపీ ప్రయాణం, చంద్రబాబు నాయకత్వాన్ని పోల్చి మరీ వాళ్లు విశ్లేషించిన విధానం వారి అభిప్రాయాలకు, వాదనకు జస్టిఫికేషన్ ఇచ్చింది. ఈ 5 ఏళ్లలో అనేక మంది టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వ పాలనలో జైలు పాలు అయ్యారు. స్వయంగా చంద్రబాబును కూడా జైల్లో పెట్టారు. ఇలా ఒక్కటని కాదు. అనేక సవాళ్లను, సమస్యలను ఎదుర్కొన్నారు. అయినా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరలేదు. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ టీడీపీ జెండా వీడలేదు.

సోషల్ మీడియాలో పోస్టులకే సిఐడి అరెస్టులు చేస్తున్నా నేతలు పార్టీపై నమ్మకం కోల్పోలేదు. కాడి వదిలెయ్యలేదు. ప్రలోభాలు, ఒత్తిళ్లు ఉన్నా నేతలు అంతా…. చంద్రబాబు నే నమ్ముకుని ఉన్న విధానం నిజంగా అద్భుతం. ఇదే ట్రస్ట్ రాజకీయం అని వాళ్లు విశ్లేషించారు. ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు….ఒక్క ఘటనతో పోయేదీ కాదు అన్నమాట నూరు శాతం నిజం.

అంగ బలం, అర్థ బలం ఉన్న బిఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిన నెలలోనే ఖాళీ అయ్యే పరిస్థితికి వచ్చింది…. 151 మందితో గెలిచి అన్ని విధాలా బలిసి ఉంది అని చెప్పుకుంటున్న వైసీపీలో ఇప్పటికే 15 మంది ఎంపిలు, ఎమ్మెల్యేలు పార్టీ వీడారు. అంటే వైసీపీలో కూడా ట్రస్ట్ అనేది కనిపించడం లేదు. జగన్ నాయత్వంపై నేతల్లో విశ్వాసం కనిపించడం లేదు. టిక్కెట్లు ఇస్తా, ఎన్నికల ఖర్చులు భరిస్తాం అని అధికార పార్టీ హామీ ఇస్తుంటే కూడా నేతలు ఎంపి సీట్లను సైతం వద్దు పొమ్మని బయటకు వస్తున్నారు అంటే…..వైసిపిలో పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది.

అక్కడ టిఆర్ఎస్ ఎలా అయితే ఓటమితో అధిష్టానం నమ్మకాన్ని కోల్పోయిందో…ఇక్కడ ఎన్నికలకు ముందే అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేపు ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందితే ఎంత మంది నాయకులు జగన్ తో ఉంటారు అనేది చెప్పలేం. జగన్ ఈ 5 ఏళ్లలో నేతలను నేతల్లా చూడలేదు. ఎవరికీ గౌరవం లేదు….మర్యాద లేదు. కనీసం, ఎంపిలు, మంత్రులను కూడా పట్టించుకోలేదు.

90 మందిని బదిలీలు అంటూ అటు ఇటు మార్చాడు. ఇప్పుడు సీట్ల కోసం విధి లేక నాయకుడిపై నమ్మకాన్ని నటిస్తున్న వీరంతా రేపు తిరుగుబాటు చేయకుండా ఉంటారా? జగన్ అధికారంలో ఉన్నప్పుడే ఈ స్థాయిలో నాయకుల నమ్మకాన్ని కోల్పోతే…రేపు ఓడిపోతే పార్టీలో ఇక నేతలు ఉంటారా…బిఆర్ఎస్ ను మించిన స్థాయి దుస్థితి తప్పదా?

గెలుపు ఓటముల కంటే కూడా ఒక నాయకుడు అనుసరించే విధానం, పార్టీని నడిపే సామర్థ్యం, దూరదృష్టితో చేసే రాజకీయాలు, నమ్మకం అనేవే పార్టీలను నిలబెడతాయి అని చంద్రబాబు ను చూస్తే అర్థం అవుతాయి అని వాళ్లు విశ్లేషించారు. చంద్రబాబు ను విమర్శించేవారు ఆయన చేస్తున్న ట్రస్ట్ పాలిటిక్స్ ఏంటో….వాటి విలువ ఏంటో….అవి ఆటుపోట్లను తట్టుకుని ఒక రాజకీయ పార్టీని సమున్నతంగా ఎలా నిలబెడుతున్నాయో కచ్చితంగా తెలుసుకోవాలి. కేవలం పార్టీ కార్యకర్తలే కాదు…సామాన్య ప్రజలు కూడా నేటి రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని అడుగు వేయాలి. అందుకే మా మధ్య జరిగిన సంభాషణను పోస్టు రూపంలో సోషల్ మీడియాలో పెడుతున్నాను…..

– రమేష్

LEAVE A RESPONSE